Anna varsity case | బాధితురాలికి ఉచిత విద్య, రూ. 25 లక్షల పరిహారం
మానసిక ఒత్తిడికి గురైన బాధితురాలికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై మద్రాస్ హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. పోలీసులను తీవ్రంగా విమర్శిస్తూనే..ఈ కేసును మహిళలతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)తో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిట్ బృందంలో ఐపీఎస్ అధికారులు బి. స్నేహా ప్రసాద్, అయ్మన్ జమాల్, ఎస్. బృంద ఉన్నారు.
‘రూ. 25 లక్షలు చెల్లించండి’
ఎఫ్ఐఆర్ లీక్ కావడం వల్ల మానసిక ఒత్తిడికి గురైన బాధితురాలికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తులు ఎస్.ఎం. సుబ్రమణ్యం, వీ. లక్ష్మీనారాయణన్‌తో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే యూనివర్సిటీ ఆమెకు ఉచిత విద్య, వసతి కల్పించాలని, ఆమె చదువు నిలిచిపోకుండా చూడాలని కోర్టు స్పష్టం చేసింది.
‘సీబీఐ అవసరం లేదు’
AIADMK తరఫున ఆర్. వరలక్ష్మి, BJP తరఫున ఎ. మోహన్ దాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కోర్టు స్వయంగా విచారణ చేపట్టింది. అయితే, పిటిషనర్లు కోరినట్లుగా సీబీఐ దర్యాప్తు అవసరం లేదని కోర్టు చెప్పింది.
సాంకేతిక సమస్య వల్లే..
ఎఫ్ఐఆర్ లీక్ కాలేదని, ఎఫ్ఐఆర్ అప్‌లోడ్ చేసే పోర్టల్‌లో సాంకేతిక సమస్య కారణంగా బయటకు వచ్చిందని అడ్వకేట్ జనరల్ పి.ఎస్. రమణ్ వాదించారు. అప్పటికే దాన్ని 14 మంది చూసారని, వారిని గుర్తించి, వారిపై కేసు కూడా పెట్టామని AG తెలిపారు. పోలీస్ కమిషనర్ మీడియా ప్రభావానికి లోనవుతున్నారా? అని కోర్టు ప్రశ్నించింది. ప్రెస్ స్వేచ్ఛను అడ్డుకోలేమని, కానీ మీడియా తప్పుచేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
అసలేం జరిగింది?
చెన్నై అన్నా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని డిసెంబరు 23న రాత్రి తన స్నేహితుడితో కలిసి వర్సిటీ ప్రాంగణంలో మాట్లాడుతుండగా.. అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆమె స్నేహితుడిపై దాడి చేసి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం తనపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను ఫొటోలు తీసి, తమపై ఫిర్యాదు చేస్తే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా డిసెంబరు 23న నిందితుడు జ్ఞానశేఖరన్‌ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు.