పాత జీఎస్టీ బకాయిలను రద్దు చేసిన సీఎం సిద్దరామయ్య
చిరు వ్యాపారులకు పన్ను నోటీసులు అందజేసిన జీఎస్టీ అధికారులు, యూపీఐ నుంచి క్యాష్ కావాలని వ్యాపారుల బోర్డులు, స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం;
By : The Federal
Update: 2025-07-24 11:01 GMT
యూపీఐ లావాదేవీల ఆధారంగా వేలాది మంది చిన్న వ్యాపారులకు జారీ చేసిన జీఎస్టీ నోటీసుల వల్ల ఏర్పడిన గందరగోళాన్ని కర్ణాటక ప్రభుత్వం పరిష్కరించింది. నోటీసులు జారీ చేసిన పాత పన్ను బకాయిలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు.
అయితే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జీఎస్టీని నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నిర్ణయం నేపథ్యంలో వాణిజ్య సంస్థలు తమ నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకున్నాయి.
వాణిజ్య పన్ను శాఖ జారీ చేసిన జీఎస్టీ నోటీసులకు సంబంధించి బుధవారం సిద్దరామయ్య అధ్యక్షతన వివిధ వాణిజ్య సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వ్యాపారుల ఆందోళన..
‘‘జీఎస్టీ నోటీసులకు సంబంధించి చిన్న వ్యాపారులలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. వ్యక్తిగత, రుణ లావాదేవీలను కూడా వ్యాపార లావాదేవీలుగా పరిగణించారు.
జీఎస్టీ గురించి కచ్చితమైన సమాచారం లేకపోవడం వలన ఈ సమస్య తలెత్తింది. అందువల్ల పాత బకాయిలను రద్దు చేసి, హెల్ప్ లైన్ ప్రారంభించాలి’’ అని సమావేశంలో వాణిజ్య సంస్థల ప్రతినిధులు అన్నారు.
వ్యాపారుల ఆందోళనలకు ప్రతిస్పందిస్తూ ‘‘వ్యాపారులను వేధించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. ప్రభుత్వం చిన్న వ్యాపారుల పక్షాన ఉంది. పాలు, కూరగాయలు, పండ్లు, మాంసం వంటి ముఖ్యమైన వస్తువుల వ్యాపారులకు పన్ను మినహయింపులు ఉన్నాయి. వారికి నోటీసులు జారీ చేసినప్పటికీ పన్ను వసూలు జరగదు. అయితే చట్టబద్దంగా పన్నులు చెల్లించాల్సిన వారు అలా చేయాలి’’ అని సీఎం అన్నారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి..
నోటీసులు జారీ చేయబడిన పాత పన్ను బకాయిలను ప్రభుత్వం వసూలు చేయవద్దని, వాటిని మాఫీ చేస్తామని సిద్దరామయ్య వ్యాపారులకు హమీ ఇచ్చారు. ‘‘అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జీఎస్టీ కోసం నమోదు చేసుకోవాలి. మీ వ్యాపార లావాదేవీలను చట్టబద్దంగా నిర్వహించడానికి ప్రభుత్వం సాయం అందిస్తుంది’’ అని ఆయన చెప్పారు.
గత రెండు మూడు సంవత్సరాలలో 4 మిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు నిర్వహించిన దాదాపు 9 వేల మంది వ్యాపారులకు 18 వేల నోటీసులు అందాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
దేశంలో జీఎస్టీ వసూళ్లలో కర్ణాటక రెండో స్థానంలో ఉందని పారదర్శకంగా పనిచేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో సంతృప్తి చెందిన వాణిజ్య సంస్థల ప్రతినిధులు, బంద్ లతో సహ అన్ని రకాల నిరసనలను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు.