విక్రమ్ మిస్రీ లక్ష్యంగా జరుగుతున్న ట్రోల్స్ పై కాంగ్రెస్ ఎంపీ ఆగ్రహం
మీరు ఇంతకంటే భిన్నంగా ఏం చేస్తారన్నా శశిథరూర్.. ఖండించిన రాజకీయ పార్టీలు, ఐఏఎస్ అసోసియేషన్;
Translated by : Chepyala Praveen
Update: 2025-05-12 11:57 GMT
భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పై సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోలింగ్ జరగడంపై కాంగెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ దౌత్యవేత్త అయిన థరూర్ ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ట్రోలింగ్స్ ను తప్పు పట్టారు. భారత్,పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను విదేశాంగ కార్యదర్శి నిర్వహించిన తీరును ఆయన ప్రశంసించారు.
ప్రభావవంతమై పనితీరు..
విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ అత్యుత్తమంగా పనిచేశారని ప్రశంసించారు. మిస్రీది ప్రభావవంతమైన స్వరంగా అభివర్ణించారు.
మిస్రీ చాలా కష్టపడి చాలా గంటలు పనిచేశారని, భారత్ కోసం ఇద్దరు మహిళా అధికారులు ఎంతో ప్రశాంతంగా వృత్తిపరమైన నిబద్దతను ప్రదర్శించారని, అద్భుతంగా ఆకట్టుకునే విధంగా మాట్లాడారని థరూర్ చెప్పారు.
‘‘భూమి మీద ఎవరు ట్రోల్ చేస్తారో, ఎందుకు చేస్తారో నాకు అర్థం కావడం లేదు. వారు దేనిని విమర్శిస్తారు. ఈ వ్యక్తులు అంతకంటే భిన్నంగా ఏం చేస్తారు? ’’ అని థరూర్ ప్రశ్నించారు.
మిస్రీకి సమర్థనగా రాజకీయ పార్టీలు
అనేక రాజకీయ పార్టీలు కూడా మిస్రీకి మద్దతుగా నిలిచాయి. ‘‘మిస్రీ ఒక మంచి నిజాయితీపరుడైన, కష్టపడి పనిచేసే దౌత్యవేత్త, మనదేశం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు.
మన పౌర సేవకులు కార్యానిర్వాహాక వర్గం కింద పనిచేస్తారు. దీనిని గుర్తుపెట్టుకోవాలి. కార్యానిర్వాహక వర్గం, రాజకీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలకు వారిని నిందించకూడదు’’ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది..
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా మిస్రీకి అండగా నిలబడ్డారు. ఈ విషయంపై ఆయన ఎక్స్ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. ఇలాంటి ట్రోల్స్ దేశం కోసం రాత్రి, పగలు పనిచేసే అధికారుల మనో ధైర్యాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. ‘
‘‘నిర్ణయాలను తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. అధికారుల వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోరు. కొంతమంది సామాజిక నేరస్థులు ఆ అధికారిపై అతని కుటుంబంపై ట్రోల్స్ చేస్తున్నారు.
వారు అన్ని పరిమితులను అధిగమించారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఎవరూ దీనిని ఖండించలేదు. అధికారికి బాసటగా నిలవడం లేదు’’ అని రాసుకొచ్చారు.
స్పందించిన ఎన్సీడబ్ల్యూ..
ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్ విజయ రహత్కర్ కూడా ఈ ట్రోలింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని బాధ్యతారాహిత్యమైన చర్యలుగా అభివర్ణించారు. మిస్రీ కుటుంబ వివరాలు బయటపెట్టి వారి గోప్యత హక్కును ఉల్లంఘించారని అన్నారు.
మిస్రీ వంటి సీనియర్ సివిల్ సర్వెంట్ల కుటుంబంపై వ్యక్తిగత దాడులు ఆమోదయోగ్యం కాదని, నైతికంగా కూడా సమర్థించరానివని రహత్కర్ చెప్పారు.
మిస్రీకి మద్దతు ఇస్తున్న ఐఎఎస్ అసోసియేషన్..
మిస్రీకి మద్దతుగా ఐఎఎస్ అసోసియేషన్ కూడా ముందుకు తెచ్చింది. ‘‘విదేశాంగ కార్యదర్శి శ్రీ విక్రమ్ మిస్రీ, ఆయన కుటుంబానికి ఐఏఎస్ అసోసియేషన్ సంఘీభావం తెలుపుతోంది.
నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న పౌర సేవకులపై అనవసరమైన వ్యక్తిగత దాడులు తీవ్ర విచారకరం’’ అని తెలిపింది. ‘‘ప్రజాసేవ గౌరవాన్ని నిలబెట్టడానికి మా నిబద్దతను మేము పునరుద్ఘాటిస్తున్నాం’’ అని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
సిగ్గు చేటూ నిరుపమా మీనన్..
మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ మీనన్, సీనియర్ దౌత్యవేత్తలను ట్రోల్ చేయడం చాలా సిగ్గు చేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోలింగ్ మర్యాద రేఖ దాటిందని అన్నారు.
తన కూతురును బయటకు తీసుకురావడం, అతని కుటుంబాన్ని ఇందులోకి చేర్చడం ఏంటనీ ప్రశ్నించారు. అంకితభావంతో ఉన్న దౌత్యవేత్త అయిన మిస్రీ వృత్తి నైపుణ్యం, సంకల్పంతో సేవ చేశారన్నారు. అతని దూషణకు ఎటువంటి కారణం లేదని చెప్పారు. ఈ విద్వేషం ఆగిపోవాలని కోరారు.
మౌనంగా ఉన్న విదేశాంగ శాఖ..
ఈ ట్రోలింగ్ పై ఇంకా విదేశాంగ శాఖ స్పందించింది. నాలుగు రోజుల పాటు జరిగిన తీవ్ర సరిహద్దు, డ్రోన్, క్షిపణి దాడుల తరువాత భూమి, వాయు, సముద్రలో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యను వెంటనే నిలిపివేయాలని భారత్, పాకిస్తాన్ శనివారం అవగాహనకు వచ్చాయి.