కర్ణాటకలోనూ డేంజర్ బెల్స్.. ముందే హెచ్చరించిన గాడ్గిల్ నివేదిక ..
కర్ణాటకలోని యెత్తినహోళే ప్రాజెక్టు సమీపంలో పదే పదే కొండచరియలు విరిగిపడుతున్నాయని పర్యావరణవేత్త ప్రసాద్ రక్షిధి చెబుతున్నారు.
కేరళ విపత్తు నేపథ్యంలో కర్ణాటకలోనూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏడు జిల్లాల్లోని 43 తాలూకాల పరిధిలోని 895 గ్రామ పంచాయతీల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది. 177 తాలూకాలు ప్రమాదపు టంచున ఉన్నాయని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు.
కర్ణాటకలో 10 మంది మృత్యువాత..
వయనాడ్‌లో విషాదం జరగడానికి 10 రోజుల ముందు, కర్ణాటక అంకోలా సమీపంలోని శిరూరు గ్రామంలో కొండచరియలు విరిగిపడి 10 మంది మరణించారు. చాలా వాహనాలు బురదలో కూరుకుపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సహాయక బృందాలు మట్టికింద చిక్కుకుపోయిన వారిని గుర్తించలేకపోయారు. వయనాడ్ దుర్ఘటన కర్నాటక ప్రజలకు గతంలో కొడగు జిల్లాలో జరిగిన పర్యావరణ విపత్తు గురించి గుర్తుచేస్తుంది.
2018 విపత్తులో 20 మంది..
2018 ఆగస్టు 10 - 17 తేదీల మధ్య భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో 20 మంది మరణించారు. 4,058 ఇళ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 18,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇది కర్ణాటకలోని కొడగులో జరిగిన మొదటి భారీ విషాదం. మడికేరి, సోమవారపేట తాలూకాలలోని 48 గ్రామాలను కొండచరియలు మింగేశాయి. పశ్చిమ కనుమలను పర్యావరణ సున్నిత ప్రాంతంగా (ESA) నోటిఫై చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని పర్యావరణవేత్తలు నిందించారు.
వందల కి.మీ విస్తరించిన పశ్చిమ కనుమలు..
కర్నాటకలోని అటవీ ప్రాంతం కేరళలోని వాయనాడ్‌తో కలిసి ఉంటుంది. పశ్చిమ కనుమల పరిధిలోకి వస్తాయి. మరో మాటలో చెప్పాలంటే ప్రకృతి వైపరీత్యాలు సృష్టించే నష్టాలు ఈ రెండు రాష్ట్రాల్లో ఒకేలా ఉంటాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను కవర్ చేస్తూ 1,600 కి.మీ మేర పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణ వేత్తలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
దెబ్బతిన్న రహదారులు ..నిలిచిపోయిన రాకపోకలు..
గత రెండు రోజులుగా పశ్చిమ కనుమల ప్రాంతంలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా కర్ణాటకలోని షిరాడి, చిక్కమగళూరు, చార్మాడి, కొడగు, శివమొగ్గ, ఉత్తర కన్నడ జిల్లాల్లోని 10 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా బెంగళూరు-మంగళూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు హాసన్ జిల్లా సకలేష్‌పూర్‌లోని హార్లే ఎస్టేట్‌తో కుంబరాడిని కలిపే ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. రోడ్డులో కొంత భాగం కుంగిపోయింది.
పొంచి ఉన్న ప్రమాదం..
కర్ణాటకలోని యెత్తినహోళే ప్రాజెక్టు సమీపంలో పదే పదే కొండచరియలు విరిగిపడుతున్నాయని పర్యావరణవేత్త ప్రసాద్ రక్షిధి చెబుతున్నారు. కొండచరియలకు ఆనుకుని ఉన్న మల్లెగడ్డ, దినెకెరె, మారనహళ్లి, కడుమనె, హార్లే వాసులు ఇప్పుడు ప్రాణభయంతో జీవిస్తున్నారు. ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నా వారు పట్టించుకోవడం లేదు.
హెచ్చరికలను పట్టించుకోని పాలకులు..
సకలేష్‌పూర్, దక్షిణ కన్నడ జిల్లాలను కలుపుతూ 23.60 కి.మీ షిరాడీ ఘాట్ టన్నెల్ ప్రాజెక్ట్ (SGTP)ని ప్రభుత్వం ఎందుకు చేపట్టిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ కనుమలు మరింత దెబ్బతింటాయని పర్యావరణవేత్తలు హెచ్చరించినా.. మంగళూరుకు చెందిన కెనరా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ దీనికి మద్దతు ఇస్తుంది. “ఇప్పటికే ఈ సొరంగా గుండా రోడ్డు, రైల్వే ట్రాక్ కూడా ఉన్నాయి. యెత్తినహోళే రిజర్వాయర్ పక్కన సొరంగం నిర్మించడం వల్ల కొండచరియలు విరిగిపడే అవకాశం పెరుగుతుంది” అని సకలేష్‌పూర్‌కు చెందిన పర్యావరణవేత్త కిషోర్ హెచ్చరిస్తున్నారు. కాగా పర్యావరణ నిపుణుడు అనంత్ హెగ్డే అశిసార, బయో డైవర్సిటీ బోర్డ్ సమర్పించిన సమగ్ర ల్యాండ్‌స్లైడ్ నివారణ ప్రణాళికపై చర్చించడానికి కర్ణాటక ప్రభుత్వం ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేదని ఆరోపించారు.
‘‘కొండ ప్రాంతాల్లో మైనింగ్‌ను నిషేధించడం, దెబ్బతిన్న కొండల పునరుద్ధరణ చర్యలు, భూమిని తవ్వే పరికరాలను ఉపయోగించడంపై కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. అవి అమలు కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వాటిని సీరియస్‌గా తీసుకోవాలి’’ అని సకలేశ్‌పూర్ వాసి అత్తిహళ్లి దేవరాజ్ కోరుతున్నారు.
ప్రముఖ పర్యావరణ నిపుణుడు డాక్టర్ మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలోని కమిటీని 2010లో ఏర్పాటు చేశారు. 2012లో ప్రముఖ శాస్త్రవేత్త కె. కస్తూరిరంగన్ అధ్యక్షతన ఏర్పాటయిన ప్యానెల్ ఐదు నోటిఫికేషన్లు జారీ చేసింది. కానీ కేరళ, కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాలు ఆ బోర్డులో లేవు.
డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారంగా.. కర్ణాటకలో అత్యధికంగా 20,668 చ.కి.మీ పర్యావరణ సున్నిత ప్రాంతం (ESZ), గుజరాత్‌లో అత్యల్పం (449 చదరపు కి.మీ) ఉన్నాయి. 17,340 చ.కి.మీలతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉండగా, తమిళనాడు (6,914 చ.కి.మీ.) గోవా (1,461 చ.కి.మీ.) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కర్ణాటకలోని పర్యావరణ సున్నిత ప్రాంతం 1,572 గ్రామాలను కవర్ చేస్తుంది.
''గాడ్గిల్ కమిటీ నివేదికను దశాబ్దం క్రితమే అమలు చేసి ఉంటే కేరళకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. కర్ణాటకలో కూడా ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేవి’’ అని పశ్చిమ కనుమలపై డాక్యుమెంటరీ తీసిన జాతీయ అవార్డు చిత్రనిర్మాత కేసరి హర్వో చెప్పారు.