తెలంగాణలో ‘ప్రజాస్వామిక బిసి ఉద్యమ వేదిక’ ఆవిర్భావం

హనుమకొండ సదస్సుతో బి.సి ఉద్యమానికి మలుపు

Update: 2025-11-03 09:39 GMT

స్థానిక సంస్థల ఎన్నికలలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణలో పెద్ద చర్చ జరుగుతున్న సమయంలో మరొక ఉద్యమ వేదిక ఏర్పాటయింది. దాని పేరు ప్రజాస్వామిక బిసి ఉద్యమ వేదిక.

బి.సి. ప్రజలు ఒక చారిత్రిక పోరాటానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఏర్పడిందని దానిలో భాగంగానే ప్రజాస్వామ్య బి.సి ఉద్యమ వేదిక ఆవిర్భావం ఏర్పాటుచేశామని  ఆ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గాలీబు అమరేందర్ తెలిపారు.

హనుమకొండ జిల్లా కేంద్రం బీమారంలో సోమవారం జరిగిన త్యాగధనుల సదస్సుకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.
బి.సి ఉద్యమం కీలక దశకు చేరుకుంటున్న సందర్భంలో రాజ్యాధికార లక్ష్యం చేరుకోవడానికి జరిగే ఉద్యమాలు మూస ధోరణితో నడుస్తున్న తరుణంలో గత 40 ఏండ్లుగా వివిధ ప్రగతిశీల పోరాటాల్లో కీలకంగా పనిచేసిన వారి నాయకత్వంలో ప్రజాస్వామ్య బి.సి ఉద్యమ వేదిక ఆవిర్భావం చేసినట్లు అమరేందర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రగతిశీలవాధులతో  జరిగిన సమావేశంలో భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో బి.సి ల స్థితిగతులు, రాజకీయ వాటా, రాజ్యాధికారం గురించి నాయకులు మాట్లాడారు. కాకా కలేల్కర్ నుండి కామారెడ్డి వరకు 70 ఏండ్లుగా బి.సి ల రిజర్వేషన్లకు, వాటాకు ఆధిపత్య వర్గాల రాజకీయ పార్టీలు ద్రోహం చేస్తూనే ఉన్నాయని అన్నారు. 60 శాతం జనాభా కలిగి దేశంలో మెజార్టీ ప్రజలైన బి.సి లు ఓట్లేసి ఆధిపత్య పార్టీలకు అధికారం ఇవ్వడమేంటి అడుక్కోవడమెందుకని, చైతన్య రాహిత్యం, అవగాహన లేమి, ఐక్యత లేకపోవడం వల్లనే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని అన్నారు.
రాజ్యాధికారం లేక, రాజ్యాంగ హక్కులు లేక గత 75 ఏండ్లుగా అణచివేతకు, దోపిడీకి గురైన బి.సి సమాజ హక్కుల కోసం జరిగే పోరాటంలో ప్రగతిశీల, ప్రజాస్వామికవాదులు ముందుండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న డొల్ల బి.సి ఉద్యమాలను గాడిలో పెట్టడమే కాకుండా బి.సి రిజర్వేషన్లు సాధనకు పార్లమెంటులో చట్టం చేసే వరకు త్యాగపూరిత పోరాటాలు చేస్తామని ప్రకటించారు. బి.సి రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల కుట్రలను ప్రజలకు వివరించడానికి గ్రామ గ్రామాన పర్యటనలు చేస్తామని ప్రకటించారు.
ప్రజా పోరాటాలకు కేంద్రమైన ఓరుగల్లు నుండే ప్రజాస్వామ్య బి.సి ఉద్యమాన్ని మొదలు పెట్టి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షేక్ బంధగి, సర్దార్ సర్వాయి పాపన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, బెల్లి లలితక్క, మారోజు వీరన్న లాంటి వీరుల స్పూర్తితో తెలంగాణతో పాటు భారతదేశ వ్యాప్తంగా సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బి.సి వాటా సాధిస్తామని నినదించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగు ప్రధాన స్థంబాలు అవినీతిమయమై ప్రజలను విపరీతంగా దోపిడీ చేస్తున్న నేటి తరుణంలో సామాజికన్యాయం, ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే పోరాటంలో విద్యావంతులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, వైస్ చైర్మన్లు పటేల్ వనజ, వెలుగు వనిత, హిందూ బి.సి మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్లు, తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఛైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, కన్వీనర్ సోమ రామమూర్తి, బి.సి రైటర్స్ వింగ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్, బి.సి యునైటెడ్ ఫ్రంట్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వాసు కె యాదవ్, డాక్టర్ లక్ష్మిప్రసాద్, నాయకులు అమర్, బీమోజు సదానందం, జగన్నాథం, బెల్లి చంద్రశేఖర్, రేల విజయ్, కర్ణాటక సమ్మయ్య, శంకరన్న, చాపర్తి కుమార్ గాడ్గే, రాసమల్ల లక్ష్మణ్ ఎరుకల రాజన్న, ముంజాల బిక్షపతి, సిద్ధిరాజ్ యాదవ్, కొంగర నరహరి, స్వరూప, రమేష్ యాదవ్, తాడిశెట్టి క్రాంతికుమార్, సూరం నిరంజన్, దిడ్డి ధనలక్ష్మి, గొల్లపల్లి వీరస్వామి, ఐతం నగేష్, అడ్లూరి పద్మ, పి రాజకుమారి, జి.సరిత, బి.జయ, సింగారపు అరుణ, బైరబోయిన ఐలయ్య, రమేష్, చంద్రగిరి శంకర్ తదితరులు పాల్గొన్నారు
ప్రజాస్వామ్య బి.సి ఉద్యమ వేదిక కమిటీ ఎన్నిక
ప్రజాస్వామ్య బి.సి ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ గా గాలీబు అమరేందర్, రాష్ట్ర కో కన్వీనర్లుగా బీమోజు సదానందం (హుజూరాబాద్), వేముల రమేష్ (సిరిసిల్ల), సకినాల అమర్ (వేములవాడ), వెలుగు వనిత (సూర్యాపేట), వాసు కె యాదవ్ (హైదరాబాద్), కర్ణాటక సమ్మయ్య (భూపాలపల్లి) లను ఎన్నుకున్నారు.
రాష్ట్ర కన్వీనర్ గా ఎన్నుకున్న అమరేందర్ మాట్లాడుతూ త్వరలో తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటించి బి.సి చైతన్య సమావేశాలు నిర్వహించి కమిటీల నిర్మాణం చేస్తామని, రాష్ట్ర కమిటీని విస్తరిస్తామని, వేదిక నిర్మాణంలో అన్ని బి.సి కులాలకు ప్రాతినిధ్యం కల్పించి ప్రజాస్వామ్యానికి ప్రతీకగా బి.సి ఉద్యమ వేదికను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. యువత, మహిళలను లక్ష్యంగా చేసుకొని కొనసాగే చైతన్య కార్యక్రమాల్లో, నిర్మాణంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పీడిత ప్రజల విముక్తి కోసం త్యాగపూరిత పోరాటాలు చేసిన త్యాగధనులు నిశబ్దంగా ఉంటే సమాజానికి నష్టం జరుగుతుందని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రగతిశీల, ప్రజాస్వామికవాదులు బి.సి రిజర్వేషన్ల కోసం పోరాటంలో ముందుండి బి.సి వాటా, హక్కులను సాధించాలని పిలుపునిచ్చారు.


Tags:    

Similar News