బెంగళూరు గురించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఏమన్నారు?
ప్రభుత్వం చేపట్టబోతున్న భారీ ప్రాజెక్టులు ఏమిటి?
బెంగళూరు(Bangalore) నగర మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష కోట్లుకు పైగా ఖర్చుపెడుతుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) పేర్కొన్నారు. బెంగళూరును "నిరంతరం అభివృద్ధి చెందుతోన్న నగరంగా అభివర్ణించారు. కర్ణాటక(Karnataka) ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ & బీటీ విభాగం, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిపీఐ) భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన 28వ బెంగళూరు టెక్ సమ్మిట్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
పలు అభివృద్ధి ప్రాజెక్టులు..
బెంగళూరులో ప్రభుత్వం మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిందని, రూ.42,500 కోట్లతో 40 కి.మీ.ల ట్విన్ టన్నెల్ ప్రాజెక్ట్, రూ.18వేల కోట్లతో 41 కి.మీ.ల డబుల్ డెక్కర్ మెట్రో, రూ.15వేల కోట్లతో 110 కి.మీ.ల ఎలివేటెడ్ కారిడార్, రూ.5వేల కోట్లతో 320 కి.మీ.ల బఫర్ రోడ్లు, రూ.500 కోట్లతో స్కైడెక్, రూ.27వేల కోట్లతో 74 కి.మీ.ల బెంగళూరు బిజినెస్ కారిడార్ ప్రాజెక్టులను ప్రారంభించిందని వివరించారు.
బెంగళూరుకు రెండో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఎన్నారైల కోసం ప్రత్యేక సచివాలయాన్ని కూడా తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని డిప్యూటీ సీఎం అన్నారు.
NRIల కోసమే ప్రత్యేకంగా..
"మేము ఎన్నారైల కోసం రెసిడెన్షియల్ లేఅవుట్‌లను అభివృద్ధి చేస్తున్నాం. అన్ని అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు నిలయంగా బిడాడి సమీపంలో 9వేల ఎకరాల్లో ప్రపంచ స్థాయి నగరం - AI సిటీని నిర్మిస్తున్నాం," అని చెప్పారు. బెంగళూరు వాతావరణం సంస్కృతికి మరే ఇతర నగరాలు సరిపోలవన్నారు.