పెద్దోళ్ల ఓట్లు మాకొద్దు!
సీఎం జగన్ నోట పదేపదే అదేమాట
Byline : The Federal
Update: 2023-11-29 17:47 GMT
సీఎం జగన్ నోట పదేపదే అదేమాట
ఇదో వెరైటీ ప్రచారం
(జిపి వెంకటేశ్వర్లు)
ఓట్లు వెయ్యాలని ప్రచారం చేస్తారు, ప్రలోభ పెడతారు కూడా. కానీ మీ ఓట్లు మాకొద్దని ఎవరైనా ప్రచారం చేస్తారా? అవును చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలాగే ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు అందరూ సమానమేనని, అందరి ఓట్లూ నాకు కావాలని అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూ అడుగులు వేశారు. పార్టీలకు అతీతంగా అందరికీ సమానంగా అవకాశాలు ఇస్తున్నామని, సంక్షేమ పథకాల అమల్లో అందరూ మాకు సమానమేనని చెప్పిన సీఎం ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నాడు. ఈ వైఖరి చాలా విడ్డూరంగా ఉందని పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం కూడా ఉందని, ఇందువల్ల వైషమ్యాలు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే పార్టీల పరంగా, ప్రాంతాల వారీగా, కులాల వారీగా ఉన్న తారతమ్యాలకు ఈ వింత పోకడ మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది. మనం పేదల పక్షం, మిగతా వాళ్లు పెద్దల పక్షం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇటీవల జరుగుతున్న సభలు, సమావేశాల్లో ఇదే విషయాన్ని ఆయన నొక్కి చెబుతున్నారు.
పెద్దోళ్లు అంటే సీఎం జగన్ దృష్టిలో ఎవరు?
పెద్దోళ్లంతా ఒకవైపు, పేదేళ్లంతా ఒకవైపు, నానుంచి మీరు సాయం పొందితేనే ఓట్లు వేయండి అంటూ పిలుపు నిచ్చారు. నిజానికి పెద్దోళ్లంటే ఎవరు? డబ్బున్నవారా? లేక సామాజికంగా అగ్రవర్ణాలవారా అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఏమైనా నానుంచి సాయం పొందితేనే ఓటు వేయాలని కోరటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అన్ని వర్గాల వారు ప్రభుత్వం నుంచి సాయం అందుకున్నారని, అర్హులైన వారు ఎవరైనా సంక్షేమ పథకానికి దూరంగా ఉంటే వారిని రెండోసారి ఎంపిక చేసినట్లు గుర్తు చేశారు.
మంత్రుల నోటా అదే మాట..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రులు సైతం పథకాల వల్ల సాయం పొందితేనే ఓట్లు వేయాలని, తాము పేదల పక్షమని స్పష్టం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తున్నది. పేదలు మాకు ఓటు వేయాలంటూనే ప్రతిపక్షంపై విరుచుకు పడుతున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్లీల్లో ధనవంతులు లేరా?
ఎస్సీ, ఎస్టీ బీసీల్లో ధనవంతులు లేరా? వారు పేదలవుతారా? వారి ఓట్లు కూడా వద్దంటున్నారా? అంటే మా పక్షం ఎస్సీ, ఎస్టీ, బీసీలేనని చెబుతున్నారు. మరో వైపు పెద్దళ్లంతా ఒకవైపు, పేదోళ్లంతా ఒకవైపనే మాటలు వస్తున్నాయి.
టోపీ పెడితే గెలుస్తామనే వాళ్లను చూశాం
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాటోపీ పెడితే గెలుస్తుందనే వాళ్లను చూశాం. 35 ఏళ్లక్రితం ఈ మాటలు అన్నది ఆనాటి కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్తి కాసు బ్రహ్మానందరెడ్డి. నాటి పరిస్థితులు నేడు లేవు. ఎవరిని ఎందుకు ఎన్నుకోవాలో›ఓటర్లకు బాగా తెలుసు.