నటి కృష్ణవేణి ఎన్టీఆర్ కి ఇచ్చిన పారితోషికం ఎంతంటే..
తెలుగు సినీ స్వర్ణ యుగంలో ప్రముఖ నటి చిత్తజల్లు కృష్ణవేణి. వయోభారంతో 101 ఏళ్ల వయసులో వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా ఫిబ్రవరి 16న హైదరాబాద్ లో కన్నుమూశారు.;
By : The Federal
Update: 2025-02-17 06:30 GMT
తెలుగు సినీ స్వర్ణ యుగంలో ప్రముఖ నటి చిత్తజల్లు కృష్ణవేణి. వయోభారంతో 101 ఏళ్ల వయసులో వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా ఫిబ్రవరి 16న హైదరాబాద్ లో కన్నుమూశారు. అనేక దశాబ్దాలుగా కొనసాగిన సినీ వారసత్వాన్ని మిగిల్చి ఆమె వెళ్లిపోయారు. ఆమె జీవితమంతా నాట్యం, నాటకాలు, సినిమాలతో ముగిసింది. కళ కళ కోసం కాదని నిరూపించిన ఆమె జీవితంలో ఎన్నో మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయి.
ఈ దేశం గర్వించదగిన నటుల్లో ఒకరైన నందమూరి తారక రామారావును వెండితెరకు పరిచయం చేసిన ఘనత కృష్ణవేణికే దక్కుతుంది.
కృష్ణవేణి జీవిత ప్రస్థానం...
చిత్తజల్లు కృష్ణవేణి 1924 డిసెంబర్ 24న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో జన్మించారు. వెనకా ముందు ఏమీ లేకుండా కృష్ణవేణి అని పిలిపించుకునే ఆమె భారతీయ నటి, నిర్మాత, నేపథ్య గాయని. తండ్రి కృష్ణారావు వైద్యుడు. కళాభిమాని.
కృష్ణవేణి సినీ పరిశ్రమలోకి ప్రవేశానికి ముందు నాటక కళాకారిణి. ఆమె తొలినాళ్లలో అనసూయ (1936) చిత్రంలో బాలనటిగా నటించింది. ఆమె తెలుగు చిత్రాలలో నటించడానికి అనేక ఆఫర్లు రావడంతో ఆమె 1939లో చెన్నైకి మకాం మార్చారు. ఆమె తమిళం వంటి ఇతర భాషల చిత్రాలలో కూడా నటించింది.
ఆమె 1939లో మీర్జాపురం జమీందార్‌ను వివాహం చేసుకుంది. చెన్నైలోని తన భర్త శోభనాచల స్టూడియోస్‌లో నిర్మాణంలోనూ, సినిమాలు తీయడంలోనూ చురుకుగా పాల్గొన్నారు.
కృష్ణవేణి సతి అనసూయ - ధ్రువవిజయం (1936)లో బాలనటిగా చిత్ర పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె అనసూయ పాత్రను పోషించింది. కాలక్రమేణా, ఆమె ప్రధాన నటి, గాయనిగా మారిపోయింది. ఆమె స్టూడియో నిర్వహణ బాధ్యతను స్వీకరించి చలనచిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది. ఆమె ఎనిమిది దశాబ్దాలకు పైగా అద్భుతమైన కెరీర్‌ను కొనసాగించింది. సతి అనసూయ, దక్ష యజ్ఞం, భోజ-కాళిదాసు, జీవంజ్యోతి, తుకారం, కాచ దేవయాని, మనదేశం వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది.
జో అచ్యుతానంద జోజో ముకుందకు తన గాత్రాన్ని అందించడం ద్వారా కృష్ణవేణి చరిత్ర సృష్టించింది. తెలుగు వెండితెరపై అన్నమయ్య కీర్తనను తొలిసారిగా ప్రదర్శించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే, గొల్లభామలో భూపతి చంపితిన్‌ను ప్రదర్శించడం ద్వారా ఆమె తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించింది.
ఎన్టీఆర్ ను హీరోగా పరిచయం చేసిందే ఆమె...
నిర్మాతగా కృష్ణవేణి మనదేశం (1949)లో పురాణ నటుడు ఎన్. టి. రామారావును పరిచయం చేయడం ద్వారా తెలుగు సినిమా చరిత్రను మరో మలుపు తిప్పారు. ఈ చిత్రం ప్రఖ్యాత స్వరకర్త ఘంటసాల సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసింది. అంతకు మించి, సంగీత దర్శకుడు రమేష్ నాయుడు, గాయని పి. లీల వంటి ప్రతిభావంతులను పరిచయం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. తరువాతి తరాలకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆమె కుమార్తె ఎన్.ఆర్. అనురాధ కూడా సినీరంగంలోనే ఉన్నారు.
'మన దేశం' (1949) చిత్రం ద్వారా అనేక మంది ప్రముఖ సినీ ప్రముఖులను పరిచయం చేసిన ఘనత ఆమెకి దక్కింది. ఆ విధంగా ఆమె సినీచరిత్రలో నిలిచిపోయారు. ఆమె పరిచయం చేసిన వారిలో నటుడు ఎన్ టి రామారావు, సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు, నేపథ్య గాయనిగా పి లీ తదితరులు ఉన్నారు. బెంగాలీ నవల 'విప్రదాస్' ఆధారంగా మన దేశం సినిమాను రూపొందించారు.
తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య నటుడైన ఎన్టీఆర్ సహా పలువురికి సినిమా రంగంలో తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత, తొలితరం తెలుగు కథానాయిక, గాయని కృష్ణవేణి.
కృష్ణవేణి ప్రతిభను గుర్తించిన సి.పుల్లయ్య..
తెలుగు సినిమా తొలి అడుగుల నాటి నుంచి... నేటి డిజిటల్ యుగం వరకూ పలు తరాల్ని దగ్గర్నుంచి చూసి, మార్గ నిర్దేశనం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణవేణి. ఆమె ప్రతిభని గమనించిన దర్శకుడు సి.పుల్లయ్య బాలలతో తీసిన ‘అనసూయ’తో తెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత బాలనటిగా తెలుగుతోపాటు, తమిళ చిత్రాల్లోనూ మెరిశారు. 1938లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కచదేవయాని’ చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడం, మరిన్ని అవకాశాలు తలుపు తట్టడంతో ఆమె మద్రాస్‌లో నటిగా స్థిరపడిపోయారు.
మీర్జాపురం జమిందార్ తో పెళ్లి...
‘మహానంద’ చిత్రంలో నటిస్తున్న సమయంలోనే ప్రముఖ దర్శకనిర్మాత, శోభనాచల స్టూడియోస్ సంస్థ అధినేత మీర్జాపురం రాజా అయిన మేకా రంగయ్యతో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారి తీసింది. భర్త కోరిక మేరకు పెళ్లి తర్వాత సొంత సంస్థలో మాత్రమే సినిమాలు చేశారు కృష్ణవేణి. ‘జీవన జ్యోతి’, ‘గొల్లభామ’, ‘లక్ష్మమ్మ’, ‘దక్షయజ్ఞం’, ‘భీష్మ’, ‘ఆహుతి’ తదితర చిత్రాలు ఆమెకి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. భిన్నమైన పాత్రల్ని చేయాలనే తపన ఉన్న ఆమె ‘తిరుగుబాటు’ చిత్రంలో వ్యాంప్ తరహా పాత్రని పోషించారు. అత్యధిక పారితోషికం తీసుకున్న తొలితరం కథానాయికల్లో కృష్ణవేణి ఒకరు. ‘ధర్మాంగద’ చిత్రానికిగానూ రూ.45 వేలు పారితోషికాన్ని అందుకున్నారు. ఆమె నటించిన చివరి చిత్రం ‘సావాసం’ కాగా, నిర్మాతగా చివరి చిత్రం ‘దాంపత్యం’. నటిగా కెరీర్ ఆరంభం నుంచీ సినిమాల్లోని తన పాటల్ని స్వయంగా పాడుకునేవారు కృష్ణవేణి. ‘కీలుగుర్రం’ సినిమాలో అంజలీదేవికి ప్లేబ్యాక్ పాడారు.
పట్టుదలకు మారుపేరు కృష్ణవేణి...
భర్తతోపాటే, శోభనాచల స్టూడియోస్ బాధ్యతల్ని చూస్తూ వచ్చిన కృష్ణవేణికి.. జాతీయోద్యమం నేపథ్యంలో సినిమా తీయాలనే ఆలోచన బలంగా ఉండేదట. అప్పటికి జానపద, పౌరాణిక, కుటుంబ కథలే ఎక్కువగా తెరకెక్కేవి. వాటికి భిన్నంగా అడుగులు వేయాలనుకున్న కృష్ణవేణిని, అలాంటి కథల జోలికి వెళ్లొద్దంటూ చాలామంది వారించినా పట్టువదలకుండా కథల కోసం అన్వేషించారు. 1942లో కృష్ణవేణి, మీర్జాపురం రాజా దంపతులకి కుమార్తె అనురాధాదేవి జన్మించారు. ఆమె పేరుతో ఎం.ఆర్.ఎ ప్రొడక్షన్స్ సంస్థని ప్రారంభించి, అనుకున్నట్టుగానే తొలి చిత్రంగా జాతీయోద్యమం నేపథ్యంలో ‘మనదేశం’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి ఎల్వీ ప్రసాద్ దర్శకుడు. ముఖ్యపాత్రధారులు నాగయ్య, సీహెచ్ నారాయణరావు, కృష్ణవేణి, రేలంగి, వంగర.
ఎన్టీఆర్ ను పిలిపించిన ఎల్వీ ప్రసాద్...
తెరపై కనిపించేది కొద్దిసేపే అయినా, కథలో కీలకమైన ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్ పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం, అంతకుముందే ఓ సినిమా కోసం నిర్వహించిన ఇంటర్వ్యూల్లో తనని ఆకట్టుకున్న ఓ నటుడిని పిలిపించారు ఎల్వీ ప్రసాద్. విజయవాడ నుంచి వచ్చిన ఆ నటుడు.. ఎన్టీఆర్. అలా కృష్ణవేణి నిర్మించి, నటించిన చిత్రం ‘మనదేశం’తో ఎన్టీఆర్ తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాకు ఆయన తీసుకున్న పారితోషికం రూ.250. దర్శకుడి సూచనల్ని శ్రద్ధగా పాటిస్తూ, పాత్రతోపాటే ప్రయాణం చేస్తున్న రామారావుకి మంచి భవిష్యత్తు ఉంటుందని కృష్ణవేణి ఆ సినిమా సమయంలోనే చెప్పారట. ఆ సినిమా తర్వాత జాతీయోద్యమం నేపథ్యంలో సినిమా తీయాలన్న తన కోరిక నెరవేరిందని, అన్నింటినీ మించి ఎన్టీఆర్‌లాంటి నటరత్నాన్ని తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత ‘మనదేశం’ చిత్రానికి సొంతమైందని నిర్మాత కృష్ణవేణి ఓ సందర్భంలో చెప్పారు. ప్రముఖ సంగీత దర్శకులు ఘంటసాల, రమేశ్ నాయుడు, గాయకులు పి.లీల, జిక్కీ, దర్శకుడు ఎర్రా అప్పారావు... ఇలా ఎంతోమంది ప్రముఖుల్ని పరిచయం చేసిన ఘనత కూడా ఆమెకే దక్కింది.
ఆమె కుమార్తె అనురాధాదేవి కూడా తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించారు. లక్ష్మీ ఫిలింస్ కంబైన్స్ పతాకంపై తెలుగు, కన్నడ భాషల్లో 17 చిత్రాల్ని నిర్మించారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌తో ‘భక్త కుంభారా’, తెలుగులో ‘చక్రధారి’, ‘రావణుడే రాముడయితే’, ‘శ్రీవారి ముచ్చట్లు’, ‘రాముడు కాదు కృష్ణుడు’, ‘అనుబంధం’, ‘ఆలయదీపం’, ‘ఇల్లాలే దేవత’, ‘ఆలయదీపం’, ‘ప్రియా ఓ ప్రియా’, ‘ప్రేమించే మనసు’, ‘మా పెళ్లికి రండి’... ఇలా మూడు తరాల హీరోలతో చిత్రాలు నిర్మించిన ఘనమైన వారసత్వాన్ని చాటారు అనురాధా దేవి.
ఎన్నెన్నో పురస్కారాలు
సినీ రంగానికి కృష్ణవేణి చేసిన సేవలకుగానూ ఆమెకు ఎన్నెన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. 2004లో కృష్ణవేణిని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం సందర్భంగా గతేడాది డిసెంబరు 14న విజయ వాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృష్ణవేణిని ఘనంగా సత్కరించారు. ఆమె మరణంతో చిత్రసీమ ఓ ధృవతారని కోల్పోయినట్టైంది.
సంతాపాల వెల్లువ...
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మరణ పట్ల సంతాపం తెలిపారు. ‘‘ఎన్టీఆర్ నట జీవితానికి తొలి అవకాశం ఇచ్చిన కృష్ణవేణి మృతి బాధాకరం. తెలుగు సినీ చరిత్రలో ఆమెది ఓ ప్రత్యేకమైన అధ్యాయం. ఆమె మృతి మాకు తీరని లోటు’’ అంటూ ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ సంతాపం తెలిపారు. ‘‘ఎన్టీఆర్‌ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి ఒక అమూల్యమైన కానుకని మనకు అందించారు. ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలం’’ అంటూ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సంతాపం తెలిపారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలితోపాటు, నందమూరి రామకృష్ణ తదితరులు కృష్ణవేణి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ తొలి పారితోషికం రూ.250...
'మన దేశం'లో (Manadesam) యన్టీఆర్ కు (NTR)అవకాశం లభించడం.. ఆయన అభినయానికి అందుకున్న పారితోషికం... విడుదలయ్యాక సినిమా సాగిన వైనం అన్నీ ఆసక్తి కలిగిస్తాయి.'మనదేశం' చిత్రాన్ని తెరకెక్కించక మునుపే దర్శకుడు ఎల్వీ ప్రసాద్ తగిన నటీనటుల అన్వేషణ కోసం నాటకాలు చూస్తూ సాగారు. ఆ సమయంలోనే విజయవాడలో ఎన్టీఆర్ వేసిన నాటకం చూశారు. అప్పుడే ఎన్టీఆర్ లో ఓ గొప్ప నటుడున్నాడని ప్రసాద్ గ్రహించారు. అందువల్ల ప్రోత్సహించారు. చిత్రసీమకు రమ్మని ఆహ్వానించారు. కానీ, రామారావు చదువు కాగానే కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేయడం, ఆ తరువాత అక్కడి వాతావరణం నచ్చక రాజీనామా చేయడం జరిగాయి. అప్పుడు మద్రాసు వెళ్ళాలని నిర్ణయించారు. అప్పటికే 'మనదేశం' షూటింగ్ మొదలయింది. ఈ చిత్రాన్ని మీర్జాపురం రాజా వారి సతీమణి నటి కృష్ణవేణి నిర్మించి, నాయికగా నటించారు. 'మనదేశం' లో యన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ అధికారి పాత్రలో నటించి మెప్పించారు. అందుకు గానూ ఆయనకు రెండు వందల యాభై రూపాయలు పారితోషికం అందించారు కృష్ణవేణి. ఏ ముహూర్తాన కృష్ణవేణి రామారావుకు ఆ మొత్తం అందించారో కానీ తరువాతి రోజుల్లో సూపర్ స్టార్ గా సౌత్ లోనే అత్యధిక పారితోషికం (NTR First Remuneration) పుచ్చుకొనే స్థాయికి చేరారు ఎన్టీఆర్! అందుకే కృష్ణవేణిది లక్కీ హ్యాండ్ అని అప్పటి సినీ జనం అంటూ ఉండేవారు. చిత్తూరు నాగయ్య, సిహెచ్.నారాయణరావు అప్పటికే పేరున్న నటులు.. వారితో కలసి రామారావు వంటి కొత్త నటుడు ఎలా నటిస్తారో అనుకున్నారు... కానీ, అదరక బెదరక తన పాత్రను తాను ప్రతిభావంతంగా పోషించారు రామారావు... ఆయన ప్రతిభతోనే అగ్ర పథానికి చేరుకున్నారని కృష్ణవేణి చెబుతుండేవారు.
'మనదేశం' చిత్రానికి ఘంటసాల సంగీతం సమకూర్చారు. రేలంగి ఇందులో పోలీస్ వెంకటస్వామి పాత్రలో కనిపించారు. ఇందులోని పాటలు అప్పట్లో జనం నోళ్ళలో విశేషంగా చిందులు వేశాయి. తరువాతి రోజుల్లో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన తాతినేని ప్రకాశరావు ఈ సినిమాలో బిట్ రోల్ లో కనిపించారు. ఇలా పలు విశేషాలతో రూపొందిన 'మనదేశం' చిత్రం 1949 నవంబర్ 24న విడుదలయింది. ఈ చిత్రానికి ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ్ రాసిన 'విప్రదాస్' ఆధారం.
ఆ కథకు ఎల్వీ ప్రసాద్ స్క్రీన్ ప్లే రాయగా, సముద్రాల సీనియర్ మాటలు, పాటలు పలికించి ఆకట్టుకున్నారు. నటుడిగా, రాజకీయ నేతగా ఎన్టీ ఆర్ అందుకోని ఎత్తులు లేవు. అంత గొప్ప వ్యక్తిని తెలుగు తెరకు పరిచయం చేసిన నిర్మాతగా కృష్ణవేణి పేరు తెలుగు సినిమా రంగంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
కృష్ణవేణి బహుముఖ నటన, తెలుగు సినిమా పట్ల అంకితభావానికి నిదర్శనంగా అనేక గౌరవ పురస్కారాలు దక్కాయి. సినీ పరిశ్రమను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.