గవర్నర్ కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌పై మండిపడ్డారు. ముడా స్థలాల పంపిణీలో అవకతవకలు జరిగాయని సిద్ధరామయ్యపై ఇటీవల ఆరోపణలొచ్చాయి.

Update: 2024-08-02 10:11 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌పై మండిపడ్డారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ద్వారా స్థలాల పంపిణీలో అవకతవకలు జరిగాయని సిద్ధరామయ్యపై ఇటీవల ఆరోపణలు వచ్చాయి.

న్యాయవాది TJ అబ్రహం చేసిన ఈ ఆరోపణలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రికి గవర్నర్ జూలై 26న నోటీసు జారీ చేశారు. అయితే ఆ నోటీసును వెనక్కి తీసుకోవాలని మంత్రి మండలి సమావేశంలో గవర్నర్‌ను కోరారు.

ఇప్పటికే విచారణకు ఆదేశించిన సీఎం..

ముడా 'కుంభకోణం'పై దర్యాప్తు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 14న హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిఎన్ దేశాయ్ ఆధ్వర్యంలో ఏక సభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

గవర్నర్ కీలు బొమ్మలా మారిపోయారు?

గవర్నర్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ-జేడీ(ఎస్) చెప్పినట్లు నడుచుకుంటున్నారని, వారి చేతుల్లో కీలుబొమ్మలా మారిపోయారని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

‘అబ్రహం ఫిర్యాదు ఆధారంగా చర్య తీసుకోవడం చట్టవిరుద్ధం’

“అబ్రహం పూర్వాపరాలను కూడా గవర్నర్ గమనించాలి. అతను ఒక బ్లాక్ మెయిలర్. అతని ఫిర్యాదుపై చర్య తీసుకోవడం చట్టవిరుద్ధం. అబ్రహం పలువురిపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాడు. అబ్రహం నాపై జులై 26న ఫిర్యాదు చేశాడు. అదే రోజు గవర్నర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. బిజెపి మాజీ మంత్రులు శశికళ జోలె, మురుగేష్ నిరాణి, జి. జనార్దనరెడ్డిలపై ప్రాసిక్యూషన్‌ మంజూరు చేయాలని కోరుతూ ఇలాంటి పిటిషన్లు వచ్చాయి. అయితే అవి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

Tags:    

Similar News