తమిళ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీలో చంద్రశేఖర్ సక్సెస్ అయ్యారా?

1993లో విజయ్ అభిమానుల సంఘాన్ని సంక్షేమ సంఘంగా మార్చిన చంద్రశేఖర్.. 2020లో రాజకీయ పార్టీ ‘‘ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్‌’’గా ప్రకటించారు.

Byline :  The Federal
Update: 2024-10-29 07:41 GMT

విజయ్ 50 ఏళ్ళ వయసులో రాజకీయ ప్రవేశం చేసి ఉండవచ్చు. కానీ ఆయన రాజకీయ ప్రవేశం గురించి పదేళ్ల ముందే ప్లాన్ చేసింది మాత్రం ఆయన తండ్రి SA చంద్రశేఖర్.

70 కంటే ఎక్కువ చిత్రాలు నిర్మించిన చంద్రశేఖర్..1980లో విజయ్‌ని చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత కాలంలో సినిమాల్లో సత్తా చాటి వేల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నది మాత్రం విజయే. తన కొడుకును పొలిటికల్ లీడర్‌గా చూడాలనుకున్నారు. పాలిటిక్స్‌ను ఇష్టపడే చంద్రశేఖర్ తన రాజకీయ ఆకాంక్షల గురించి బహిరంగ వేదికలపై కొన్ని చోట్ల మాట్లాడారు. ఆ దిశగా విజయ్‌ను ప్రేరేపించడానికి కూడా ప్రయత్నించారు. అయితే విజయ్ ఆ సమయంలో రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. సినిమాలే తన కేరీర్ అని భావించారు. ఒక సందర్భంలో విజయ్ తన తండ్రి ఆలోచనతో పూర్తిగా విభేదించారు.

చివరకు ట్యాగ్‌లైన్‌ లేకుండానే మూవీ రిలీజ్..

2013లో తన కొడుకును హీరోగా పెట్టి తలైవా "టైమ్ టు లీడ్" అనే ట్యాగ్‌లైన్‌తో చంద్రశేఖర్ ఒక చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతోనే చంద్రశేఖర్‌ చాలా సమస్యలు వచ్చాయి. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ఈ మూవీ కలవరపెట్టడమే కాకుండా, విజయ్ యాక్టింగ్ కెరీర్‌ను కూడా ప్రమాదంలో పడేసింది. ఎట్టకేలకు ఆగస్టు 9న దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు విదేశాలలో కూడా ఈ చిత్రం విడుదలైనా.. తమిళనాడులో మాత్రం విడుదల కాలేదు. భద్రతాపర ఇబ్బందులు, బెదిరింపులు ఉన్నాయంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మూవీ రిలీజ్‌కు అనుమతించలేదు. చివరకు ఆగస్ట్ 20, 2013న ట్యాగ్‌లైన్ లేకుండానే మూవీ రిలీజైంది. తాను జయలలితను కలిశానని, సినిమా విడుదలకు ఆమె సాయం కోరినట్లు విజయ్ అప్పట్లో ఒక వీడియోను విడుదల చేశారు. తలైవా విడుదలలో ఇబ్బందులను గమనించిన విజయ్ అప్పటి నుంచి చిత్రాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా తన సినిమాలలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు లేకుండా చూసుకున్నారు.

సినీ ప్రముఖుల ఎంట్రీ..

ఇక 2016లో జయలలిత మరణం తర్వాత తమిళనాడులో పలువురు నటీనటులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌, కమల్ హాసన్ తమ పార్టీలను ప్రారంభించారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. కొంతకాలానికి రజనీకాంత్ తన పార్టీని రద్దు చేసుకున్నారు. అయితే కమల్ మాత్రం పోటీ చేయడం ఆపలేదు. అయినా ఆయన పార్టీ ‘‘మక్కల్ నీది మయ్యం’’ విఫలమైంది. DMK నేతృత్వంలోని కూటమిలో భాగస్వామిగా నిలిచింది. ఇన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయ్ తన సినీ కెరీర్‌పైనే దృష్టి సారించారు.

ఫ్యాన్స్ క్లబ్ హంగామా..

విజయ్ తండ్రి చంద్రశేఖర్ మాత్రం వెనక్కు తగ్గలేదు. 1993లో ఆయన విజయ్ కోసం అభిమానుల క్లబ్‌ను ప్రారంభించి తర్వాత ఐదేళ్లలో దాన్ని సంక్షేమ సంఘంగా మార్చారు. కేవలం నాలుగు సంవత్సరాల క్రితం నవంబర్ 2020లో విజయ్ అభిమానుల క్లబ్‌ను రాజకీయ పార్టీగా ‘‘ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్‌’’గా నమోదు చేసినట్లు ప్రకటించారు చంద్రశేఖర్. అయితే ఈ నిర్ణయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయ్ స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రవేశంపై వచ్చిన వార్తలను ఆయనే స్వయంగా కొట్టిపారేశాడు. రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదంటూ ప్రకటన కూడా విడుదల చేశారు.

“మా నాన్న ప్రారంభించిన రాజకీయ పార్టీకి నాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదు. ఆయన ప్రారంభించిన రాజకీయ పార్టీలో చేరవద్దని లేదా దాని కోసం పనిచేయవద్దని నా అభిమానులను కోరుతున్నాను. ఆ పార్టీకి, మా ఇయక్కం (అభిమానుల సంఘం)కి ఎలాంటి సంబంధం లేదు' అని విజయ్ ఒక ప్రకటనలో కోరాడు కూడా.

తండ్రికి దూరమయ్యాడని కథనాలు..

అయితే మెర్సల్ (2017), సర్కార్ (2018) వంటి చిత్రాల ద్వారా GST, నోట్ల రద్దు, భారతదేశ ఆరోగ్య పరిస్థితి, ఓటుకు నోటు పరిస్థితులను జనంలోకి తీసుకెళ్లారు. కానీ ప్రజా జీవితంలో మాత్రం వీటి గురించి విజయ్ ఎక్కడా మాట్లాడలేదు. నిజానికి రాజకీయ ప్రవేశంపై విజయ్‌కు తండ్రితో విభేదాలు పెరిగాయి. వాటి కారణంగానే ఇద్దరూ గత నాలుగేళ్లుగా మాట్లాడుకోవడం లేదని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇయక్కం ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు తమిళగ వెట్రి కజగం (TVK) నాయకుడు బుస్సీ ఎన్ ఆనంద్ రాజకీయాల్లోకి వచ్చేలా విజయ్‌ను ప్రోత్సహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలాన్ని పరీక్షించుకునే అవకాశం వదులుకోకూడదని సూచించారు.

ఫలించిన ప్రయోగం..

అక్టోబర్ 2021లో తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో 169 మంది యువకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో పంచాయతీ అధ్యక్షురాలిగా ఎన్నికైన విల్లుపురం జిల్లాలో మహిళా అభ్యర్థి సహా 115 మంది విజయం సాధించారు. జనం నుంచి పార్టీకి మంచి రెస్పాన్స్ రావడంతో రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆసక్తి విజయ్‌కి బలపడింది. అప్పటి నుంచి చెన్నైలో విద్యార్థుల ర్యాలీతో సహా కొన్ని కార్యక్రమాల్లో ప్రసంగించారు విజయ్. ఓట్ల కోసం నగదు తీసుకోవడానికి వ్యతిరేకంగా యువకులు గళం విప్పాలని కోరారు. ద్రావిడ ఐకాన్ ఈవీ రామసామి పెరియార్, మాజీ ముఖ్యమంత్రి కె కామరాజ్, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విలువలను కూడా ప్రస్తావించారు. గత రెండేళ్లుగా 10, 12వ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో టాప్‌ స్కోరర్లను సత్కరిస్తున్నారు. డిసెంబర్ 2023లో తూత్తుకుడి వరద బాధితులకు సహాయ సామగ్రిని పంపారు కూడా. కొన్ని సందర్భాల్లో విజయ్ జల్లికట్టుకు మద్దతుగా, నీట్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. యూనిఫాం సిలబస్ ఆవశ్యకతను కూడా ప్రస్తావించారు. కానీ తన రాజకీయ సిద్ధాంతాల గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు.

నెరవేరిన తండ్రి కల..

చివరగా ఊహాగానాలకు ముగింపు పలికిన విజయ్..ఈ ఏడాది ఫిబ్రవరిలో తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు. ఆగస్టులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆపై ఆదివారం (అక్టోబర్ 27) తన ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విజయ్ తండ్రి చంద్రశేఖర్, వృత్తిరీత్యా గాయకురాలైన తల్లి శోభన కూడా హాజరయ్యారు. విజయ్ ముందుగా వేదిక మీదున్న తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని, సుమారు రెండు లక్షల మందినుద్దేశించి తొలి ప్రసంగం పూర్తిచేశారు. అయితే విజయ్‌కి ఈ ప్రయాణం అంత సులభం కాదు. తమిళనాడు రాజకీయాల్లో రెండు ద్రవిడ పెద్దలు డీఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. విజయ్‌కి తమిళనాడు, కేరళలో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ రాజకీయాలకు మాత్ర విజయ్ కొత్త.

రాజకీయాల్లో సత్తా చాటగలడా?

ప్రేక్షకుల ముందు ఉద్వేగభరితంగా ప్రసంగించిన విజయ్ ..2026 అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రజాస్వామ్యం, సామాజిక సామరస్యం, మహిళా విద్య, సాధికారత, హేతుబద్ధ ఆలోచనా విధానం, రెండు భాషల విధానానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. నాస్తికత్వానికి కట్టుబడి ఉండనని, లౌకికవాదం, సామాజిక న్యాయం, పెరియార్ సమానత్వం సూత్రాలను సమర్థిస్తానని స్పష్టంగా పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఎంత భిన్నంగా ఉంటారో కాలమే సమాధానం చెప్పాలి.

Tags:    

Similar News