సిద్ధరామయ్య, డీకే ఢిల్లీకి ఎందుకెళ్లారు?
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ప్రచారంలో వాస్తవమెంతా? లేక కేవలం ఊహాగానాలేనా?;
కర్ణాటక(Karnataka)లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) పాలన రెండున్నరేళ్లు పూర్తిచేసుకోబోతుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి మార్పుపై ఉన్న చర్చ జరుగుతోంది. దీనికి తోడు సీఎం, ఆయన డిప్యూటీ డీకే శివకుమార్(D K Shivakumar) ఢిల్లీకి బయలుదేరడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధిష్ఠానం ఆశీస్సులతో తిరిగి సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగితే అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కుతారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవరాజ్ ఉర్స్ 2,792 రోజులు అంటే దాదాపు 7.6 సంవత్సరాలు పదవిలో ఉన్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య జనవరి 6, 2026 నాటికి ఆయన రికార్డును సమం చేస్తారు. సిద్ధరామయ్య గతంలో 2013-18 లో కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన విషయం తెలిసిందే.
లోపాయికారి ఒప్పందం...
2023 రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆ తర్వాత పార్టీ డీకేఎస్‌ను ఒప్పించి డిప్యూటీ సీఎంగా చేసింది. మొదటి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాత డీకే శివకుమార్ ఆ స్థానంలో కొనసాగుతారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.
రెండువర్గాలుగా ఎమ్మెల్యేలు..
ఇటీవల ముడా కుంభకోణం కర్ణాటక ప్రభుత్వాన్ని కుదిపేసింది. అందులో సిద్ధరామయ్య పాత్రపై ఆరోపణలు రావడంతో ఆయనను పక్కన పెడతారన్న ప్రచారం జరిగింది. కాని అలా జరగలేదు. అంతర్గత ఒప్పందం ప్రకారం శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన మద్దతు ఎమ్మెల్యేలు, సిద్ధరామయ్యనే పూర్తికాలం కొనసాగించాలని ముఖ్యమంత్రి మద్ధతు పలికే ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దని అధిష్టానం గట్టిగా హెచ్చరించడంతో వెనక్కుతగ్గారు.
ఢిల్లీకి వెళ్లడానికి కారణమేంటి?
AICC వెనుకబడిన తరగతుల విభాగం శుక్రవారం నిర్వహిస్తున్న"భాగీదారి న్యాయ్ సమ్మేళన్"లో పాల్గొనేందుకు సిద్ధరామయ్య, శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఈ పర్యటనలో రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని కలిసే అవకాశం ఉందని కాంగ్రెస్ అంతర్గత వర్గాల సమాచారం. జూలై రెండో వారంలో సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొరకని విషయం తెలిసిందే.
అధిష్టానం ఎందుకు వెనకాడుతుంది?
ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో OBC ముఖ్యమంత్రి ఒక్క సిద్ధరామయ్య మాత్రమే. ఆయన స్థానంలో మరొకరిని తీసుకొస్తే.. ఆ ప్రభావం బీహార్ ఎన్నికలపై పడే అవకాశం ఉంది. ఎందుకంటే గెలుపునకు ఆ రాష్ట్రంలో OBC ఓట్లు చాలా కీలకం. ఇది ఒక కారణం కాగా..అహింద (మైనారిటీలు, వెనుకబడిన తరగతులు మరియు దళితులకు కన్నడ సంక్షిప్త రూపం) వర్గాల మద్ధతు కూడా సిద్ధరామయ్యకు ఎక్కువగా ఉంది. మెజారిటీ శాసనసభ్యుల మద్దతున్న సిద్ధరామయ్యపై చర్య తీసుకుంటే వారి నుంచి వచ్చే తీవ్ర పరిణామాల గురించి కూడా పార్టీకి బాగా తెలుసు. సిద్ధరామయ్య ను OBCల ప్రతినిధిగా చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా..ఆయనను AICC OBC సలహా మండలి సభ్యునిగా నియమించింది. మండలి మొదటి సమావేశం ఇటీవల ఆయన నాయకత్వంలోనే జరిగింది.