ఈ కేంద్ర మంత్రికి లోక్ సభ సీటే దొరకడం లేదు...

ఆమె దేశానికంతా ఆర్థిక మంత్రి, కాని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేద్దామంటే ఎక్కడా సేఫ్ సీటు దొరకడం లేదు...

Update: 2024-03-13 10:57 GMT
నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫోటో)

పుట్టింటోళ్లు పొమ్మన్నారు’, ‘పదవిచ్చిన వాళ్లు వద్దన్నారు’, ‘మెట్టినింటోళ్లు ఖాళీ లేదంటున్నారన్నట్టుగా’ తయారైందా? మన అని చెప్పుకునే కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత విశ్వాసపాత్రురాలు, ఆరుసార్లు కేంద్ర బడ్జెట్ ను ఏకైక మహిళా మంత్రి, పైగా మూడు దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళ అయ్యంగార్ ఆడపడుచుకు 28 సీట్లున్న కర్నాటకలో ఒక్క సీటును కేటాయించడానికి కర్నాటక బీజేపీ శాఖ ఎందుకు వెనకడుగు వేసింది? ఆమె సొంత రాష్ట్రమైన ఏ తమిళనాడు నుంచో, మెట్టిన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచో పోటీ చేయించమని బీజేపీ అగ్రనాయకత్వానికి ఎందుకు సూచించిందీ? కర్నాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మన నిర్మలమ్మకు లోక్ సభ సీటు ఇవ్వడానికి వచ్చిన అభ్యంతరమేమిటీ? ఇప్పుడివన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలే అయినా కర్నాటక శాఖ చెప్పిన అభ్యంతరంలో హేతుబద్ధత ఉందేమోనన్న పునరాలోచనలో పడ్డారు కమలనాధులు.

అసలేం జరిగిందంటే...


బీజేపీ ప్రభుత్వమే మళ్లీ ఏర్పడితే కేంద్ర మంత్రులందరూ లోక్ సభ నుంచి గెలుపొందిన వారే ఉండాలన్నది పార్టీ సూత్రప్రాయ నిర్ణయం. దీనికనుగుణంగానే పార్టీలో పేరున్న కేంద్రమంత్రులందర్నీ వివిధ చోట్ల పోటీ చేయిస్తోంది. దానిలో భాగంగా నిర్మలా సీతారామన్ ను కర్నాటక నుంచి పోటీ చేయించాలని భావించి ఆ రాష్ట్ర నాయకత్వాన్ని పరిశీలించమని కోరింది. అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు కర్నాటక పార్టీ నాయకత్వం భేటీ అయినపుడు నిర్మలా సీతారామన్ అభ్యర్థిత్వ ప్రతిపాదన చర్చకు వచ్చినపుడు చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కావేరీ జలాలే కొంప ముంచాయా

బెంగళూరు సౌత్ లేదా మంగుళూరు నుంచి ఆమెను పోటీకి దింపితే బాగుంటుందన్న బీజేపీ కేంద్ర కమిటీ ప్రతిపాదనను రాష్ట్రనాయకులు తోసిపుచ్చారు. చివరకు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఆయన కుమారుడు కూడా వ్యతిరేకించారు. కర్నాటక నుంచి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు పంపినా ఆమె కావేరీ జలాల వివాదంలో మౌనం దాల్చారని, ఇది కాంగ్రెస్, ఇతర కన్నడ అనుకూల వర్గాలకు పెద్ద ఆయుధమైందని, అందువల్ల ఆమెను సొంతరాష్ట్రమైన తమిళనాడుకే పంపమన్నారు. కావేరీ జలాల వివాదమై సుదీర్ఘ కాలంగా తమిళనాడు, కర్నాటక మధ్య వివాదం నడుస్తోంది.

జీఎస్టీ పన్నుల వ్యవహారంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్ర మంత్రి నిర్మల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రానికి ఆమె అన్యాయం చేశారన్న రీతిలో విమర్శలు చేయడమే కాకుండా చలో డిల్లీ పేరిట కర్నాటక కాంగ్రెస్ మంత్రులు దేశరాజధానిలో ధర్నా చేశారు. ఇప్పుడీ విషయాలన్నింటినీ కర్నాటక బీజేపీ నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. ఒకవేళ ఆమెకు సీటిస్తే ఆ ప్రభావం మిగతా సీట్లపై కూడా పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే సమంయంలో ఆమె స్థానికత కూడా చర్చకు వస్తుందని, తమిళనాడులో పుట్టిన వ్యక్తిని తీసుకొచ్చి బెంగళూరులో ఎలా పోటీ చేయిస్తారంటే సమాధానం చెప్పలేని సంకట స్థితిలో ఉండాల్సి వస్తుందని మొరపెట్టుకున్నట్టు సమాచారం. సొంత నాయకులు, అన్ని రకాలుగా హంగులున్న వారిని వదిలేసి సీతారామన్ కు సీటు ఇవ్వడం తగదని కులాలు, మతాలు, వర్గాల వారీగా విన్నవించారు. దీంతో అధినాయకత్వం కూడా తలొగ్గక తప్పలేదు.

కన్యాకుమారి నుంచి పోటీ చేయిస్తే..

బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేయించాలనుకున్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ను తిరిగి తన సొంతరాష్ట్రమైన కేరళకు పంపి కాంగ్రెస్ నేత శశిథరూర్ పై పోటీ చేయిస్తున్నపుడు ఈమెను కూడా తన సొంతరాష్ట్రమైన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పోటీ చేయిస్తే మంచిదని ఓ సలహా కూడా కర్నాటక బీజేపీ నేతలు ఇచ్చారు. ఏఐఏడీఎంకే పొత్తులో భాగంగా ఆమె కన్యాకుమారి నుంచి పోటీ చేస్తే సులువుగా గెలుస్తారని చెప్పారు.

టీడీపీ పొత్తులో ఏపీ నుంచైనా...

ఇదే సమయంలో మరికొందరు ఆమెను తన అత్తవారి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయిస్తే బాగుంటుందని కూడా సూచించారని వినికిడి. నిజానికి ఆమె గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు సహకారంతో ఏపీ నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు తాజాగా అదే పార్టీతో బీజేపీ పొత్తు కూడా పెట్టుకున్నందున అది మంచి ఆలోచనే అనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో నాయకులు ఎక్కువై సీట్లు తక్కువ కావడంతో నిర్మలా సీతారామన్ కు సీటు వచ్చే అవకాశాలు కూడా తక్కువగానే కనిపిస్తున్నాయి.

ఇంతకీ ఎవరీ నిర్మలా సీతారామన్..

నిర్మలా సీతారామన్ ఓ తమిళియన్. 1959 ఆగస్టు 18న పుట్టారు. తమిళనాడులోని మధురైలో తమిళ అయ్యంగార్ కుటుంబం నుంచి వచ్చారు. సావిత్రి, నారాయణన్ సీతారామన్ దంపతులకు జన్మించారు. విల్లుపురం, మద్రాసు, తిరుచురాపల్లి, ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ చదివారు. ఇండో-యూరోప్ వాణిజ్యంపై దృష్టి సారించి ఆర్థిక శాస్త్రంలో ప్రోగ్రామ్ కోసం లండన్ వెళ్లారు. అనివార్య కారణాలతో ఆ కోర్సు పూర్తి చేయలేకపోయారు. లండన్ లో ఉన్నప్పుడు రీజంట్ స్ట్రీట్లోని ఓ గృహాలంకరణ షాపులో సేల్స్‌పర్సన్‌గా, UKలోని అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్ కు సహాయకురాలుగా పని చేశారు. కొంతకాలం జర్నలిస్టుగా బీబీసీ వరల్డ్ సర్వీసులో కూడా పని చేశారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు.

పరకాల ప్రభాకర్ తో వివాహం...

ఢిల్లీ జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శటీలో చదువుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నరసాపురానికి చెందిన పరకాల ప్రభాకర్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 1986లో వివాహం చేసుకున్నారు. పరకాల ప్రభాకర్ కూడా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన వారే. చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన వారే. వారికి ఒక అమ్మాయి వాంగ్మయి. ఇటీవలే ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. హైదరాబాద్ లో ప్రణవ అనే స్కూలును నడిపారు. నిర్మలా సీతారామన్ 2008లో బీజేపీలో చేరారు. అప్పటికే ఆమె భర్త పరకాల ప్రభాకర్ కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ రాజకీయ జీవితం మూడు పూవులు ఆరు కాయలుగా అప్రతిహాతంగా సాగుతుండగా పరకాల ప్రభాకర్ మాత్రం రాజకీయ వ్యవహారాలకు పుల్ స్టాప్ పెట్టి రాజకీయ, ఆర్ధిక, సామాజిక అంశాలపై విశ్లేషణలు, పరిశోధనలు చేస్తున్నారు.

Tags:    

Similar News