లోక్ సభ బరిలో నిర్మలా సీతారామన్, జైశంకర్?

కేంద్రంలో కీలక మంత్రి పదవుల్లో ఉన్న నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ లను లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-01-13 05:41 GMT
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

కేంద్రంలో కీలక మంత్రి పదవుల్లో ఉన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు రాజ్యసభకు ఎన్నికై మంత్రి పదవి చేపట్టారు. అయితే వీరిని ప్రత్యక్ష ఎన్నికల్లో దింపాలని కాషాయదళ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. వీరి ఇద్దరి కోసం ఇప్పటికే సురక్షిత స్థానాలు గుర్తించినట్లు, అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయించడానికి గ్రౌండ్ వర్క్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఇద్దరు కర్నాటకు నుంచే పోటీ?

కేంద్ర మంత్రి వర్గంలో కీలక స్థానాల్లో ఉన్న వీరిద్దరిని ప్రత్యక్ష ఎన్నికల్లో దింపాలని భావించిన బీజేపీ పెద్దలు వీరిని దక్షిణ భారత్ నుంచే పోటీకి దింపాలని భావించింది. అందులో భాగంగా కర్నాటకలో బీజేపీ పట్టున్న స్థానాలను గుర్తించాలని రాష్ట్ర శాఖను ఆదేశించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కర్నాటక బీజేపీ మాజీ అధ్యక్షుడు, నళిన్ కుమార్ కటీల్ కు పట్టున్న దక్షిణ కన్నడలోని ఓ సురక్షిత స్థానం నుంచి పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం.

జై శంకర్ కోసం బెంగళూర్..

కేంద్ర విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ కోసం బెంగళూర్ లోని కొన్ని స్థానాలను పరిశీలించాలని ఇంతకుముందే స్థానిక నాయకత్వాలకు సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బెంగళూర్ నగరంలోని బీజేపీకి కంచుకోటగా భావిస్తున్న బెంగళూర్ సౌత్, బెంగళూర్ సెంట్రల్ లేదా ఉత్తర కన్నడలోని మరో సురక్షిత స్థానాన్ని గుర్తించి అక్కడి నుంచి చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్ జైశంకర్, బెంగళూర్ లో తరచు పర్యటిస్తూ ఉంటారు. బెంగళూర్ లోని రాష్ట్రీయ సైనిక్ స్కూల్ లో నే ఆయన చదువుకున్నారు.

కాగా, ఇరువురు కేంద్ర మంత్రులు తమిళనాడు కు చెందిన వారు. దక్షిణాది నుంచి గరిష్ట లోక్ సభ స్థానాలు గెలవాలని భావిస్తున్న బీజేపీ, ఆ వ్యూహంలో భాగంగానే వీరిని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దింపాలని యోచినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కర్నాటక నుంచి, ఎస్ జైశంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Tags:    

Similar News