రాజీనామా చెయ్యను? వాళ్లేమైనా చేశారా? అని ప్రశ్నించిన కర్ణాటక సీఎం
ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్రసక్తేలేదని అంటున్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. తాను ఏ తప్పు చేయలేదని, రాజీనామా చేసే ప్రశ్నే లేదన్నారు.
మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ బెంగళూరులో గురువారం నిరసన ప్రదర్శన చేపట్టింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్రసక్తేలేదని తేల్చి చెబుతున్నారు సిద్ధరామయ్య. తాను ముమ్మాటికి నిర్దోషినని, ఏ తప్పు చేయలేదని, రాజీనామా చేసే ప్రశ్నే లేదని విలేఖరులతో అన్నారు. ముడా సైట్ కేటాయింపు 'స్కాం'లో ముఖ్యమంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని మైసూర్‌లోని లోకాయుక్త పోలీసులను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు బుధవారం ఆదేశించింది. మరోవైపు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరులోని రాష్ట్ర శాసనసభ, సచివాలయంలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట బీజేపీ గురువారం నిరసనకు దిగింది.
సిద్ధరామయ్యకు మద్దతుగా నిలిచిన డీకేఎస్..
ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆయన వర్గీయులు సిద్ధరామయ్యకు మద్దతుగా నిలిచారు. ఆయన పదవి నుంచి తప్పుకోరని స్పష్టం చేశారు. ఇది బీజేపీ, జేడీఎస్‌ల రాజకీయ కుట్ర అని శివకుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణకు చూసి ఓర్వలేకే తప్పుడు ఆరోపణలతో పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు.
ప్రధానిపై ఘాటుగా స్పందించిన సిద్ధరామయ్య..
తాను రాజీనామా చేయాలని పదే పదే కోరుతున్న మిత్రపక్షాలు, అలాగే మోదీపై సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. గోద్రా ఘటన సందర్భంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినపుడు ప్రధాని (అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ) రాజీనామా చేశారా? మోదీ ప్రభుత్వంలో కేంద్రం మంత్రిగా ఉన్న జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి బెయిల్‌పై ఉన్నారు. ఆయన రాజీనామా చేశాడా? అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. నేను ఏ తప్పు చేయలేదు. నేను రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు.” అని తేల్చి చెప్పారు సీఎం.
గవర్నర్ అనుమతిని సమర్థించిన హైకోర్టు..
సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి 14 స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీఎంను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. అయితే దీన్ని తప్పుబడుతూ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఆ మరుసటి రోజు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ గవర్నర్ ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పు చెప్పారు.