NDA నుంచి OPS నిష్క్రమణ
2026లో DMKని ఓడించడమే ఏకైక లక్ష్యమంటున్న OPS సలహాదారు;
బీజేపీ(BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి వైదొలుగుతున్నట్లు తమిళనాడు(Tamil Nadu) మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) ప్రకటించారు. గురువారం (జూలై 31) చెన్నైలో జరిగిన OPS మద్దతుదారుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రామనాథపురం నియోజకవర్గం నుంచి BJP కూటమితో కలిసి పోటీచేసి OPS ఓడిపోయారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు AIADMK తిరిగి NDAలో జతకట్టడంతో ఆ కూటమి నుంచి స్వచ్ఛందంగా నిష్క్రమించాలని నిర్ణయించుకున్నారు.
మోదీ మీద కోపమే కారణమా?
ప్రధాని మోదీ ఇటీవల రెండు రోజుల పాటు తమిళనాడులో పర్యటించారు. ఆ సమయంలో OPS ఆయనను కలవాలనుకున్నారట. గతంలోనూ కొంతమంది పార్టీ నేతల నుంచి ప్రధానిని కలిసేందుకు ప్రయత్నించినా ఆయన అపాయింట్‌మెంట్ దొరకని కారణంగా OPS బీజేపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని వార్తలొస్తున్నాయి. ఈ పరిణామాల తర్వాత సమగ్ర శిక్షా అభియాన్ (SSA) నిధులను విడుదల చేయడంలో కేంద్రం విఫలమైందని OPS బహిరంగంగానే విమర్శించడం మొదలుపెట్టారు.
సీనియర్ నాయకుడు పన్రుతి రామచంద్రన్‌తో కలిసి పన్నీర్ సెల్వం విలేకరులతో మాట్లాడుతూ..తన మద్దతుదారుల అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే NDA కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు పన్నీర్ సెల్వం అన్నారు. ఏ పార్టీతో జతకట్టేది త్వరలో ప్రకటిస్తామని రామచంద్రన్ పేర్కొన్నారు.
కూటమి నుంచి బయటకు రావడానికి గల కారణాలను అడిగినప్పుడు OPS సలహాదారు రామచంద్రన్ ఇలా పేర్కొన్నారు. “మేం కూటమి నుంచి ఎందుకు బయటకు రావాలనుకున్నామో అందరికీ తెలుసు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడంపై తర్వాత నిర్ణయం తీసుకుంటాము. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో DMKని ఓడించడమే మా ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యానికి మేము కట్టుబడి ఉన్నాం” అని అన్నారు.
ఓపీఎస్ శిబిరం డీఎంకేతో చేతులు కలిపే అవకాశం ఉందా? అని అడిగిన ప్రశ్నకు రామచంద్రన్ అలాంటిదేమీ లేదన్నారు. ఇటీవల మార్నింగ్ వాక్‌లో ఓపీఎస్, డీఎంకే నాయకుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మధ్య జరిగిన సంభాషణలు ఊహాగానాలకు దారితీశాయి. కాసేపు మాట్లాడుకున్నాక ఇద్దరు నాయకులు శుభాకాంక్షలు తెలుపుకుంటూ విడివిడిగా వెళ్లిపోయారు. కాని వారు కలిసి కాసేపు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
స్టాలిన్‌ను కలిసిన ప్రేమలత..
ఇదిలా ఉండగా గురువారం (జూలై 31) ఉదయం డీఎండీకే నాయకురాలు ప్రేమలత విజయకాంత్ స్టాలిన్‌ను ఆయన నివాసంలో కలిశారు. స్టాలిన్ ఆరోగ్యం గురించి తెలుసుకోడానికే ఆమె వెళ్లినట్లు చెబుతున్నారు. కాని రాజకీయ పరిశీలకులు మాత్రం ఎన్డీఏ నుంచి డీఎంకే శిబిరానికి మారే అవకాశం ఉందని అంటున్నారు.