‘తమిళనాడు డిమాండ్‌ను ప్రధాని పట్టించుకోలేదు’

‘‘కచ్చతీవు దీవి గురించి, తమిళ మత్స్యకారుల సమస్యల గురించి శ్రీలంక అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చించలేదు’’- డీఎంకే;

Update: 2025-04-07 09:01 GMT
‘తమిళనాడు డిమాండ్‌ను ప్రధాని పట్టించుకోలేదు’
Click the Play button to listen to article

కచ్చతీవు దీవిలో తమిళ మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని మోదీ (PM Modi) శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకేతో చర్చించనట్లు కనిపించడం లేదని, ఇది విచారకరమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చలో భాగంగా ప్రధాని ఇటీవల శ్రీలంకలో పర్యటించిన విషయం తెలిసిందే.


గతంలో కచ్చతీవు దీవి తమిళనాడు అసెంబ్లీ 02.04.2025న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. "తమిళనాడు జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టు చేయకుండా చూడాలి. కట్చతీవు ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని శ్రీలంక జైళ్లలో బందీలుగా ఉన్న జాలర్లను విడుదల చేయించాలి. శ్రీలంక నావికాదళం స్వాధీనం చేసుకున్న పడవలను తిరిగి ఇప్పించాలి,’’ అని అసెంబ్లీలో సభ్యులు తీర్మానం చేశారు.

‘‘శ్రీలంకను సందర్శించినప్పుడు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి మోదీ చర్యలు తీసుకోవాలని తీర్మానంలో కోరాం. ఈ విషయంపై మోదీ శ్రీలంక అధ్యక్షుడితో మాట్లాడతారని భావించాం. 97 మంది జాలర్లు, వారి పడవలు స్వదేశానికి చేరుకుంటాయని ఆశించాం. కానీ అలాంటిదేమీ జరగలేదు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మా డిమాండ్లను విస్మరిస్తోంది. అయితే మా జాలర్ల జీవనోపాధిని కాపాడడంలో మేం వెనక్కు తగ్గం. DMK ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలుస్తుంది..." అని స్టాలిన్ Xలో పోస్ట్ చేశారు.


అసలు ఎక్కడుంది ఈ దీవి?

తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో, భారత, శ్రీలంక భూభాగాల మధ్య ఉన్న ఒక చిన్న ద్వీపమే కచ్చతీవు. భారత్‌కు చెందిన కచ్చతీవు(Katchatheevu) దీవిని కాంగ్రెస్‌ సర్కార్ 1974లో శ్రీలంక(Sri Lanka)కు అప్పగించింది. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకేల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు అప్పగించారు.

వాస్తవానికి ఇది చాలా చిన్నదీవి. అయినప్పటికి మత్స్య సంపద ఎక్కువగా ఉండడంతో భారత మత్స్యకారులు ఇక్కడ వేట సాగిస్తుంటారు. అయితే దీవి తమ పరిధిలోకి వస్తుందంటూ అక్కడికి వెళ్లిన తమిళ మత్స్యకారులకు శ్రీలంక నావికా దళం అరెస్టు చేస్తోంది. వారి పడవలను స్వాధీనం చేసుకుంటుంది. ఈ దీవిలో భారత్‌ మత్స్యకారులకు ప్రవేశం ఉందని తమిళ మత్స్యకారులు వాదిస్తున్నా.. శ్రీలంక ఖాతరు చేయడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని తమిళనాడులోని వివిధ రాజకీయ పార్టీలు కేంద్రాన్ని కోరుతున్నాయి. దీవిని తిరిగి స్వాధీనం చేసుకుంటే తమ ప్రాణాలకు రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

Tags:    

Similar News