‘డీకే వ్యాఖ్యలతో కాంగ్రెస్ రహస్య ఎజెండా బయటపడింది’
ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై కర్ణాటకలో పార్టీల మధ్య పేలుతున్న మాటల తూటాలు..;
కర్ణాటక(Karnataka) ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shiv Kumar) ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అంశంపై ఆయన వ్యాఖ్యలు.. రాజ్యాంగాన్ని మార్చే రహస్య ఎజెండాని బయటపెట్టాయని బీజేపీ(BJP) ఆరోపించింది.
"ఓట్ల కోసం ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్(Congress) చూస్తోంది. ఇందుకోసం రాజ్యాంగాన్నే మార్చాలనే వారి ఉద్దేశం ఇప్పుడు బయటపడింది," అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్(Ravi Shankar Prasad) అన్నారు. ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
ఇటీవల ఒక మీడియా కార్యక్రమంలో పాల్గొన్న డీకే.. రాజ్యాంగం మారే రోజు కూడా వస్తుందని అనడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఆయన వ్యాఖ్యపై విమర్శలు వెల్లువెత్తడంతో సోమవారం శివకుమార్ వివరణ ఇచ్చుకున్నారు. మీడియా తప్పుగా అర్థం చేసుకుందని, తమకు రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
అయితే బీజేపీ నాయకులు డీకే వివరణను ఖండిస్తున్నారు. "కేవలం ఓట్ల కోసం రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడం ప్రమాదకరం," అంటూ రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు.
“మీ పార్టీ ఉప ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై మీరు స్పందించరా? మతం ఆధారంగా రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని మార్చమని మీరు స్పష్టంగా చెప్పగలరా?” అని ప్రసాద్ రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు.