చిరు ధాన్యాల పిచ్చుక.. ఇంత అందెగత్తా!

కిచ్ కిచ్ మని శబ్దం చేస్తూ... సూర్యోదయం వేళ మనల్ని పలకరించే పిచ్చుకలకు ఓ రోజు ఉందా...ఉంటే దాని ప్రాముఖ్యత ఏంటి...?

Update: 2024-03-20 06:50 GMT
చిరుధాన్యాలతో చిత్రకారుని అద్భుత సృష్టి ఈ పిచ్చుక

(తంగేటి నానాజీ, విశాఖపట్నం)

మదర్స్ డే...ఫాదర్స్ డే... లవర్స్ డే... ఉమెన్స్ డే ...ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత ఉంటుంది. 365 రోజులు ఏదో ఒక డేను మనం జరుపుకుంటూనే ఉన్నాం. మనుషులకే కాదు పక్షులకు ఒక రోజు ఉందని మనలో ఎంతమందికి తెలుసు. ఆ రోజు గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం...
చిట్టి పిచ్చుక... ఈరోజు నీదే...

కిచకిచా శబ్దం చేస్తూ ఉదయాన్నే పలకరించే పిచ్చుకలు కనుమరుగవుతున్నాయి. కారణాలు ఏమైనా పిచ్చుకలు అంతరించిపోవడాన్ని అధ్యయనం చేసిన మన దేశానికి చెందిన నేచర్ ఫరెవర్ సొసైటీ, ఫ్రాన్స్ కు చెందిన ఈకో-సిస్ ఫౌండేషన్ లు మరిన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి మార్చ్ 20న అంతర్జాతీయ పిచ్చికుల దినోత్సవంగా ప్రకటించాయి. దీనిని ఐక్యరాజ్యసమితి 2010లో ఆమోదించింది. అప్పటినుంచి ప్రతి ఏటా మార్చ్ 20న ప్రపంచవ్యాప్తంగా పిచ్చుకల దినోత్సవం జరిపి పిచ్చుకల సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పిచ్చుకలను సంరక్షించేందుకు, ప్రజలను ప్రోత్సహించడానికి గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఎన్ ఎఫ్ ఎస్ సంస్థ 2011 మార్చ్ 20 నుంచి పిచ్చుక పురస్కారాలను కూడా ప్రారంభించింది.

పిచ్చుక శాస్త్రీయ నామం 'పాసరి డొమెస్టికన్'

చెట్ల కొమ్మలపై.. పొలాల గట్లపై... కరెంటు తీగలపై... ఇళ్ల చూరులపై తిరుగాడే పిచ్చుకల శాస్త్రీయ నామం 'పాసరి డొమెస్టికన్' ప్రపంచవ్యాప్తంగా 35 రకాల పిచ్చుక జాతులు ఉండగా... మనదేశంలో 17 రకాలు ఉన్నాయి. పిచ్చుకల ఆవాసాలను మన నివాసాలుగా మార్చుకుంటున్నాం. పిచ్చుకలు ఎక్కువగా ఆవాసాలు ఏర్పాటు చేసుకునే తుమ్మ, కంచి చెట్లను నరికి వేస్తున్నాం. క్రాప్ ప్రొటెక్షన్ కు ఉపయోగపడే పిచ్చుకల సంరక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారనుంది' అన్నారు ఆంధ్ర యూనివర్సిటీ సైన్స్ కాలేజ్ ప్రొఫెసర్ డి.ఈ.బాబు. పిచ్చుకల సంరక్షణ పై ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు.

మోడ్రన్ ఆర్కిటెక్...

పిచ్చుకలను మనం మోడ్రన్ ఆర్కిటెక్ లుగా చెప్పుకోవచ్చు... ఇంజనీర్ల సహాయంతో ప్లాన్ గీయించి ఇసుక, సిమెంట్, ఇటుకలతో మనం ఇల్లు నిర్మించుకుంటే... ఎలాంటి ప్లాన్ లేకుండా గడ్డిపరకులు, పుల్లలతో పిచ్చుకలు అందమైన గూళ్లను నిర్మించుకుంటాయి. ఈ గూళ్లను మనం ఒకసారి పరిశీలిస్తే బయటకు మనకు రఫ్ గా కనిపించినా.. లోపల మాత్రం స్పాంజ్ పరుపు కంటే మెత్తగా ఉంటుంది.. తన పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గూడు నిర్మాణం ఉంటుంది. అందుకే వీటిని మోడ్రన్ ఆర్కిటెక్లుగా పిలుస్తారు.
రైతు నేస్తం...
ప్రపంచవ్యాప్తంగా 35 రకాల పిచ్చుకలు ఉండగా... మనదేశంలో 17 రకాల పిచ్చుకలు ఉన్నాయి. పదివేల సంవత్సరాల క్రితం నుంచి పిచ్చుకలు మనుషులకు నేస్తాలయ్యాయి. పంటలకు హాని చేసే క్రిమి, కీటకాలను పిచ్చుకలు హరించడంతో రైతులు వీటిని సంరక్షించడం మొదలుపెట్టారు.ఇంటి చూరుల్లో పిచ్చుకలకు ఆహారంగా వరి కంకులను పెట్టేవారు. వాటిని తిని పిచ్చుకలు ఆ చూరులోనే గూడు ఏర్పాటు చేసుకునేవి. ఇలా రైతులు సంరక్షించుకుంటూ వచ్చిన పిచ్చుకలు 1970 తర్వాత వచ్చిన క్రిమిసంహారక మందులు కారణంగా అంతరించిపోవడం మొదలయ్యింది.' పిచ్చుకల సంరక్షణ మన బాధ్యత. రైతులకు మేలు చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే పిచ్చుకలను కాపాడుకుందాం. పిచ్చుకల సంరక్షణ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి' అన్నారు గ్రీన్ క్లైమేట్ టీం కార్యదర్శి జేవి రత్నం.

చిరుధాన్యాలతో పిచ్చుకల చిత్రపటం....
పర్యావరణంలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మన ఇంటి ముందు సందడి చేస్తూ ఉదయాన్నే దర్శనమిచ్చే పిచ్చుకల జీవితం ఎంతో ప్రత్యేకం. ప్రస్తుత యుగంలో వీటి సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. నేడు అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం (మార్చి 20). దీనిని పురస్కరించుకొని నగరానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని తీర్చిదిద్దారు. చిరుధాన్యాలు ఉపయోగించి ఒక 2d చిత్రాన్ని రూపొందించారు.ప్రజల్లో పిచ్చుకల పట్ల, చిరుధాన్యాల పట్ల అవగాహన పెంపొందించడం ప్రధాన ఉద్దేశం గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. 'మానవ మనుగడలో, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో పిచ్చుకల పాత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, అదేవిధంగా మానవుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, పరిరక్షించడంలో చిరుధాన్యాల భూమిక సైతం గుర్తించాలి. అందుకే చిత్రాల ద్వారా ఈ సందేశాన్ని సమాజానికి అందిస్తున్నాను' అన్నారు నగరానికి చెందిన చిత్రకారుడు విజయకుమార్.
Tags:    

Similar News