ఐఏఎఫ్ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి: సీఎం సిద్ధరామయ్య

భాషా వివాదం రేపిన ఐఏఎఫ్ అధికారి విడుదల చేసిన వీడియో;

Translated by :  Chepyala Praveen
Update: 2025-04-22 13:21 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

బెంగళూర్ లో తనపై భాష సాకుతో దాడి జరిగిందని ఆరోపించి వీడియో విడుదల చేసిన ఐఎఎఫ్ అధికారి వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. తప్పుడు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వింగ్ కమాండర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన భాషా చర్చకు దారితీసింది. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ శిలాదిత్య బోస్, వికాస్ కుమార్ అనే బైకర్ తనను కన్నడలో దుర్భాషలాడాడని ఆరోపించారు.
అయితే సీసీ ఫుటేజీలు, ఘర్షణ జరగుతున్న సమయంలో ప్రజలు తీసిన వీడియోల ఆధారంగా ఇది కేవలం రోడ్డుపై జరిగిన ఘర్షణగా అని పోలీసులు తేల్చారు. ఈవివాదానికి భాషకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
ఈ అంశంపై ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు. కర్ణాటక, కన్నడిగులపై ఐఏఎఫ్ అధికారి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. 

కన్నడిగులు మతోన్మాదులు కారు..
‘‘కన్నడిగులు తమ మాతృభాష పట్ల గర్వపడే వ్యక్తులు, మతోన్మాదులు కాదు. భాషా సమస్యతో సంబంధం లేకుండా ఇతరులపై దాడి చేయడం లేదా దుర్వినియోగం చేయడం కన్నడిగుల తత్వం కాదు’’ అని ఎక్స్ లో ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు.
‘‘జాతీయ మీడియా తమ బాధ్యత, వృత్తిని మర్చిపోయి, ఎవరో చేసిన నిరాధారమైన ఆరోపణను తీసుకుని మొత్తం కర్ణాటక గౌరవాన్ని దెబ్బతీసే పనిచేయడం నిజంగా విచారకరం. ఇది ప్రతి కన్నడిగుడి మనసును గాయపరిచింది’’ అని ఆయన అన్నారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు..
చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోవద్దని ముఖ్చమంత్రి కన్నడిగులను కోరారు. ఈ వివాదంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే పోలీస్ కమిషనర్ ను ఆదేశించిందని వారికి హమీ ఇచ్చారు.
‘‘నిన్నటి సంఘటనకు సంబంధించి దోషులు ఎవరైనా, వారి స్థానం ఏదైనా వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ కమిషనర్ ను ఆదేశించాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. అన్యాయానికి గురైన వ్యక్తికి న్యాయం అందించడానికి కట్టుబడి ఉంది’’ అని ఆయన అన్నారు.
కర్ణాటకలో భాషా చర్చ తీవ్రమవుతున్న తరుణంలో ఈ సంఘటన జరిగింది. హిందీ, ఇంగ్లీష్ కంటే కన్నడకు ప్రాధాన్యం ఇవ్వాలని కన్నడ అనుకూల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తన భార్య స్క్వాడ్రన్ లీడర్ మధుమితా బోస్ తో కలిసి విమానాశ్రాయానికి వెళ్తుండగా బైకర్ అకస్మాత్తుగా తమ కారు దగ్గర ఆగి దాడి చేశాడని, తన ముఖం, మెడపై రక్తంతో ఉన్న వీడియోలో ఐఏఎఫ్ అధికారి ఇంతకుముందు ఆరోపించారు.
తన కారుపై డీఆర్డీఓ స్టిక్కర్ చూసిన తరువాత బైకర్ తమను దుర్భాషలాడటం ప్రారంభించారని ఆయన ఆరోపించాడు. అయితే పోలీసులు సేకరించిన సీసీటీవీ పుటేజీలో ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నట్లు కనిపించింది. దీనిపై ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నాయి.
Tags:    

Similar News