తమిళనాడు మద్యం కుంభకోణం: ఆ వేయి కోట్లు ఎవరికి చేరాయి?

నకిలీ ఇన్వాయిస్ లతో కుంభకోణానికి పాల్పడిన డిస్టిలరీలు;

Update: 2025-03-12 13:32 GMT

మహాలింగం పొన్నుస్వామి

తమిళనాడులో కూడా పెద్ద మద్యం కుంభకోణం చోటు చేసుకుందనే ఆధారాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కనుగొంది. ప్రయివేట్ డిస్టిలరీలతో సంబంధం ఉన్న నల్లధనం ఉత్పత్తి వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ బయటకు తీసింది.

తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్(టాస్మాక్) అధికారులపై అవినీతి ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ కరప్షన్(డీవీఏసీ) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కుంభకోణం మొత్తం భారీగా ఉండటంతో ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఈడీ దర్యాప్తు ప్రారంభం..
ప్రస్తుతం ఈడీ ప్రయివేట్ డిస్టిలరీలు, మధ్యవర్తులు, ఎక్సైజ్ శాఖ మంత్రి వి. సెంథిల్ బాలాజీతో సంబంధం ఉన్నట్లు చెప్పబడుతున్న వ్యక్తులపై దృష్టి పెట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు తరువాత ఈడీ అధికారులు టాస్మాక్ ప్రధాన కార్యాలయం, గోదాములు, ప్రయివేట్ డిస్టిలరీలు, సెంథిల్ బాలాజీతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది.
‘‘చాలా సంవత్సరాలుగా ప్రయివేట్ డిస్టిలరీలు నల్లధన లావాదేవీలకు కేంద్రంగా ఉన్నాయి. ఈ డిస్టిలరీలు, వాటి అనుబంధ ప్రదేశాల నుంచి రూ. 1000 కోట్ల ఆదాయం వచ్చిందని, దీని ఫలితంగా రాష్ట్ర ఖజానాకు గణనీయమైన నష్టం వాటిల్లిందని సూచించే ఆధారాలను మేము కనుగొన్నాము’’ అని ఈడీ అధికారి ‘ఫెడరల్’ తో చెప్పారు.
Full View

ఇప్పటి వరకూ తాము కేవలం కుంభకోణం మొదటి అంశాన్ని మాత్రమే కనుగొన్నామని చెప్పారు. అనుమానితులు ఇప్పటికే ఆధారాలను నాశనం చేయడానికి ప్రయత్నించారని చెప్పారు. ‘‘మేము స్వాధీనం చేసుకున్న పరికరాల నుంచి తారుమారు చేయబడిన సాక్ష్యాలను తిరిగి రికవరీ చేయడానికి మేము పనిచేస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.
ధరలు పెంచి మోసం..
డిస్టిలరీలు భారీగా ఆదాయం పొందడానికి ఇన్ వాయిస్ లను పెంచాయని సంబంధిత అధికారి వివరించారు. ‘‘అనేక డిస్టిలరీలు మోసపూరిత ఇన్ వాయిస్ లను జారీ చేశాయి. రవాణా చార్జీలు, సరఫరాలకు అధికంగా చార్జీలు అయినట్లు చూపాయి.
ఉదాహారణకు రూ. 1 లక్ష విలువైన లావాదేవీలను 1.5 లక్షలుగా నమోదు చేశాయి. మిగిలిన 50 వేలను మధ్యవర్తులకు కేవలం నగదు రూపంలో పంపిణీ చేశారు. వీరు ఆ మొత్తాన్ని టాస్మాక్ అధికారులతో పాటు కొంతమంది ఉన్నతాధికారులకు అందించి ఉండవచ్చు’’ అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
నగదు చేరిన వారిని గుర్తించడానికి ఈడీ నగదు ప్రవాహాలను ట్రాక్ చేస్తోంది. ఈ నగదులో టాస్మాక్ అధికారులకు కొద్ది మొత్తంలో మాత్రమే చేరుతుందని, ఇందులో ఎక్కువ భాగం శక్తివంతమైన రాజకీయ వ్యక్తులకు చేరి ఉంటుందని అధికారి అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఈడీ.. ఎస్ఎన్ జే డిస్టిలర్స్, కాల్స్ డిస్టిలరీస్, ఎంజీఎం డిస్టిలరీస్, శివ డిస్టిలరీస్, అకార్డ్ బ్రూవరీస్ లపై దృష్టి పెట్టింది. ఇవే టాస్మాక్ కు ముఖ్యమైన మద్యం సరఫరాదారులుగా ఉన్నారు.
ఇవి మద్యం సరఫరాలో వాటి కోటా ప్రకారం పంపిణీ చేశాయి. ఈ కుంభకోణం ఎంతవరకూ జరిగిందనే దానిపై ఈ ఐదు కంపెనీలు కీలకమైనవి. ఎంజీఎం డిస్టిలరీస్ నుంచి లెక్కల్లో చూపని రూ. 50 లక్షల వరకూ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారి వెల్లడించారు.
దర్యాప్తులో అనేక సవాళ్లు..
నేరానికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించడానికి దర్యాప్తు అధికారి నిరాకరించారు. ‘‘తమిళనాడులో అవినీతికి పాల్పడిన వ్యక్తులు తరుచుగా రాజకీయ పలుకుబడిలో ఉంటారు. ఇది స్థానిక కేసులను అణచివేయడానికి, దర్యాప్తును అడ్డుకోవడానికి వీలు కల్పిస్తుంది’’ అని ఆయన అన్నారు. విచారణ అడ్డుకునే ప్రయత్నాలను వారు వేగవంతం చేస్తారని కూడా చెప్పారు.
రాష్ట్ర మంత్రి బాలాజీ ఈ కుంభకోణంలో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ఆధారాలను ఈడీ వెలికితీయనప్పటికీ టాస్మాక్ అధికారుల సహకారంతో మద్యం వ్యాపార కుంభకోణం ఎలా జరిగిందో వెలికే తీసే అవకాశం ఉంది. సెంథిల్ బాలాజీ టాస్మాక్ ను పర్యవేక్షించే బాధ్యతలో ఉన్నాడు. అతని సహచరులను దర్యాప్తు లో కీలకంగా వ్యవహరించేలా చక్రం తిప్పే అవకాశం ఉంది.
రాజకీయ పరిణామాలు..
ప్రస్తుతం తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. ఇదే సమయంలో ఈడీ రంగ ప్రవేశం చేయడం రాజకీయ వివాదాన్ని సృష్టించింది. ప్రతిపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాల్లో ప్రభుత్వాలను లొంగదీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖ వంటి సంస్థలను ఉసిగొల్పుతుందని అధికార డీఎంకేతో సహ ఇతర పార్టీలు ఆరోపించాయి.
అయితే వీరికి విరుద్దంగా టాస్మాక్ ఎంప్లాయిస్ స్టేట్ ఫెడరేషన్ అధికారులు స్పందించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి కె. తిరుసెల్వం మాట్లాడుతూ.. అధికారులు, రాజకీయ నాయకులు కలిసి టాస్మాక్ ను నల్లధనాన్ని ఉత్పత్తి చేసే సంస్థగా మార్చాయని ఆరోపించారు.
ఆ సంస్థ ఆర్థిక స్థితిగతులపై ఆయన ప్రశ్నలు లెవనెత్తారు. ‘‘టాస్మాక్ నుంచి భారీగా ఆదాయం ఆర్జిస్తున్నప్పటిక లెక్కల్లో మాత్రం నష్ఖాలను చూపిస్తున్నారు. డిస్టిలరీ ఉత్పత్తులో 40 శాతం బ్లాక్ మార్కెట్ తరలించడమే ఇందుకు కారణం. అదే మా అనుమానం’’ అని చెప్పారు.
టాస్మాక్ తో సంబంధం ఉన్న బార్ లు, చిన్న మద్యం దుకాణాలు, ఎఫ్ఎల్ 2 లైసెన్స్ పొందిన సంస్థల ద్వారా ఇవన్నీ పంపిణీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ నిబంధలను విరుద్దమని ఆరోపించారు.
భారీగా అవినీతి..
ఈడీ దర్యాప్తు అనేది తమిళనాడు మద్యం పరిశ్రమలో లోతుగా పాతుకుపోయిన అవినీతి వ్యవస్థను సూచిస్తున్నాయి. ఇందులో టాస్మాక్ ఉన్నతాధికారులు, పెద్ద డిస్టిలరీలు, రాజకీయ నాయకులు ఉన్నారు.
ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ కుంభకోణంలో నాశనం చేసిన ఆధారాలను సేకరించే పనిని చురుకుగా చేస్తోంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించిన సమాంతర ఆర్థిక వ్యవస్థను వెలికితీసే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం బాలాజీ పాత్ర పై ఎక్కడా ఆధారాలు దొరకనప్పటికీ ఈడీ టాస్మాక్ కార్యకలాపాలు, కుంభకోణంలో ప్రమేయం ఉన్న వ్యక్తులపై దృష్టిని కేంద్రీకరించింది.
ప్రస్తుతం తమిళనాడులో వెల్లడయిన మద్యం కుంభకోణం ఢిల్లీ, చత్తీస్ గఢ్ లో జరిగిన కుంభకోణాల కంటే భిన్నంగా ఉంది. ఢిల్లీ విధాన మార్పులు తమకు అనుకూలంగా చేయడం కనిపించి కుంభకోణానికి పాల్పడగా, చత్తీస్ గఢ్ లో సమాంతర అమ్మకాలు జరిపే నెట్ వర్క్ ను తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మాత్రం ఓవర్ బిల్లింగ్, అక్రమ మార్కెట్ మళ్లింపు ద్వారా గుత్తాధిపత్యాన్ని తీసుకొచ్చారు.
Tags:    

Similar News