తమిళులు పవన్ నుంచి నేర్చుకోవాల్సిందేమీ లేదన్న డీఎంకే

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై డీఎంకే విరుచుకుపడింది. డీఎంకే ఏమి డిమాండ్ చేస్తోందో పవన్ కల్యాణ్ కి తెలుసా అని ప్రశ్నించింది.;

Update: 2025-03-15 11:20 GMT
Pawan Kalyan and Stalin
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై డీఎంకే విరుచుకుపడింది. డీఎంకే ఏమి డిమాండ్ చేస్తోందో పవన్ కల్యాణ్ కి తెలుసా అని ప్రశ్నించింది. భాషా విధానంపై తమిళనాడు వైఖరి పవన్ కు అర్థమైనట్టు లేదని ఆక్షేపించింది. త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ సరికొత్త వివాదానికి తెరలేపారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో ప్రసంగిస్తూ డీఎంకే తీరును ఆక్షేపించారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నప్పుడు.. తమిళ సినిమాల్ని హిందీలో డబ్బింగ్‌ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు డీఎంకే (DMK) అధికార ప్రతినిధి డాక్టర్‌ సయీద్‌ హఫీజుల్లా స్పందిస్తూ పవన్‌ విమర్శలను తోసిపుచ్చారు. భాషా విధానంపై తమిళనాడు వైఖరిని ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
‘‘వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని మేం ఎన్నడూ అడ్డుకోలేదు. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం ఇప్పటికే మా రాష్ట్రంలో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నాం. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్‌ఈపీ, పీఎం శ్రీస్కూల్స్‌ వంటి విధానాలతో మా రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అన్నారు డాక్టర్‌ సయీద్‌ హఫీజుల్లా.
డీఎంకే చెందిన మరో సీనియర్‌ నేత టీకేఎస్‌ ఎళన్‌గోవన్‌ మాట్లాడుతూ.. ‘‘1938 నుంచే తమిళులపై హిందీ భాష బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ద్విభాషా విధానాన్నే అమలుచేస్తామని ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించుకున్నాం. విద్యా నిపుణుల సలహాలు, సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకానీ సినీనటులు, రాజకీయ నాయకుల అభిప్రాయాలతో ఏకీభవించాల్సిన అవసరం లేదు. 1968లో ఆ బిల్లు పాస్‌ అయినప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఇంకా పుట్టి ఉండరు. తమిళ రాజకీయాలపై ఆయనకు అవగాహన లేకపోయి ఉండొచ్చు’’ అని విమర్శించారు.
పవన్‌ మాట్లాడుతూ.. త్రిభాషా వాదన సరికాదని, భారతదేశానికి బహుభాషలే కావాలని స్పష్టంచేశారు. ‘‘దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు తమిళ సినిమాల్ని హిందీలో డబ్బింగ్‌ చేయొద్దు. మీకు డబ్బులేమో ఉత్తరప్రదేశ్, బిహార్‌ వంటి రాష్ట్రాల నుంచి కావాలా? హిందీ మాత్రం వద్దా? ఇదేం న్యాయం? లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గిపోతుందంటూ ప్రకటనలు చేస్తున్నవారు.. నిజంగా అవి తగ్గుతాయో లేదో చర్చకు పెట్టాలి. అంతే తప్ప రూపాయి సింబల్‌ మార్చేసి తమిళ భాషలో పెట్టుకోవటం ఏంటి? వివేకం, ఆలోచన ఉండొద్దా?’ అంటూ పవన్‌ నిలదీశారు.
పవన్ కళ్యాణ్ కు డీఎంకే ఎదురు ప్రశ్న..
తమిళనాడు ఎల్లప్పుడూ ద్విభాషా విధానాన్ని అనుసరిస్తుందని, తమిళం, ఇంగ్లీష్ పాఠశాలల్లో బోధిస్తారని, పవన్ కళ్యాణ్ పుట్టక ముందు నుంచే ఈ బిల్లు ఉందని డీఎంకే నాయకుడు టీకేఎస్ ఎలంగోవన్ అన్నారు.
"మేము 1938 నుండి హిందీని వ్యతిరేకిస్తున్నాం... మాకు చెప్పాల్సింది సినీనటులు కాదు. విద్యా నిపుణుల సలహాలు, సూచనల మేరకే తమిళనాడు ద్విభాషా సూత్రాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర అసెంబ్లీలో మేము చట్టం కూడా చేశాం.. ఈ బిల్లు 1968లో పవన్ కళ్యాణ్ పుట్టకముందే ఆమోదించారు. తమిళనాడు రాజకీయాలు అతనికి తెలియవు" అని ఎలంగోవన్ పవన్ పై ఎదురుదాడి చేశారు.
కళ్యాణ్ వ్యాఖ్యకు ప్రతిస్పందిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, "'మీ హిందీని మాపై రుద్దకండి' అని చెప్పడం మరొక భాషను ద్వేషించడం లాంటిది కాదు. ఇది మాతృభాషను, సాంస్కృతిక గుర్తింపును గర్వంగా రక్షించుకోవడం మాత్రేమే" అన్నారు.
మరోవైపు బీజేపీ నేతలు పవన్‌ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. బీజేపీ నేత విక్రం రంధావా స్పందిస్తూ, హిందీ దేశీయ భాష అన్నారు. హిందీ భాష ప్రజలకు దరిచేరేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదే తప్ప మరో భాషకి వ్యతిరేకంగా కాదన్నారు. ఈదశలో పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన సమర్ధనీయమేనన్నారు. గత ప్రభుత్వాలు ఎప్పుడూ జాతీయతా సంస్కృతిని అణచివేయాలని చూశాయని, దక్షిణ భారతదేశంలో హిందీ వినియోగాన్ని గట్టిగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. దక్షిణ భారతదేశంలోని ప్రజలు తమ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ, భాషను మాట్లాడడంలో మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు.
"హిందీ మన జాతీయ భాష. ప్రభుత్వం హిందీ భాషను ప్రజలకు చేరువ చేసేలా కృషి చేస్తోంది. దురదృష్టవశాత్తు, గత ప్రభుత్వాలు జాతీయతా సంస్కృతిని అణచివేయడానికి ప్రయత్నించాయి... హిందీ వినియోగాన్ని దక్షిణ భారతదేశంలో కూడా గట్టిగా అమలు చేయాలి... దక్షిణ భారతదేశ ప్రజలు తమ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి ఉత్తర భారతదేశం ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ, హిందీ మాట్లాడటం, బోధించడంపై మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు..." అని విక్రం రంధావా అన్నారు.
"కొంతమంది సంస్కృతాన్ని ఎందుకు విమర్శిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. తమిళనాడు రాజకీయ నాయకులు హిందీకి వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతున్నారు? అదే సమయంలో తమ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయడానికి అనుమతిస్తుండటం ఏమి లాజిక్? బాలీవుడ్ నుంచి డబ్బు కావాలి, కానీ హిందీని అంగీకరించలేరు—ఇది ఎలాంటి తర్కం?" అని కళ్యాణ్ ప్రశ్నించడాన్ని రంధావా ప్రశంసించారు.
Tags:    

Similar News