అంతా ఈ ముగ్గురే చేశారా ?

లీకైన రిపోర్టులోని అంశాలను చూస్తే అవినీతి, అవకతవకల్లో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ పాత్రే ఎక్కువగా ఉన్నట్లు అర్ధమవుతోంది;

Update: 2025-08-02 07:45 GMT
KCR, Harish and Eatala Rajendar

 కాళేశ్వరంప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టు తెలంగాణలో సంచలనంగా మారింది. లీకైన రిపోర్టులోని అంశాలను చూస్తే అవినీతి, అవకతవకల్లో కేసీఆర్(KCR), హరీష్ రావు(Harish Rao), ఈటల రాజేందర్(Eatala Rajendar) పాత్రే ఎక్కువగా ఉన్నట్లు అర్ధమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project)తో పాటు మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలను నిర్మించాలన్న నిర్ణయం, నిర్మించేందుకు ఎంపికచేసిన స్ధలం, అంచనాలు, సవరించిన అంచనాలు, నాణ్యత మొత్తంలో పై ముగ్గురి పాత్రే కీలకమని జస్టిస్ ఘోష్(Justice PC Ghosh) గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. ఘోష్ అందించిన రిపోర్టు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttamkumar Reddy) నుండి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)కి అందింది. రిపోర్టును సాంతంచదివి ముఖ్య అంశాలను వివరించేందుకు రేవంత్ ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని వేశారు.

ఆకమిటీలో నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జ, సాధారణపరిపాలనశాఖ కార్యదర్శి రఘునందనరావు, న్యాయశాఖ కార్యదర్శి ఆర్. తిరుపతి సభ్యులుగా ఉన్నారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే విషయంలో ఎలాముందుకు వెళ్ళాలనే విషయాన్ని జీఏడీ కార్యదర్శి సూచిస్తారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అవకతవకల తీవ్రతను వివరించేందుకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, రిపోర్టు ఆధారంగా ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే వివరాలను న్యాయశాఖ కార్యదర్శి వివరిస్తారు. ముగ్గురు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలను క్యాబినెట్ కు అందిస్తారు. అప్పుడు ఘోష్ రిపోర్టుతో పాటు పై ముగ్గురి అభిప్రాయాలు, సూచనలపైన చర్చించేందుకు రేవంత్ క్యాబినెట్ ప్రత్యేకంగా ఈనెల 4వ తేదీన సమావేశం అవబోతోంది.

లీకైన వివరాల ఆధారంగా చూస్తే మొత్తంవ్యవహారంలో కేసీఆర్, హరీష్, ఈటల పాత్రే ఎక్కువగా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇదేసమయంలో కేసీఆర్ పేషీలో కార్యదర్శి హోదాలో పై ప్రాజెక్టులను పర్యవేక్షించిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పాత్రకూడా ఉందని రిపోర్టులో ఉన్నట్లు సమాచారం. అలాగే అప్పటి ప్రధాన కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన శైలేంద్రకుమార్ జోషి కూడా బాధ్యుడే అని రిపోర్టులో స్పష్టంగా ఉందని తెలిసింది.

కేసీఆర్ పాత్ర ఏమిటంటే నిర్మాణాలస్ధలాలను మార్చటం, కొత్త స్ధలాలను ఎంపిక చేయటం, అంచనాలు తయారుచేయించటం, మళ్ళీ అంచనాలను సవరించటం, ఉన్నతాధికారుల నిర్ణయం, సూచనలు, సలహాల ప్రకారం కాకుండా తనకు తోచినట్లుగా నిర్మాణాలు చేయమని ఒత్తిడిచేయటంతో పాటు నిర్మాణసంస్ధ ముఖ్యుల నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా ఇరిగేషన్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులను దూరంగా పెట్టడమే. ఇక అప్పటి మంత్రి హరీష్ పాత్ర ఏమిటంటే ఆదేశాలను ఫైల్ రూపంలో కాకుండా మౌఖికంగా జారీచేసి అర్జంటుగా ఉన్నతాధికారులతో ఫైళ్ళు తయారుచేయించి తెప్పించుకున్నారు. ప్రాజెక్టు, బ్యారేజీల నిర్మాణంలో హరీష్ అడ్డుగులోగా నిర్ణయాలు తీసుకున్నట్లు రిపోర్టులో ఉంది. హరీష్ నిర్ణయాలు ప్రాజెక్టు, బ్యారేజీల నిర్మాణాల నాణ్యతపై తీవ్రమైన ప్రభావం చూపినట్లు ఘోష్ రిపోర్టులో చెప్పినట్లు సమాచారం.

చివరగా మాజీమంత్రి, ప్రస్తుత మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పాత్రను కూడా రిపోర్టులో జస్టిస్ ఘోష్ ఎత్తిచూపారు. రాష్ట్ర ఆర్ధికపరిస్ధితి ఏమాత్రం బాగాలేదని తెలిసినా, కాళేశ్వరంలాంటి వేలకోట్లరూపాయల వ్యయంతో నిర్మించాలన్న నిర్ణయం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని తెలిసినా మౌనం వహించటమే ఈటల చేసిన తప్పుగా కమిషన్ స్పష్టంచేసింది. ఈటల మౌనం నేరపూరిత నిర్లక్ష్యమే అవుతుందని ఘోష్ ప్రత్యేకంగా చెప్పారు. మొత్తంమీద పీసీ ఘోష్ రిపోర్టులోని అంశాలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారబోతోందని అర్ధమవుతోంది. క్యాబినెట్లో రిపోర్టుపై చర్చించినాక అధికారికంగా కొంత, అనధికారికంగా కొన్నివివరాలు వెలుగుచూస్తాయి. పూర్తి వివరాలు బయటకు వచ్చినపుడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కటం ఖాయం.

అంతా సక్రమంగానే జరిగింది: కేసీఆర్

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంతా నిబంధనల ప్రకారమే జరిగింద’’ని కేసీఆర్ చెబుతున్నారు. ఇదే విషయాన్ని జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణలో కూడా చెప్పారు. ‘‘ప్రాజెక్టు నిర్మాణ స్ధలం ఎంపిక, అంచనాలు, అంచనాలను సవరించటం అంతా నిపుణులు, ఉన్నతాధికారుల నిర్ణయం ప్రకారమే జరిగింద’’న్నారు. ‘‘ప్రాజెక్టు నిర్మించాలన్న నిర్ణయం మాత్రమే తనదని మిగిలిన సాంకేతిక విషయాలన్నీ నిపుణులు, ఉన్నతాధికారుల నిర్ణయం ప్రకారమే జరిగింద’’ని చెప్పటం గమనార్హం.

క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఆరు క్యాబినెట్ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకున్న’’ట్లు హరీష్ రావు చెబుతున్నారు. ఇదేవిషయాన్ని కమిషన్ విచారణలో కూడా చెప్పారు. ‘‘ప్రాజెక్టుల నిర్మాణనిర్ణయాలను కేసీఆర్ ఏకపక్షంగా తీసుకున్నారన్న ప్రచారం, ఆరోపణలు తప్ప’’నిచెప్పారు. ‘‘ప్రాజెక్టునిర్మాణంలో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేద’’ని హరీష్ స్పష్టంగా చెప్పారు.

అవినీతికి కేసీఆరే బాధ్యుడు : ఉత్తమ్

‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటానికి కేసీఆర్, హరీష్ రావే బాధ్యత వహించాల’’ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ‘‘కేసీఆర్ అవినీతి వల్లే వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యింద’’ని మండిపడ్డారు. ‘‘ప్రాజెక్టు నిర్మాణం నష్టదాయకమని నిపుణులు చెప్పినా కేవలం అవినీతిచేయటం కోసమే ఇంతభారీ ప్రాజెక్టును కేసీఆర్ టేకప్ చేసి’’నట్లు మంత్రి అభిప్రాయపడ్డారు. ‘8క్యాబినెట్ సమవేశంలో రిపోర్టుపై చర్చించిన తర్వాత అవినీతి, అవకతవకల్లో ఎవరిపాత్ర ఏమిటో స్పష్టత వస్తుంద’’ని ఉత్తమ్ చెప్పారు.

Tags:    

Similar News