ఈ పాటిగడ్డ బస్తీ పోరడిపుడు హైదరాబాద్ 'సెయిలింగ్ స్టార్'

హైదరాబాద్ నగరంలోని మురికివాడ అయిన పాటిగడ్డ గల్లీ కుర్రాడి ప్రతిభకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది...అదెలాగంటే...;

Update: 2025-08-03 05:09 GMT
హైదరాబాద్ 'సెయిలింగ్ స్టార్' ముహమ్మద్ రిజ్వాన్

ఇదీ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుసేన్‌సాగర్‌...చిన్న పడవలకు తెరచాపలు కట్టుకొని సాగర జలాశయంలో సెయిలింగ్ రేసింగులో యువతీ యువకులు దూసుకుపోయారు...యూత్ ఓపెన్ రెగట్టా సెయిలింగ్ రేసింగ్ (Monsoon Regatta) పోటీల్లో హైదరాబాద్ కుర్రాడు ముహమ్మద్ రిజ్వాన్ అందరికంటే ముందుకు దూసుకువచ్చి ప్రతిష్ఠాత్మక స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. సెయిలింగ్ పోటీల (Sailing Racing) నుంచి ఒడ్డుకు వచ్చిన రిజ్వాన్ కు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వర్ణ పతకం అందించి అభినందించారు. అంతే సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆవరణలో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్న యువతీ, యువకులు రిజ్వాన్ ను చప్పట్లతో అభినందనల వర్షం కురిపించారు.




 పాటిగడ్డ బస్తీ నుంచి ఇండియన్ నేవీ దాకా...

హైదరాబాద్ నగరంలో నిరుపేదలు నివాసమున్న పాటిగడ్డ బస్తీ అది...ఈ మురికివాడలో నిరుపేద కుటుంబంలో పుట్టిన రిజ్వాన్ సెయిలింగ్ లో శిక్షణ పొంది, తన ప్రతిభ చూపించి ఇండియన్ నేవీలో చేరి హైదరాబాద్ సెయిలింగ్ స్టార్ గా (Sailing Star) ఎదిగాడు. పేదరికంలో జన్మించిన ముహమ్మద్ రిజ్వాన్ తండ్రి సాధారణ డ్రైవరు...తండ్రి గుండెపోటుతో మరణించడంతో బాల్యంలోనే రిజ్వాన్ తండ్రి లేని అనాథగా మారారు.తల్లి నిశాక్ పర్వీన్ ఇళ్లలో పాచిపని చేస్తూ రిజ్వాన్ ను చదివిస్తూ, మరో వైపు సెయిలింగ్ లో శిక్షణ ఇప్పించింది.హైదరాబాద్ యాచ్ క్లబ్ లో నావికుడిగా సెయిలింగ్ శిక్షణ పొందిన రిజ్వాన్ తన ప్రతిభను చాటుతూ పలు రజత, స్వర్ణ పతకాలను (Hyderabad boy Glory) సొంతం చేసుకొని అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు.‘‘ మా గల్లీ పోరడు రిజ్వాన్ సెయిలింగ్ లో స్వర్ణ పతకం సాధించి ఇండియన్ నేవీలో చేరి మా బస్తీ పేరును జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడని రాపోలు నర్సింహ అనే బస్తీ వాసి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



 - పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు సెయిలింగ్ లో అద్భుత ప్రతిభ కనబర్చిన ముహ్మద్ రిజ్వాన్ ఏకంగా ఇండియన్ నేవీలో నావికుడిగా ఎంపికయ్యారు. భారత నావికాదళంలో నావికుడిగా గోవాలోని నేవీ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్నాడు. ఒకవైపు నేవీలో శిక్షణ పొందుతూనే మరో వైపు సెయిలింగ్ లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. హైదరాబాద్ కుర్రాడు రిజ్వాన్ సాధించిన సెయిలింగ్ సాహస యాత్ర సక్సెస్ ప్రయాణం గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.


మలుపు తిప్పిన సెయిలింగ్ ప్రయాణం
‘‘నా పేరు ముహమ్మద్ రిజ్వాన్. నా నివాసం హైదరాబాద్ నగరంలోని పాటిగడ్డ. నా చిన్నతనంలోనే నా తండ్రి కారు డ్రైవరుగా పనిచేస్తూ గుండెపోటుతో మరణించాడు. దీంతో నా తల్లి నిశాక్ పర్వీన్ ఇళ్లలో పాచిపని చేస్తూ నన్ను చదివిస్తోంది. మా మామయ్య సెయిలింగ్ క్లబ్ లో పనిచేస్తుండటంతో సెయిలింగ్ శిక్షణ తీసుకోమని సూచించడంతో నేను యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లో చేరి సెయిలింగ్ ప్రయాణం ప్రారంభించాను.నేను గవర్నమెంట్ బాండిమెట్ హైస్కూల్‌లో చదువుతూ నేర్చుకున్న సెయిలింగ్ నా జీవితాన్ని మలుపు తిప్పింది.



 ఎన్నెన్నో పతకాలు

ఉదయాన్నే హుసేన్ సాగర్ తీరంలోని సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ కు వెళ్లి బోటుకు తెరచాప కట్టుకొని సాధన చేసేవాడిని. సెయిలింగ్ లో చిన్ననాటి నుంచి మెళకువలు నేర్చుకొని సెయిలింగ్ రేసింగ్ పోటీల్లో పతకాలు సాధించాను.2022వ సంవత్సరంలో ఆప్టిమిస్ట్ తరగతిలో జరిగిన 13వ మాన్సూన్ రెగట్టా పోటీలో నేను మొదటిసారి రజత పతకం గెలుచుకున్నాను. అప్పటి నుంచి నేను సెయిలింగ్ పోటీల్లో పాల్గొనేందుకు స్థిరంగా శిక్షణ పొందాను. సెయిలింగ్ జాతీయ ఈవెంట్లలో పాల్గొన్నాను. 2024వ సంవత్సరంలో జరిగిన 4వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగెట్టా పోటీల్లో నాకు రజత పతకం లభించింది.15వ మాన్సూన్ రెగట్టాలో కాంస్యం,యూత్ నేషనల్స్ 2025లో రజత పతకం సాధించాను. తాజాగా హైదరాబాద్ హుసేన్ సాగర్ లో జరిగిన 16వ మాన్సూన్ రెగట్టా పోటీల్లో ఏకంగా స్వర్ణపతకం సాధించాను.

జాతీయ ర్యాంకింగ్ లో టాప్ 5లో ఉన్నా...
నేను ప్రస్తుతం 5వ యూత్ ఆల్ ఇండియా (YAI) సెయిలింగ్ జాతీయ ర్యాంకింగ్‌లో టాప్ 5లో ఉన్నాను.సెయిలింగ్ రేసింగులో నేను స్వర్ణపతకం గెలవడం నాకు గర్వకారణమైన క్షణం. భవిష్యత్తులో అంతర్జాతీయంగా భారతదేశానికి సెయిలింగ్ లో ప్రాతినిధ్యం వహించాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను.

ఇండియన్ నేవీలో చేరాను...
సెయిలింగ్ రేసింగ్ పై ఉన్న ఆసక్తి, నేను సాధించిన విజయాలు, పతకాలతో ఇండియన్ నేవీలో (Indian Navy)పనిచేసే అవకాశం లభించింది. గోవాలోని నేవీ విభాగంలో చేరి శిక్షణ పొందుతున్నాను.భవిష్యత్ లో నేను భారత నావికాదళం బెస్ట్ సెయిలరుగా పనిచేయాలనేదే నా జీవిత లక్ష్యం. నా భారత దేశానికి అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో పతకాలు తీసుకురావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధన చేస్తున్నాను’’ అని సెయిలింగ్ స్వర్ణపతకధారి రిజ్వాన్ వివరించారు.


Tags:    

Similar News