కవిత అనుమానం నిజమేనా ?
జగదీష్ డైరెక్టుగా కవితను ఎద్దేవాచేస్తు మాట్లాడారంటేనే వెనుక ఎవరున్నారన్న విషయం అర్ధమైపోతోంది.;
కల్వకుంట్ల కవిత కామెంట్లకు మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈకౌంటర్ కారణంగా కవిత(Kalvakuntla Kavitha) అనుమానాలు నిజమే అన్నట్లుగా ఉన్నాయి. ఇంతకీ కవిత అనుమానం ఏమిటంటే పార్టీలోని లిల్లీపుట్(Lilliput leader) నాయకుడు, చోటామోటా నేతలను పార్టీలోని ఒక పెద్ద నాయకుడు తనపైకి ఉసిగొల్పుతున్నట్లు ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడినపుడు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. కవిత జగదీశ్వరరెడ్డి గురించి కామెంట్ చేశారో లేదో వెంటనే ఆమెకు జగదీష్ మధ్యాహ్నానికి కౌంటర్ ఇచ్చేశారు. ఇప్పటివరకు బీఆర్ఎస్(BRS) లోని ఏనేత కూడా కవిత గురించి బహిరంగంగా మాట్లాడిందిలేదు. అలాంటిది జగదీష్ డైరెక్టుగా కవితను ఎద్దేవాచేస్తు మాట్లాడారంటేనే వెనుక ఎవరున్నారన్న విషయం అర్ధమైపోతోంది.
కొంతకాలంగా పార్టీ వర్కింగ్ర ప్రెసిడెంట్ కేటీఆర్, కవితకు మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అన్న నాయకత్వాన్ని తాను అంగీకరించేదిలేదని కవిత ఓపెన్ గానే ప్రకటించారు. అప్పటినుండి పార్టీలో కవితకు ఆధరణ, గుర్తింపు తగ్గిపోయింది. అంతకుముందు కేసీఆర్ కూతురు అన్న హోదాతో కవిత పార్టీలో అపరిమితమైన అధికారాలను చెలాయించారు. ఎప్పుడైతే అన్నతో వివాదంమొదలై కేసీఆర్ ను కూడా కవిత లేఖలో నిలదీశారో అప్పటినుండే కవితకు పార్టీ దూరమైంది. అయినా నేతలెవరూ కవితగురించి ఎక్కడా బహిరంగంగా ఒక్కమాట కూడా మాట్లాడిందిలేదు.
అలాంటిది ఇపుడు కవితను ఎద్దేవాచేస్తు డైరెక్టుగా జగదీష్ మాట్లాడారంటే పార్టీలో కేసీఆర్ లేదా కేటీఆర్ ఎవరో ఒకళ్ళ మద్దతు లేదా ప్రోత్సాహంలేకుండా సాధ్యంకాదు. చెల్లెలుపై డైరెక్టుగా కేటీఆర్ కామెంట్ లేదా ఆరోపణలు చేయలేక జగదీష్ ను ముందుకు పెట్టారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉద్యమం అప్పుడు లిల్లీపుట్ నాయకుడు ఎక్కడున్నాడు అని తీవ్రంగా కవిత ప్రశ్నించారు. దానికి జగదీష్ స్పందించి ‘‘నా ఉద్యమ ప్రస్ధానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు’’ అని అన్నారు. అలాగే ‘‘కేసీఆర్ లేకపోతే జగదీష్ ఎక్కడుండే వాడు’’ అన్న కవిత కామెంటుపైన కూడా స్పందించాడు. ‘‘కేసీఆర్ లేకపోతే జగదీషే కాదు అసలు ఎవరూ లేరు’’ అని అన్నారు. అంటే తానేకాదు చివరకు కవిత కూడా కేసీఆర్ లేకపోతే ఉండేవారు కాదన్న అర్ధంవచ్చేట్లుగా మాట్లాడారు.
ఈమధ్య కేసీఆర్ భేటీలో బనకచర్ల, కాళేశ్వరంపై చర్చలు జరిగాయి కాని కవిత విషయమే ప్రస్తావనకు రాలేదన్నారు. అంటే కవితగురించి కేసీఆర్ అసలు ఆలోచించటంలేదని చెప్పకనేచెప్పారు. అలాగే కవితగురించి ఆలోచించేంత తీరిక కేసీఆర్ కు లేదన్నట్లుగా కూడా కవితను జగదీష్ తీసిపారేశారు. పైగా కవిత వైఖరి పట్ల సానుభూతి వ్యక్తంచేస్తున్నట్లు జగదీష్ అనటం కచ్చితంగా కవితను ఇరిటేట్ చేస్తుందనటంలో సందేహంలేదు. మొత్తానికి తనపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నవారి వెనుక ఎవరున్నారో తెలుసన్న కవిత కామెంటుకు అందరు ఇపుడు జగదీష్ వైపు చూస్తున్నారు. ముందుముందు ఇంకెంతమంది నేతలు కవితకు వ్యతిరేకంగా బయటకు వస్తారో చూడాలి.