కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధ్యయనం
బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కే మొగ్గు;
By : The Federal
Update: 2025-08-03 14:11 GMT
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ అందించిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన అధ్యయన కమిటీ సచివాలయంలో చర్చించింది. ఈ సమావేశానికి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ,ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ హాజరైంది. సోమవారం జరిగే తెలంగాణ కేబినెట్‌కు అందించాల్సిన కాళేశ్వరం నివేదికపై ఈ కమిటీ చర్చించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ ఘోష్ అందించిన నివేదిక ను క్షుణ్ణంగా పరిశీలించిన ,ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగాలన్న దానిపై అధ్యయన కమిటీ చర్చించింది. అయితే ఘోష్ కమిషన్ సూచించినట్లుగా బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కే అధ్యయన కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
దాదాపు 15 నెలలపాటు ఈ కమిషన్ విచారణ జరిపింది. చివరకు జులై 31వ తేదీన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. తన నివేదికను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసింది. ఆగస్టు 1వ తేదీన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ నివేదికపై ముగ్గురు అధికారులతో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఈ కమిటీ ఈరోజు సమావేశమైంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సోమవారం కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.