నిరాహార దీక్ష ప్రారంభించిన కవిత..
బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల పాటు కొనసాగనున్న కవిత దీక్ష.;
బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష చేపట్టారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీలు కావాలనే తాత్సారం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించిన రోజే కవిత కూడా తన దీక్షను ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటడం కోసం తాను 72 గంటలు నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. చెప్పినట్లే ఆగస్ట్ 4 ఉదయం ఆమె దీక్షకు కూర్చున్నారు. ధర్నాచౌక్ దగ్గర దీక్ష ప్రారంభించడానికి ముందుగా ఆమె బీఆర్ అంబేద్కర్, పూలే, ప్రొఫెసర్ జైశంకర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. తమిళనాడులో వచ్చిన రిజర్వేషన్లు తెలంగాణలో ఎందుకు రావని కవిత ప్రశ్నించారు.
దీక్ష ఎందుకంటే..
బీసీ బిల్లు ఎంత ముఖ్యం అనే అంశాన్ని దేశానికి చాటిచెప్పడమే లక్ష్యంగా తాను మూడు రోజుల పాటు దీక్ష చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో తెలంగాణ జాగృతి నేతలు, తాను కలిసి 72 గంటల పాటు దీక్ష చేయనున్నట్లు జులై 29న తెలిపారు. ‘‘బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడం కోసమే దీక్ష చేయనున్నాను. బీసీ బిల్లు విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదు. ఉంటే అన్ని పార్టీలతో వెంటనే అఖిలపక్షం ఏర్పాటే చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలి. ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టాలనుకున్న ధర్నా కేవలం బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నదే. బీసీ బిల్లులో చేయాల్సిన పనులను కూడా ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల కోసం సాగదీస్తూ వస్తున్నారు. బీసీ బిల్లును అడ్డుపెట్టుకుని ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతున్నారు. కావాలనే బీసీ బిల్లు విషయంలో కాంగ్రెస్ సాగదీత ధోరణ అవలంభిస్తోంది. బీజేపీ నేతలు తక్కువేం కాదు. బీసీలకు అండగా ఉండాల్సిన సమయంలో వాళ్లు మొఖం చాటేస్తున్నారు’’ అని కవిత మండిపడ్డారు.