రూటు మార్చిన ‘హైడ్రా’

హైదరాబాద్ లో బ‌స్తీతో దోస్తీ;

Update: 2025-08-03 08:50 GMT
బస్తీలతో దోస్తీకి హైడ్రా శ్రీకారం: కమిషనర్ ఏవీ రంగనాథ్ ను సన్మానిస్తున్న బస్తీవాసులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి బ్రెయిన్ ఛైల్డ్ సంస్థ అయిన ‘హైడ్రా’(Hydraa) తాజాగా రూటు మార్చింది. భవనాలపైకి బుల్డోజర్లను నడిపి కూల్చివేతలు చేపట్టిన హైడ్రా తాజాగా బస్తీతో దోస్తీకి శ్రీకారం చుట్టింది.ఇక నుంచి ఇళ్లను కూల‌గొట్టుడు కాదని, ప‌ర్యావ‌ర‌ణ హిత న‌గ‌ర నిర్మాణ‌మే (safe, clean, Eco friendly City)హైడ్రా ల‌క్ష్యం అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తాజాగా ప్రకటించారు. అలా ప్రకటించడమే కాకుండా బ‌స్తీతో దోస్తీ కార్య‌క్ర‌మాన్ని (Basti Dosthi Program) హైడ్రా టోలిచౌకీలో నిర్వహించి ప్రజల మద్ధతు కూడగట్టింది.


భవనాలను కూల‌గొట్టుడు కాదు.. 

‘‘భవనాలను కూల‌గొట్టుడు కాదు.. ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన, అంద‌రికీ నివాస యోగ్య‌మైన‌ న‌గ‌ర నిర్మాణ‌మే హైడ్రా ల‌క్ష్యం’’అని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప్రకటించారు. హైడ్రా అంటే భ‌యం కాద‌ని.. న‌గ‌ర ప్ర‌జ‌లంద‌రికీ ఓ అభ‌యం అని ఆయన పేర్కొన్నారు. చెరువులు, నాలాలు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను క‌బ్జా చేసిన వారు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఆయన సూచించారు.

కార్మికులకు షెడ్డువేసి కబ్జా
5 ఎక‌రాల భూమిని క‌బ్జా చేసి అందులో ప‌ని వాళ్ల‌కోసం ఒక షెడ్డు వేసి .. దానిని తొల‌గించిన‌ప్పుడు వారిని ముందుంచి గేమ్ ఆడి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న విష‌యాన్ని ప్రజలు గ్ర‌హించాల‌ని హైడ్రా కోరింది. `హైడ్రా బ‌స్తీతో దోస్తీ` కార్య‌క్ర‌మంలో భాగంగా టోలీచౌక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మొట్ట‌మొద‌టి కార్య‌క్ర‌మంలో వివిధ బ‌స్తీల నుంచి వ‌చ్చిన ప్ర‌జల‌ను ఉద్దేశించి క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ మాట్లాడారు. హైడ్రా ఎప్పుడూ పేద‌లు, సామాన్యుల ప‌క్ష‌మే అని తాము చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలిస్తే అర్థ‌మవుతుంద‌న్నారు. హైడ్రాను బూచిగా చూపించి వారి క‌బ్జాల‌ను, ఆక్ర‌మ‌ణ‌లను కాపాడుకోడానికి బ‌డాబాబులు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని ఆయన పిలుపునిచ్చారు.

పేదలకు హైడ్రా భరోసా
హైదరాబాద్ నగరంలో పేద‌లు ఎక్క‌డైనా ఇల్లు నిర్మించుకుని ఉంటే వాటిని కూల్చబోమని.. ఒక వేళ త‌ప్ప‌ని స‌రైతే వారికి ప్ర‌త్యామ్నాయంగా ఎక్క‌డైనా నివాసాన్ని చూపించి మాత్ర‌మే హైడ్రా ముందుకెళుతుంద‌ని రంగనాథ్ స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ విధానం కూడా ఇదేన‌ని ఆయన స్పష్టం చేశారు.

మూసీ సుందరీకరణతో హైడ్రా సంబంధం లేదు
‘‘మూసీ న‌ది సుంద‌రీక‌ర‌ణ‌తో హైడ్రాకు సంబంధం లేదు.. న‌దీప్ర‌వాహానికి అడ్డంగా మారిన క‌బ్జాల‌ను తొల‌గించాం. ఇలా 10 ఎక‌రాల మేర క‌బ్జా చేసి నెల‌కు రూ.కోటి ఆదాయం పొందుతున్న‌వారి భ‌ర‌తం ప‌ట్టాం’’అని రంగనాథ్ చెప్పారు.

నాలాలు, చెరువుల ప‌రిర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త‌
నాలాల‌ను, చెరువుల‌ను కాపాడ‌డం (Protect Lakes)అంద‌రి బాధ్య‌త‌గా భావించాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కోరారు. ‘‘షేక్‌పేట‌, టోలీచౌక్ ప్రాంతంలోని విరాట్‌న‌గ‌ర్‌, బ‌స‌వ‌తార‌కం న‌గ‌ర్ ప్రాంతాల్లోని నాలాల్లో ప‌రుపులు, దిండ్లు, ప్లాస్టిక్ వ్య‌ర్థాలు ఏళ్లుగా పేరుకుపోవ‌డంతో గ‌తంలో వ‌ర‌ద ముంచెత్తేది. ప‌ది రోజులుగా నాలాల పూడిక‌ను తొల‌గించ‌డంతో ఇప్పుడు వ‌ర‌ద సాఫీగా సాగుతోంది’’ అని రంగనాథ్ బస్తీతో దోస్తి కార్యక్రమంలో చెప్పారు.బ‌స్తీతో దోస్తీ కార్య‌క్ర‌మం ఆరంభం మాత్ర‌మేనని, న‌గ‌రంలోని 750 బ‌స్తీలకు వ‌ర‌ద ముప్పు ఉంద‌నీ.. అన్ని బ‌స్తీల్లో నాలాల‌ను ప‌రిశుభ్రం చేసి ముంపు ముప్పును త‌ప్పిస్తామ‌ని హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైడ్రా పేద‌ల ప‌క్ష‌మ‌ని మ‌రోసారి రుజువైంద‌ని జూబ్లీహిల్స్‌, షేక్‌పేట కార్పోరేట‌ర్లు వెంకటేష్, ఫ‌రాజ్‌లు చెప్పారు.



 పాఠశాల భవన నిర్మాణానికి చర్యలు

సికింద్రాబాద్ రాష్ట్రప‌తి రోడ్డులోని చారిత్ర‌క కింగ్స్‌వే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు.వందేళ్లకు పైగా చ‌రిత్ర ఉన్న ఈ పాఠ‌శాల శిథిలావ‌స్థ‌కు చేరుకుంద‌ని మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాన్ని దృష్టిలో పెట్టుకుని క‌మిష‌న‌ర్ క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించారు.పైనుంచి పెచ్చులూడి ప్ర‌మాద‌క‌రంగా ఉంద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.ఇదే విష‌యాన్ని జిల్లా క‌లెక్ట‌ర్‌, విద్యాధికారి దృష్టికి కూడా తీసుకెళ్లి వెంట‌నే పాఠ‌శాల నిర్మాణం జ‌రిగేలా చూస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ చెప్పారు.



 2 వేల గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా

‘‘ఎంతోమంది అధికారుల‌ను క‌లిశాం... ఎన్నో విన‌తి ప‌త్రాలు ఇచ్చాం. లే ఔట్ ప్ర‌కారం ప‌క్కాగా పార్కు స్థ‌ల‌మే అయిన‌ప్ప‌టికీ.. క‌బ్జాల పాలైంది. చుట్టూ ప్ర‌హ‌రీ నిర్మాణానికి రూ. 50 ల‌క్ష‌లు నిధులు మంజూరైనా.. క‌బ్జా చేసిన వారు ఆడ్డుకోవ‌డంతో ప‌నులు ఆగిపోయాయి. ఇలా ద‌శాబ్దాలుగా పోరాడుతున్నాం. హైడ్రాను ఆశ్ర‌యించాం. పార్కుకు క‌బ్జాల చెర నుంచి హైడ్రా విముక్తి క‌ల్పించారు. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పిల్ల‌లు ఆడుకునేందుకు స్థ‌లం చూపింది. హైడ్రాకు ధ‌న్య‌వాదాలు’’ అని మూసాపేట‌లోని ఆంజ‌నేయ‌న‌గ‌ర్ కాల‌నీ నివాసితులు ఆనందం వ్య‌క్తం చేశారు.


Tags:    

Similar News