‘కాళేశ్వరం లోపాల, పాపాల పుట్ట....’
అడుగడుగునా ఆర్థిక అవకతవకలు, నియమాల ఉల్లంఘనలు: పీసీ ఘోష్ కమిషన్ తేల్చిన వాస్తవాలు;
By : Saleem Shaik
Update: 2025-08-05 03:24 GMT
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ తేల్చింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి, లోక్ పాల్ మాజీ ఛైర్మన్ అయిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ జరిపిన విచారణలో పలు సంచలన వాస్తవాలు వెలుగుచూశాయి. తెలంగాణ రాష్ట్రానికి జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో వ్యక్తిగత నిర్ణయాలు,రాజకీయ నాయకత్వం అనవసర ప్రభావం వల్ల పాలనా ప్రణాళిక,కొరవడిన సాంకేతిక పర్యవేక్షణ,ఆర్థిక క్రమశిక్షణలో తీవ్ర వైఫల్యాల కారణంగా ప్రజా ధనం భారీగా వృధా అయిందని కమిషన్ నివేదిక తేల్చి చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలు,ప్రజా ధనం దుర్వినియోగం ఆరోపణలపై కమిషన్ నివేదిక పలు విషయాలను వెల్లడించింది.
అడుగడుగునా లోపాలు...ఎత్తి చూపిన కమిషన్
బ్యారేజీల నిర్మాణానికి సరైన ప్రణాళిక లేకపోవడం, తప్పుడు అంచనాలు రూపొందించి చట్టవిరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని కమిషన్ పేర్కొంది. టర్న్‌కీ పద్ధతిలో కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టులు ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారని తేలింది. ప్రాజెక్టు నిర్మాణంలో సవరించిన అంచనాలు దురుద్దేశంతో కూడినవని, కాంట్రాక్టు ఏజెన్సీలకు అనుచితంగా లబ్ధి చేకూర్చేందుకు చేసినవని కమిషన్ పేర్కొంది. సవరించిన అంచనాలు కుట్రపూరితంగా మంజూరు చేసి, సమయం పొడిగించారని తేలింది. మూడు బ్యారేజీల నిర్మాణంలో ప్రాథమికంగా లోపభూయిష్టంగా ఉన్న డిజైన్లు చేశారని, ప్రాజెక్టు పనుల్లో నాణ్యత నియంత్రణ సరిగా లేదని, లోపభూయిష్టంగా నిర్మాణాలు చేశారని వెల్లడించింది.
పెంచిన అంచనాలతో నిధుల దుర్వినియోగం
కాళేశ్వరం ప్రాజెక్టు ఆపరేషన్, నిర్వహణ లేదని, దీనిపై నిర్మాణ సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు లేవని కమిషన్ ఎత్తి చూపించింది.కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ పనులు పూర్తి కాకుండానే అక్రమంగా పూర్తి అయినట్లు సర్టిఫికెట్లు జారీ చేసి కాంట్రాక్టరు బ్యాంక్ గ్యారెంటీలను విడుదల చేశారని తేలింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక దుర్వినియోగం జరిగిందని కమిషన్ వెల్లడించింది. మొదట రూ.38,500 కోట్లతో రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రతిపాదనలు రూ.71,436 కోట్లకు పెరిగాయి. 2016వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖ ప్రకారం, తరువాత మార్చి 2022 నాటికి రూ.1,10,248,48 కోట్లకు పైగా సవరించిన పరిపాలనా ఆమోదాలు కనిపించాయని కమిషన్ తేటతెల్లం చేసింది.
రాష్ట్ర బడ్జెట్ పై రుణ భారం
కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం వల్ల ఇప్పటికే పూర్తి అయిన రూ.6000 కోట్ల పని అదనంగా రూ.1500 కోట్లు టన్నెల్ లైనింగ్,ఫిల్లింగ్ కోసం, అదనపు భూసేకరణ ఖర్చులు అయ్యాయని నిపుణుల కమిటీ గుర్తించింది.బడ్జెట్ పై రుణ భారం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిమిటెడ్ 2022 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ హామీలతో రూ.87,449,15 కోట్ల రుణాలను సేకరించింది. ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణం, వడ్డీ తిరిగి చెల్లించే భారం రాష్ట్ర బడ్జెట్‌పై పడే అవకాశం ఉంది.సెప్టెంబర్ 2024 నాటికి రూ.29,737,06 కోట్ల అసలు,వడ్డీకి చెల్లించారు. మిగిలిన అసలు మొత్తం రూ. 64,212,78 కోట్లు, రూ. 41,638 కోట్ల అదనపు వడ్డీ చెల్లించాలని కమిషన్ వెల్లడించింది.ప్రాజెక్టు వ్యయం అంచనాలను సర్దుబాటు చేసి టెండర్‌లో చేర్చిన తర్వాత నిర్మాణ వ్యయం పెరిగింది. ఐదు ఒప్పందాలలోని నిబంధనల వల్ల రూ.1,342,48 కోట్ల వ్యయం పెరిగింది. పెరిగిన అంచనా వ్యయం, కాంట్రాక్టర్లకు అనవసర ప్రయోజనాలు మొత్తం రూ. 612,51 కోట్లుగా కమిషన్ వెల్లడించింది.