పోరాట పటిమతో ఉన్నతస్థాయికి ఎదిగిన మహనీయుడు
కీర్తిశేషులు జస్టిస్ పుంజాల శివశంకర్;
ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, దూరదృష్టి, దృఢ సంకల్పం ఉంటే కటిక పేదరికంలో పుట్టినా అత్యంత శిఖరాలను అందుకోవచ్చని నిరూపించిన ఆదర్శమూర్తి జస్టిస్ శివశంకర్. కారుమబ్బుల్ని సైతం చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిలా అణచివేత చీకట్లను పాతరేస్తూ, యావత్ దేశమే గర్వించేలా ఎదిగిన మహనీయుడు, కీర్తిశేషులు జస్టిస్ పుంజాల శివశంకర్. ఆయన జ్యోతీరావు ఫూలే, సాహుల వారసత్వాన్ని తెలుగు నేలపై కొనసాగించిన ఆదర్శప్రాయుడు. ఆయన జీవిత-పోరాటం ఈ నవతరానికి ఎంతో ఆదర్శం. ఆయన 96వ జయంతిని ఆగస్టు 10వ తేదీన బహుజనులు ఘనంగా జరుపుకుంటున్నారు.
కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ మున్నూరు కాపు సామాజిక వర్గంలోని ఒక పేద కుటుంబంలో హైదరాబాద్ శివారులోని మామిడిపల్లి అనే గ్రామంలో1929 ఆగస్టు 10న జన్మించారు. ఓ సామాన్యుడి జీవితంలో ఎన్ని మలుపులు ఉంటాయో, అంతకన్నా ఎక్కువే శివశంకర్ జీవితంలో ఉన్నాయి. భిన్న కోణాలు ఆయనలో దర్శనమిస్తాయి. ఇంటి నుంచి చిన్నతనంలోనే అన్నతో పాటు వెళ్లిపోయి, అమృత్సర్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం మీద కాలం వెళ్లదీస్తూ, చెప్పులు కుట్టి, ఆకలితో అలమటించారు. తోడ పుట్టిన అన్నయ్య జగన్ చనిపోయినా చదువును మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన అనుభవించిన కష్టాలు మరెవరూ అనుభవించలేదంటే అతిశయోక్తి కాదు. తాను ఎక్కవలసిన మెట్లను తానే నిర్మించుకొని, ఒక్కొక్కటిగా ఎక్కి ఉన్నత శిఖరాలు అధిరోహించారు. శివశంకర్ జీవితంలో జరిగిన దుఃఖకరమైన, హృదయవిదారక ఘటనలు ఏ నాయకుడుకి జరగకపోవచ్చు. అయినా కానీ పోరాట పటిమతో ఉన్నతస్థితికి చేరుకున్నారు. అమృత్ సర్ హిందూ కాలేజీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఎల్ ఎల్ బి పూర్తి చేశారు.
1955 లో ఆయనకు లక్ష్మిబాయ్ తో వివాహం అయింది. అయనకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు. 1974-75లో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన మొదటి సారి గా 1977 లో ఇందిరాగాంధీ ని కలుసుకున్నా తన అపార న్యాయ విజ్ఞానంతో ఆమె మనసు చూరగొనడమే కాకుండా అతి తక్కువ కాలంలో ఆమెకు అత్యంత సన్నిహితుడయ్యారు. 1977 లో ఎమర్జీన్సీ తర్వాత ఆయన ఇందిగా గాంధీకి న్యాయవాదిగా కూడా ఉన్నారు. అపుడు మాజీ కర్నాటక గవర్నర్ హన్స్ రాజ్ భరద్వాజ్ శివశంకర్ కి సీనియర్ అసిస్టెంట్. తర్వాత 1979లో సికిందరాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ నియోజకవర్గం నుంచి 1980 లో రెండో దఫా ఎన్నికయ్యారు. 1981లో ఇందిరాగాంది మంత్రి వర్గంలో చాలా కీలకమయిన నాయకుడిగా ఉన్నారు. అపుడాయన న్యాయ శాఖమంత్రి. న్యాయ పాలనలో ఒక కీలకమయిన సంస్కరణగా పేరుపొందిన లీగల్ ఎయిడ్ ఆయన ఆలోచనే. ఆయన కీలకమయిన బాధ్యతలు నిర్వహించారు. ఆయన పెట్రోలియం మంత్రిగా కూడా పనిచేశారు.ప్రధాని నివాసానికి దగ్గరలో 5, సఫ్దర్ జంగ్ లేన్ బంగళాను ఆయన కేటాయించారు. ఒకసారి లోకసభ ఎన్నికలలో ఓడిపోయినా(మెదక్) చాలామంది లాగా ఆయన క్రియా శీల రాజకీయాలనుంచి కనుమరుగు కాలేదు. కాంగ్రెస్ నాయకత్వం ఆయనను గుజరాత్ నుంచి రాజ్యసభ కు తీసుకువచ్చింది. ఏ సభలో సభ్యత్వం లేని రోజులలో కూడా ఆయనకు ప్రధాని నివాసంతో గట్టి సంబంధాలు ఉండేవి. అందుకే సఫ్దర్ జంగ్ లేన్ నివాసం చాలాకాలం కొనసాగింది. ఇందిర, రాజీవ్ కాలంలో అన్నికీలకమయిన పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలలో ఆయన పాత్ర వుండేది.రాజీవ్ హాయంలో చాలా కీలకమయిన నిర్ణయాలెన్నో తీసుకున్నా సరే ఆయన పనితీరు ఎపుడూ వివాదాస్పదం కాలేదు. ఆయనకూడా ఎపుడూ వార్త లకెక్కేప్రయత్నం చేయలేదు. రాజీవ్ దూతగా ఆయన నేపాల్, బంగ్లాదేశ్ లను సందర్శించి ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడంలో ప్రధానికి బాగా సహకరించేవాడని ఆయన మిత్రులు చెబుతారు. పంజాబ్ ఒప్పందంలో కూడా శివశంకర్ కీలక ప్రాత పోషించాడని చెబుతారు. రాజీవ్ గాంధీ హాయంలో ప్రభుత్వంలో ప్రధాని తర్వాత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి శివశంకరే. మరొక పేరు చెప్పుకుంటే అది ఎం ఎల్ ఫోతే దార్.1985లో శివశంకర్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1993 దాకా రాజ్యసభలోనే కొనసాగారు. ఈ మద్యలో ఆయన విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. కొద్ది రోజులు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛెయిర్మన్ గా కూడా పనిచేశారు. 1988-89 లో రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నాయకుడిగా ఉన్నారు. తర్వాత సిక్కిం, కేరళ వర్నర్ గా నియమితులయ్యారు. 1998లో తెనాలి నుంచి లోక్ సభ కు పోటీచేసి గెలుపొందారు. 2004 లో ఆయన కాంగ్రెస్ ను వదిలేశారు. తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్ లో విలీనమయింది.
మన భారత రాజ్యాంగంలో న్యాయవ్యవస్థ… రాజకీయ వ్యవస్థ రెండూ అరుదైనవే. ఈ రెండింటిలో అవకాశం వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువ. స్వాతంత్య్రం ఈ దేశానికి వచ్చినప్పటికీ నుంచి మనకి ఈ రెండు వ్యవస్థల్లో రాణించిన నాయకులు లేకపోలేదు. కానీ, ఎక్కువగా అగ్రవర్ణానికి చెందినవారే అధికంగా ఉన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాదిరి ఎక్కడో ఒకరు ఒకటి అరా మనకి కనిపిస్తారు. అయితే, బీసీలకు చెందిన వారు మాత్రం ఇంకా అరుదు. ఒక తెలుగు బిడ్డకు… అదే తెలంగాణ బిడ్డకు అటువంటి అవకాశం లభించింది అంటే ఆశ్చర్యపోవాల్సిందే. అటు న్యాయవ్యవస్థలో… ఇటు రాజకీయ వ్యవస్థలో ఎటువంటి గాడ్ ఫాదర్లు లేకపోయినా… కింది నుంచి ఎదిగిన నిఖార్సైన బీసీ బిడ్డ శివశంకర్. తన వర్గాలకు ఎంతో కొంత సాయం చేయాలని సంకల్పించి… కొండంత సాయం చేసి… గోరంత కూడా ప్రచారం చేసుకోలేని వ్యక్తాయన. బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం న్యాయ స్థానాలలో పెంపునకు పి. శివశంకర్ నాడు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతం. తన జీవితాంత సామాజిక న్యాయ కోసం, పేదల అభ్యున్నతికి కృషిచేసిన శివశంకర్ జీవితం బడుగు బలహీన వర్గాలకు ఆత్మవిశ్వాసం కలిగిస్తున్నదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆయన శ్రమ, పోరాటం వల్ల బీసీలు న్యాయవ్యవస్థలో కొంతమేర అయినా రాణించగలుగుతున్నారు.
సామాజిక న్యాయం ఎజెండాగా, కోర్టుల్లో బలహీనవర్గాల రిజర్వేషన్లు ఎన్నిసార్లు కొట్టేసినా బీసీల స్వాభిమాన జెండాను సమున్నతంగా ఎత్తిపట్టి, దేశవ్యాప్తంగా ఎందరో దళితులు, బీసీలు అధికారులుగా, న్యాయమూర్తులుగా ఎదిగేందుకు దారి చూపిన వేగుచుక్క పుంజాల శివశంకర్. ఈ క్రమంలో అవమానాలు భరించలేక ఎన్నో సౌకర్యాలు ఉండే న్యాయమూర్తి పదవికి 11 నెలల్లోనే రాజీనామా చేశారంటే ఆయన ఆత్మవిశ్వాసాన్ని, అణచివేతను ఏమాత్రం సహించని తెగింపును మెచ్చుకోవాలి.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పి. శివశంకర్ 1986 లో 12 మే నుంచి 22 అక్టోబర్ వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా శివశంకర్ గారి వద్ద ఉండడంతో విదేశాలలో భారతీయ ఉత్పత్తులకు ఒక సువర్ణావకాశం లభించింది. గల్ఫ్ ఉపాధి, ఉద్యోగాల నియామకాల్లో మోసాలను అరికట్టడానికి గాను న్యాయశాస్త్రంలో తనకు ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎమిగ్రేషన్ చట్టానికి సవరణలు చేయించారు. గల్ఫ్ దేశాలలో ప్రవాసులు తాము పొందిన అనుభవము, సంపాదనతో మాతృభూమికి తిరిగి వచ్చిన తర్వాత వారికి పునరావాసం, స్వయం ఉపాధి కల్పన దిశగా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
శివశంకర్ తన జీవితంలో పేదరికాన్ని, ఉన్నత స్థితిని చవిచూశారు. గంజి, బెంజీ రెండూ ఆయనకు తెలుసు. మాములు స్థాయి నుంచి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగడం ఆయనకే చెల్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు లాంటి పెద్ద వ్యక్తులు, సాయం కోరి వచ్చినా అదే విధంగా నిరుపేదవాళ్లు సాయానికి వచ్చినా అండగా ఉన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెళ్లికి పుంజాల శివశంకరే పెద్దమనిషిగా వ్యవహరించారు. తెలుగు రాష్ట్రాల్లో సామాజికంగా వెనుకబడిన కులాలను సమగ్రంగా అధ్యయనం చేసి, రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగాడో, ఎన్ని నిద్రలేని రాత్రుళ్లు గడిపాడో ఆయనకే తెలుసు! అప్పటికే తను పేరున్న ప్రముఖ న్యాయవాది. ఆర్థికంగా వెనుకుబాటుకు గురై సమాజంలో వెనుకబడిన బీసీల రిజర్వేషన్ల సాధన కోసం అలుపు లేకుండా చిత్తశుద్ధితో పోరాటం చేశాడు.
బూర్గుల నుంచి కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రుల వరకు నోటిదాక వచ్చినట్టే వచ్చిన రిజర్వేషన్లు కోర్టుల్లో కొట్టివెయ్యబడ్డాయి. ఇక బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్ల జోలికి పోదల్చుకోలేదు. అప్పటికే ప్రభుత్వానికి న్యాయ సలహాదారుగా ఉన్న పుంజాల, సర్కారు సుప్రీంకోర్టులో కేసు వెయ్యకపోతే...న్యాయ సలహాదారు పదవికి రాజీనామా చేసి, స్వయంగా తనే కేసు వేసి వాదిస్తానని చెప్పారు. శివశంకర్ పట్టుదల చూసిన ప్రభుత్వం బీసీల తరఫున దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేసు వేస్తే...శివశంకర్ వాదనతో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించింది. బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని సమర్థించింది. ఇప్పుడు విద్య, ఉద్యోగ రంగాల్లో అమలు అవుతున్న రిజర్వేషన్లు ఆయన పుణ్యమే.