కుతుబ్‌షాహీల కాలంలో వేశ్యలకు లైసెన్స్....
తాడి అమ్మకాలతో ఖజానా నింపుకున్న కుతుబ్‌షాహీలు;
ఈ ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణా రాష్ట్రానికి లిక్కర్ ద్వారా 34 వేల 600 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. లిక్కర్ ఆదాయంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయని కొంత మంది వెటకారంగా చెబుతుంటారు. విషయం ఏమిటంటే, ఇప్పుడే కాదు, గతంలోనూ కుతుబ్‌షాహీల కాలంలోనూ తాడి అమ్మకాలతో ఖజానాకు పెద్ద ఎత్తున రాబడి వచ్చేదని గోల్కొండను సందర్శించిన విదేశీ పర్యాటకుడు, వజ్రాల వ్యాపారి టావెర్నర్ తన పుస్తకం ‘ట్రావెల్స్ ఇన్ ఇండియాలో’ రాశాడు.
అప్పట్టి గోల్కోండ నగరంలో 20వేల మంది వేశ్యలుండేవారు. వారు ‘దరోగా’ వద్ద పేర్లను నమోదు చేయించుకొంటే చాలు. వారి వృత్తికి లైసెన్సు లభించినట్టే. పైగా వారిపై ఎటువంటి సుంకాలు విధించేవారు కాదు. ఇదంతా ఎందుకంటే. వారి వల్ల తాడి అదే కల్లు విపరీతంగా అమ్ముడవుతూ దానిపై పన్ను రూపేణా గోల్కొండ ఖజానాకు పెద్ద ఎత్తున రాబడి వచ్చిపడుతుండటమే.
ప్రస్తుతం వైన్ షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. అయితే అప్పట్లో గోల్కొండ రాజ్యంలో సాయంత్రం దీపాలు వెలిగించిన తర్వాతనే కల్లు దుకాణాలు తెరుచుకొనేవి. నగరంలోను, కోటలోను అనేక మంది వేశ్యలు ఉండేవారు. వారి ఇళ్లన్నీ పూరిగుడెసెలే. సాయంత్రం కాగానే దీపం వెలిగించి ఉంచేవారు. ఆ సమయంలోనే తాటి కల్లు దుకాణాలు తెరుచుకొనేవి.
వజ్రాల వ్యాపారి టావెర్నర్ క్రీ.శ 1648లో ఒక సారి, 1657లో మరొకసారి గోల్కొండ రాజ్యాన్ని సందర్శించి ఆనాటి విషయాలను, గోల్కొండ పరిసరాల్లోకి తాడి ఏ విధంగా వచ్చేది టావెర్నర్ వర్ణించాడు. ‘‘తాడి అనేది ఒక మధుర పానియం. కొత్త రకపు ద్రాక్ష రసం వలె మధురంగా ఉంటుంది. దీనిని అయిదారు కోసుల దూరం నుంచి తోలు సంచులతో గుర్రాలపై తీసుకొస్తుంటారు. గుర్రానికి రెండు వైపులా తోలు సంచులను కట్టి వేగంగా వాటిని నగరానికి చేరుస్తారు. ఇలా ప్రతి రోజు నగరానికి అయిదారు వందల గుర్రాలపై తాడి వస్తుంది.
తాడి వినియోగానికి వేశ్యలదే ప్రధాన పాత్ర. వాళ్ళు ఆడి, పాడి తన దగ్గరికి వచ్చిన కస్టమర్లను ఆనందంలో ముంచెత్తుతూ తాడి సేల్ చేసేవారు. తాడి వ్యాపారస్థులు వారి దుకాణాల్ని వేశ్యవాటికల పరిసరాల్లో ఏర్పాటు చేసుకొన్నారు. గోల్కొండలోని స్త్రీ, పురుషులు చక్కటి శరీర సౌష్టవం, మంచి ఆకృతి కలిగి, దానికి తగిన ఎత్తు గలవారు’’ అని టావెర్నర్ వివరించారు. ప్రతి శుక్రవారం కొంత మంది వేశ్యలు కోట బాల్కని వద్దకు తమ నాయకురాలితో వచ్చి వాయిద్యాల నడుమ నాట్యం చేసే వారు. ఆ రోజు కనుక రాజు లేకుంటే వారిని వెళ్లిపొమ్మనేవారు.
మొత్తం మీద నాటి గోల్కొండ పాలకుల సిరి సంపదల వెనుక ఇలా శృంగారం, మత్తు అంశాలు కూడా ఉన్న విషయం టావెర్నర్ రచన వల్ల స్పష్టం అవుతోంది.