డొక్కు ప్రైవేటు బస్సులకు ఉక్కు కవచం అవినీతి
బస్సు చూసి కాదు, వీడియో చూసి లైసెన్సు ఇచ్చే రోజులివి
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు కేరాఫ్ గా మారుతున్నాయి. దేశంలో ఎక్కడో ఓ చోట ప్రమాద బారిన పడుతున్నాయి. ఫిట్ నెస్ లేకుండానే బస్సులు రోడ్డెక్కుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. "వాళ్ళ వ్యాపారాలు వాళ్లు చేసుకుంటున్నారు. ఉద్యోగులేమో 10 టూ 5 ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దీంతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి". మోటారు వాహన చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తే ప్రస్తుతం తిరుగుతున్న ప్రైవేట్ బస్సుల్లో చాలా వరకు రోడెక్కే అవకాశం లేదంటారు ఆర్టీఏ మాజీ అధికారి సీఎల్‌ఎన్ గాంధీ.
ఇతర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ చేయించి, అనుమతులు తెచ్చుకుంటున్నారు. బస్సు పరీక్షించడం, తనిఖీ చేయడం లాంటివి వీడియో, ఫొటోలు చూసి అనుమతి పత్రాలు పంపించే సంస్కృతి నడుస్తోంది. మూడు నెలలకు ఒకసారైనా బస్సును రిజిస్టర్ చేసిన రాష్ట్రానికి తీసుకెళ్లాలని రవాణా చట్టంలో నిబంధన ఉండేది. అయినా హైదరాబాద్‌లోనే ఉంటూ అన్ని అనుమతులు తెప్పించుకుంటారు.
ఏ రాష్ట్రంలో తక్కువ ట్యాక్స్ ఉంటుందో.. ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకుని, ఎక్కువ ట్యాక్స్ ఉండే రాష్ట్రంలో ట్రావెల్స్ ను తిప్పుతున్నారు. బస్సుల ట్యాక్స్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా వుంది. ప్రతి మూడు నెలలకు ఒక సీటుకు చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో ఒక్కో సీటుకు రూ.3,750లు ఉంది. అదే దాద్రా, నగర్ హవేలిలో రిజిస్ట్రేషన్ చేస్తే కేవలం సీటుకు 600 రూపాయలు మాత్రమే. అందుకే చాలా మంది ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు నాగాల్యాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో రిజిస్ట్రేషన్ చెయించుకుంటారు. అలా ట్యాక్స్‌కు ఎగనామం పెడుతున్నారు.
వేమూరి ట్రావెల్స్ యజమాని కూడా దొంగ అడ్రస్ ఇచ్చి బస్సు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తరువాత ఒరిస్సా రాష్ట్రంలోని రాయ్‌పూర్‌కు రిజిస్ట్రేషన్ బదిలీ చేయించుకున్నాడు. అక్కడే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. కానీ బస్సు తిప్పేది హైదరాబాద్ - బెంగుళూర్ మధ్యలో. 42 సీట్ల కోసం అనుమతి తిసుకోని అక్రమంగా బెర్త్‌లు ఏర్పాటు చేసుకున్నాడు.
అయితే తెలంగాణా, ఆంధ్ర, కర్నాటకకు చెందిన అధికారులు, ఈ బస్సును తనిఖీ చేసి వుంటే ఈ ఘోరం జరిగేది కాదని సీఎల్‌ఎన్ గాంధీ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బస్సుపై ఉన్న 14 చెలానాలు కూడా సిసి టీవీ చూసి వేసినవే. అయితే అవి ఏ అడ్రస్‌కు పంపాలి. ఎవరు పే చేయాలనేది అటు పోలీసులకు, ఇటు ఆర్‌టిఏ అధికారులకు తెలియదు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సుకు కేవలం 42 సీట్లకే అనుమతి వుంది. బెర్త్‌కు అనుమతి లేదు. అయినా అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా చౌకైన మెటీరియల్ వాడి అప్పర్, లోయర్ బెర్త్‌లు, క్యాబిన్‌లు ఏర్పాటు చేసుకున్నాడు.
మోటారు వాహనాల చట్టం ప్రకారం ముఖ్యంగా ప్రతి స్లీపర్ బస్సులో తగినన్ని అగ్నిమాపక యంత్రాలు అమర్చాలి. అత్యవసర ద్వారం సరైన స్థానంలో ఏర్పాటు చేయాలి. ప్రమాద సమయంలో ఆటోమేటిక్‌గా తెరుచుకొనే విధంగా ముందు, వెనుక భాగాల్లో రెండు ద్వారాలు ఉండాలి. అలారమ్ బటన్ తప్పనిసరి. బస్సు బాడీ నిర్మాణంలోనూ అగ్ని నిరోధక పదార్ధాలు వాడాలి. అద్దాలు పగలగొట్టడానికి ప్రతి కిటికీ దగ్గర ఒక హ్యామర్ ఉంచాలి. అత్యవసర తలుపులు సులభంగా తెరుచుకోవాలి.
అలాంటి ఏర్పాట్లు ఏవీ వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో లేవు. ఎందుకంటే అది సీటర్ బస్సు కాబట్టి. అవేవీ లేవు కనుకే ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం ఎక్కువ జరిగిందని సి.ఎల్.ఎన్.గాంధీ ది ఫెడరల్ తెలంగాణాతో చెప్పారు. తమ ప్రాణాల బాధ్యత ప్రయాణీకులదే. తామెక్కే బస్సు గురించి అవగాహన పెంచుకొని భద్రత వున్న బస్సు ఎక్కితేనే ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని సి.ఎల్.ఎన్. గాంధీ అభిప్రాయపడ్డారు.