మహా శివరాత్రికి 3 వేల ప్రత్యేక బస్సులు
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.శ్రీశైలానికి 800, వేములవాడకు 714స్పెషల్ సర్వీసులు నడపనుంది.;
By : The Federal
Update: 2025-02-22 16:11 GMT
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 26వతేదీన మహా శివరాత్రి కావడంతో ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది.
శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ సర్వీసు బస్సులను నడపాలని నిర్ణయించినట్లు టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
ప్రధాన శివక్షేత్రాలకు...
ప్రధానంగా శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సులతో పాటు అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి.
ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరల సవరణ
రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు టికెట్ ధరలను సవరించింది. రెగ్యులర్ సర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు.ఈ నెల 24 నుంచి 27 తేదీ వరకు నాలుగు రోజులపాటు నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 26 నుంచి 28 తేదీ వరకు(మూడు రోజులు) సవరణ చార్జీలు వర్తిస్తాయి.
మంత్రి పొన్నం సమీక్ష
మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సుల గురించి ఆర్టీసీ ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లను చేస్తోంది. 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత శివరాత్రి కన్నా ఈ సారి 809 బస్సులను అదనంగా సంస్థ నడపనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు.
మహిళలకు ఉచిత ప్రయాణం
మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి- మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని టీజీఆర్టీసీ స్పష్టం చేశారు. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించామని, టికెట్ల బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు.
- మహా శివరాత్రికి 3 వేల ప్రత్యేక బస్సులు
— PRO, TGSRTC (@PROTGSRTC) February 22, 2025
- శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ సర్వీసులు
- భక్తులకు ఇబ్బందులు కలగకుండా #TGSRTC ఏర్పాట్లు@TGSRTCHQ @Ponnam_INC @TelanganaCMO @revanth_anumula pic.twitter.com/khUbTnSDrA