స్ధానిక ఎన్నికల్లో 14 ఏళ్ళుగా ఓట్లేయని 40 వేలమంది

గడచిన 14 ఏళ్ళుగా ఈమండలంలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగలేదు.;

Update: 2025-09-06 08:15 GMT
Mangapet mandal local body elections

ఓట్లపండుగ వస్తోందంటే ప్రజల్లో చెప్పరాని సంతోషం కనబడుతుంది. కాని ములుగు జిల్లాలోని మంగపేట మండలంలో జనాలకు మాత్రం ఆ భాగ్యం దక్కటంలేదు. విషయం ఏమిటంటే మంగపేట మండలాన్ని ప్రభుత్వం నూరుశాతం షెడ్యూల్ ఏరియాగా(Schedule Mandal) గుర్తించింది. అందుకనే ఈ మండలంలోని పంచాయితీలు, వార్డులు, ఎంపీటీసీల్లో సగం సీట్లను గిరిజనులకే రిజర్వ్ చేసి ఎన్నికలు(Local body elections) నిర్వహించాలని 2011లో ప్రభుత్వ డిసైడ్ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయం రుచించని నాన్ ట్రైబల్ నేతలు కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తు కోర్టులో కేసు వేశారు కోర్టులో కేసు ఉండటంతో అధికారులు ఎన్నికల నుండి ఈమండలాన్ని దూరంగా పెట్టేస్తున్నారు. దాంతో గడచిన 14 ఏళ్ళుగా ఈమండలంలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగలేదు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లేస్తున్న జనాలు స్ధానిక సంస్ధలకు మాత్రం ఓట్లేయలేకపోతున్నారు.

దీనికి కారణం ఏమిటంటే 14 ఏళ్ళ క్రితం మిగిలిన మండలాల్లో ఓటర్ల జాబితాలను సిద్ధంచేసినట్లే పంచాయితీలు, మండల, జిల్లా పరిషత్, మండల అధ్యక్ష పదువులకు అధికారులు ఈ మండలంలో కూడా రిజర్వేషన్లు నిర్ణయించారు. అలాగే లాటరీ పద్దతిలో రిజర్వేషన్లను అమలుచేయటానికి అధికారులు అన్నీఏర్పాట్లు చేసుకున్నారు. అధికారులు అప్పట్లో కేటాయించిన రిజర్వేషన్లు ఏమిటంటే సర్పంచ్ పదవులు, మండల పరిషత్ అధ్యక్షుల పదవులను నూరుశాతం గిరిజనులకు రిజర్వ్ చేశారు. మండలంలో సుమారు 40 వేలమంది జనాభా ఉన్నారు. 25 గ్రామపంచాయితీలు, 14 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ ఉంది. 25 గ్రామపంచాయితీల్లో 230 వార్డులున్నాయి.

జనాభా లెక్కలప్రకారం అప్పట్లో 25 సర్పంచ్ పదవులు, మండల పరిషత్ అధ్యక్షుల పదవులను నూరుశాతం గిరిజనులకు రిజర్వుచేశారు. అలాగే 14 ఎంపీటీసీల్లో సగం అంటే ఏడింటిని గిరిజనులకు, మిగిలిన స్ధానాలను ఇతర సామాజికవర్గాలకు కేటాయించారు. అలాగే 230 వార్డుల్లో సగంవార్డులను గిరిజనులకు కేటాయించగా మిగిలిన వార్డులను ఇతర సమాజికవర్గాలకు కేటాయించారు. ఉన్న ఒక్క జడ్పీటీసీ స్ధానాన్ని జనాభా లెక్కల ప్రకారం కేటాయించాలని అప్పట్లో నిర్ణయించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ మండలంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్నకారణంగా హోలుమొత్తం మండలాన్ని గిరిజన(షెడ్యూల్) మండలంగానే ప్రభుత్వం గుర్తించింది.

అయితే సర్పంచ్ పదవులు, మండల పరిషత్ అధ్యక్ష పదవులను అధికారులు నూరుశాతం గిరిజనులకు కేటాయించటాన్ని వివిధ పార్టీల్లోని గిరిజనేతర నేతలు జీర్ణించుకోలేకపోయారు. అందుకనే ప్రభుత్వనిర్ణయాన్ని సవాలుచేస్తు హైకోర్టులో 2011లో కేసు దాఖలు చేశారు. గిరిజనేతర నేతలు దాఖలుచేసిన కేసును సంవత్సరాలపాటు విచారించిన హైకోర్టు చివరకు అంటే 2023లో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు వచ్చిన తీర్పును చాలెంజ్ చేస్తు కొందరు సుప్రింకోర్టులో రివిజన్ పిటీషన్ దాఖలు చేశారు. 2023లో దాఖలైన కేసు ప్రస్తుతం సుప్రింకోర్టు విచారణలో ఉంది.

ఇపుడు సమస్య ఏమిటంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ కేసు కోర్టుల్లో నలుగుతుందో తెలీదు. తాము ఎప్పటికి స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఓట్లేస్తాము, పాల్గొంటాము అన్న గిరిజన నేతల, మామూలు ఓటర్ల ప్రశ్నలకు సమాధానాలు ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈనెల 30వ తేదీలోగా స్ధానికసంస్ధల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు అందరికీ తెలిసిందే. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం వివాదాస్పదమైన నేపధ్యంలో ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తుందా లేకపోతే మరింత గడువుకోరుతు హైకోర్టును రిక్వెస్టు చేస్తుందా అన్నది క్లారిటిలేదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా తీసుకున్న నిర్ణయాలు ఏవీ వర్కవుట్ కాలేదు. అందుకనే 42శాతం రిజర్వేషన్లను అమలుచేస్తు నేరుగా ఎన్నికలకు వెళ్ళాలా ? లేకపోతే హైకోర్టులో రివిజన్ పిటీషన్ దాఖలుచేసి ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరాలా అన్న విషయాన్ని తేల్చుకోలేకపోతున్నది.

హైకోర్టులో కేసు, ప్రభుత్వ ఆలోచనను పక్కనపెట్టేస్తే సెప్టెంబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహణకు ఉన్నతాధికారులు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే మిగిలిన మండలాలు, పంచాయితీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లుచేస్తున్నట్లే మంగపేటమండలంలోకూడా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అన్నీపార్టీల ప్రజాప్రతినిధుల సమక్షంలో అధికారులు రిజర్వేషన్లను ఫైనల్ చేసేందుకు రంగం సిద్ధంచేశారు. అధికారుల కసరత్తు ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే సుప్రింకోర్టు తీర్పు వెల్లడించినపుడే. సుప్రింకోర్టు తీర్పు ఎప్పుడువస్తుందో తెలీదు, రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎప్సుడు నోటిఫికేషన్ విడుదలచేస్తుందో తెలీదు. రాష్ట్రఎన్నికలకమీషన్ నోటిఫికేషన్ జారీచేసేలోపు సుప్రింకోర్టు తీర్పిస్తేనే అధికారులు ఎన్నికలను నిర్వహించగలరు. సుప్రింకోర్టు తీర్పు ఇవ్వకపోతే అధికారులు చేయగలిగేది ఏమీ ఉండదు. ఈ మండలంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు మరికొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే.

కోర్టు వివాదం తేలాలి : సీఈవో

మంగపేట మండలంలో ఎన్నికల నిర్వహణ సుప్రింకోర్టు తీర్పుమీద ఆధారపడుంటుందని జిల్లా పరిషత్ సీఈవో సంపత్ రావు తెలంగాణ ఫెడరల్ తో చెప్పారు. సంపత్ ఏమంటారంటే ‘‘మండలాన్ని షెడ్యూల్ మండలంగా ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు గతంలో సమర్ధించింద’’ని అన్నారు. ‘‘హైకోర్టు తీర్పును కొందరు సుప్రింకోర్టులో చాలెంజ్ చేయటంతో ఎన్నికలు ఈ మండలంలో పెండింగులో ఉన్న’’ట్లు సీఈవో తెలిపారు. ‘‘తాము ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న’’ట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

తీర్పు మీదే దృష్టి : దేవరాజు

మంగపేటలో స్ధానిక ఎన్నికలు జరగకపోవటంపై జిల్లా పంచాయితి అధికారి ఒంటేరు దేవరాజు ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడారు. దేవరాజు ఏమన్నారంటే మొత్తం మండలాన్ని ప్రభుత్వం గతంలోనే షెడ్యూల్ మండలంగా గుర్తించినట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే షెడ్యూల్ మండలంగా పరిగణించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సుప్రింకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే జనాభా లెక్కల ప్రకారం జడ్పీటీసీ స్ధానంలో పోటీచేయాల్సింది గిరిజనులా లేకపోతే ఇతర సామాజికవర్గాలా అన్న విషయం నిర్ణయవ అవుతుందని చెప్పారు.

Tags:    

Similar News