తెలంగాణలో ‘జీవన్‌దాన్’తో 6048 మందికి పునర్జన్మ
తెలంగాణలో ‘జీవన్‌దాన్’ కార్యక్రమం విజయవంతం అయింది.ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కొత్త యాక్ట్‌ను అసెంబ్లీ ఆమోదించింది. దీంతో అవయవదానానికి మార్గం సుగమమైంది.;
By : Saleem Shaik
Update: 2025-03-28 02:32 GMT
అవయవ దానం మహాదానం. అవయవ దానం చేస్తే ఒకరు 8 మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చు అని తెలంగాణ ప్రభుత్వ జీవన్ దాన్ చెబుతోంది.ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యాక్ట్‌ను అసెంబ్లీలో తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టగా అసెంబ్లీ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నేపథ్యంలో జీవన్ దాన్ కార్యక్రమం సాగుతున్న తీరు,తెన్నులు, అవయవదాతల రిజిస్ట్రేషన్లు, అవయవదాతల గురించి ‘ఫెడరల్ తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం...
గుండె మార్పిడి చికిత్స విజయవంతం
- మార్చి నెల 4వతేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడైన యువకుడికి మూడు రోజులపాటు నిమ్స్ అత్యవసర విభాగంలో చికిత్స అందించినా , ఫలితం లేకుండా పోయింది. ఆ యువకుడు బ్రెయిన్ డెడ్ అని వైద్యులు ప్రకటించారు.
- కాటేదాన్ ప్రాంతానికి చెందిన అనిల్ కుమార్ డైలేటెడ్ కార్డియోమయోపతి గుండె సమస్యతో బాధపడుతున్నాడు. గుండె కోసం ఈయన జీవన్ దాన్ లో జనవరి నెలలో పేరు నమోదు చేయించుకున్నాడు.
- బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి రక్తనమూనాలు సరిపోవడంతో అనిల్ కుమార్ కు మార్చి నెల 7వతేదీన నిమ్స్ కార్డియోథొరాసిక్ విభాగాధిపతి ప్రొఫెసర్ అమరేశ్వరరావు, డాక్టర్ గోపాల్, కళాధర్ వైద్యుల బృందం గుండెమార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు. గుండె మార్పిడి చికిత్సను విజయవంతం చేసిన వైద్యులు 20 రోజుల పరిశీలన అనంతరం గురువారం అతన్ని నిమ్స్ నుంచి డిశ్చార్జ్ చేశారు.జీవన్ దాన్ కింద గుండె లభించడంతో ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా అనిల్ కుమార్ కు నిమ్స్ వైద్యులు ఉచితంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సను చేశారు.
గుండెను తరలించేందుకు గుంటూరు టూ తిరుపతి గ్రీన్ ఛానల్
బ్రెయిన్ డెడ్ మహిళ నుంచి గుండెను తిరుపతిలోని రోగికి మార్పిడి చేసేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో గుంటూరు టూ తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా గురువారం తరలించారు.
- గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చెరుకూరి సుష్మ అనే మహిళ బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆమె అవయవాలను దానం చేసేందుకు ఆమె కుటుంబసభ్యులు అంగీకరించడంతో గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించారు. గుండెను గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి ఆసుపత్రికి తరలించారు. గుంటూరులో మరణించిన మహిళ గుండెను తిరుపతిలోని రోగికి గ్రీన్ ఛానల్ ద్వారా తరలించి అమర్చారు.తమ అమ్మ అవయవాలను దానం చేయడం ద్వారా వారిలో తమ అమ్మను చూసుకోవాలని మృతురాలు సుష్మ కుమార్తెలు తేజస్విని, వైశులు వ్యాఖ్యానించడం విశేషం.
జీవన్‌దాన్ ఆర్గాన్ కోసం 3,835 మంది రోగుల నిరీక్షణ
తెలంగాణ రాష్ట్రంలో జీవన్‌దాన్ ఆర్గాన్ కోసం 3,835 మంది రోగులు నిరీక్షిస్తున్నారు. ఏ, బి, ఏబీ, ఓ గ్రూపు రక్తం ఉన్న రోగులు ఆయా రక్తం ఉన్న బ్రెయిన్ డెడ్ వ్యక్తుల నుంచి అవయవ దానం కోసం వేచి చూస్తున్నారు. కిడ్నీ కోసం అత్యధికంగా 2,715 మంది రోగులు జీవన్ దాన్ లో అవయవాల దాతల కోసం ఎదురుచూస్తున్నారు. లివర్ కోసం 926 మంది రోగులు, గుండె కోసం 100 మంది, ఊపిరితిత్తుల కోసం 79 మంది, పాంక్రియాస్ కోసం 15 మంది రోగులు జీవన్ దాన్ లో పేర్లను నమోదు చేయించుకొని దాతల కోసం ఎదురుచూస్తన్నారు. రోగులకు చెందిన గ్రూపు రక్తం ఉన్న బ్రెయిన్ డెడ్ అవయవదాతలు దొరికితే వారికి అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తామని జీవన్ దాన్ విభాగం డాక్టర్ భూషణ్ రాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
పెరుగుతున్న అవయవదానం
రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను వారి కుటుంబసభ్యులు డొనేట్ చేస్తున్నారు. ప్రజల్లో అవయవదానంపై అవగాహన పెరగడంతో ఎక్కువ మంది అవయవ దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు.2013వ సంవత్సరంలో కేవలం 41 మంది అవయవదానం చేయగా, 2024 నాటికి దాతల సంఖ్య 188కి పెరిగింది. గడచిన పన్నెండేళ్లలో 1606 మంది బ్రెయిన్ డెడ్ అయిన వారు వారి అవయవాలను దానం చేశారు.2412 కిడ్నీలు,1473 లివర్ లు, 221 గుండెలు, 1395 కార్నియాలు, 170 హార్ట్ వాల్వులు,363 లంగ్స్, 14 పాంక్రియాస్ లను రోగులకు మార్పిడి చేశారు. మొత్తం మీద జీవన్ దాన్ కార్యక్రమం కింద 6048 మందికి వివిధ అవయవాలను మార్పిడి చేసిన వైద్యులు, వారికి పునర్జన్మ ప్రసాదించారు.
అవయవదానానికి పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు
జీవన్ దాన్ కార్యక్రమం కింద అవమవ దానం చేసేందుకు ఎక్కువ మంది ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే జీవన్ దాన్ కార్యక్రమం కింద 2,50,000 మంది అవయవదానం చేస్తామని రాతపూర్వకంగా లేఖులు అందించారు. మరో 25,933 మంది ఆన్ లైన్ లో తాము అవయవదానం చేసేందుకు అంగీకరిస్తున్నట్లు పేర్లను రిజిస్ట్రేషన్ చేయించారు.
జీవన్ దాన్ రిజిస్ట్రేషన్ల కోసం వెబ్ సైట్
అవయవాలు కావాల్సిన రోగులు జీవన్ దాన్ రిజిస్ట్రేషన్ల కోసం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో దాతల గ్యాలరీ, జీవన్ దాన్ ఈవెంట్లు, హ్యుమన్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ యాక్ట్ లను వెబ్ సైట్ లో ఉంచారు.
నిమ్స్ కేంద్రంగా జీవన్ దాన్ నోడల్ సెంటర్
హైదరాబాద్ నగరంలోని నిమ్స్ కేంద్రంగా జీవన్ దాన్ నోడల్ సెంటర్ ఏర్పాటు చేశారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ ఛైర్మన్ గా వైద్య విద్యా డైరెక్టర్ డాక్టర్ ఎ నరేంద్రకుమార్ యాక్టింగ్ ఛైర్మన్ గా, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప నగరి కో ఛైర్మన్ గా కమిటీని నియమించారు.
కొత్త ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యాక్ట్
ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యాక్ట్ లో భాగంగా సవరణలు చేస్తూ కొత్త చట్టాన్ని (Transplantation of Human Organs & Tissues Act, 2011 (Amendment).THOTA) తెలంగాణ సర్కారు అందుబాటులోకి తీసుకువచ్చింది. అసెంబ్లీలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.అవయవదానానికి సంబంధించి 1994లో కేంద్ర ప్రభుత్వం తోవ చట్టం చేసింది. 1994లో చేసిన THOA చట్టానికి, 2011లో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. దీన్నే తోట THOTA చట్టంగా పిలుస్తున్నారు.అవయవాల మార్పిడితో పాటు, కణజాలల మార్పిడిని(TISSUES) కూడా తోట యాక్ట్ అనుమతించింది.
ఈ చట్టం ఏం చెబుతుందంటే...
తోట యాక్ట్‌కు సంబంధించిన నిబంధనలను 2014లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.దేశంలోని 24 రాష్ట్రాల్లో తోట చట్టం, ఆ చట్ట ప్రకారం 2014లో చేసిన నిబంధనలే అమలులో ఉన్నాయి.ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తోవ–1991 (తోట–2011) చట్టాన్ని, నిబంధనలను అడాప్ట్ చేసుకుంది. గుండె, కిడ్నీ, కాలేయం వంటి అవయవాలతో పాటు చర్మం, ఎముక మజ్జ (bone marrow), రక్త నాళాలు(Blood Volves), గుండె వాల్వుల Heart volves మార్పిడి వంటివి కూడా చట్ట పరిధిలోకి వస్తాయి.బ్రెయిన్ డెత్ డోనర్ల నుంచి వీటిని సేకరించి, అవసరమైన వారికి మార్పిడి చేయడానికి వీలుపడుతుంది.అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు వారి మనవళ్లు, మనవరాళ్లకు అవయవ దానం చేయడానికి చట్టం అనుమతి ఇస్తుంది.
జన్యుపరమైన సమస్యలపై...
కొన్ని రకాల జన్యుపరమైన సమస్యల(Genetical disorders) వల్ల పిల్లలకు కాలెయ(liver) మార్పిడి చేయాల్సి వస్తుంది. ఇలాంటి పిల్లలకు, వారి గ్రాండ్ పేరెంట్స్ కాలేయ దానం చేయడానికి అవకాశం కలుగుతుంది. పిల్లల ప్రాణాలు కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది. మనవళ్లు, మనవరాళ్లు కూడా వారి Grand parents కు అవయవ దానం చేయొచ్చు.
నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.కోటి జరిమానా
అవయవాల అక్రమ రవాణా, అక్రమ మార్పిడిలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించేలా కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.చట్టాన్ని ఉల్లంఘించి అవయవ మార్పిడి చేస్తే గతంలో 5 వేల రూపాయల జరిమానా, 3 సంవత్సరాల వరకూ జైలు శిక్ష విధించేందుకే అవకాశం ఉండేది.కొత్త నిబంధనల ప్రకారం ఒక కోటి రూపాయల(1cr penalty) వరకూ జరిమానా మరియు 10 సంవత్సరాల జైలు (10 years jail) శిక్ష విధించవచ్చు.
బ్రెయిన్ డెత్ ఇతర డాక్టర్లు కూడా డిక్లేర్ చేయొచ్చు...
1995 నాటి నిబంధనల ప్రకారం బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసే అధికారం న్యూరో సర్జన్లు, న్యూరో ఫిజీషియన్లకు మాత్రమే ఉంది.కొత్త నిబంధనల ప్రకారం Physician, Surgeon, intensivist, Anaesthetist కూడా బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయడానికి అర్హులు అవుతారు.దీనివల్ల బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవాలు వృథాగా పోకుండా, అవసరమైన పేషెంట్ల ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతాయి.
అవయవదానానికి సలహా కమిటీ : మంత్రి దామోదర్ రాజనర్సింహ
అవయవ దానం, మార్పిడిపై పర్యవేక్షణ కోసం ప్రభుత్వ స్థాయిలో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు అవుతుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు. కేంద్రం, ఇతర రాష్ట్రాల్లోని అవయవ మార్పిడి వ్యవస్థలతో(SOTTO) జీవన్‌దాన్‌ను అనుసంధానం చేస్తామన్నారు.ఇతర రాష్ట్రాల్లో బ్రెయిన్ డెత్ డోనర్ల నుంచి సేకరించిన అవయవాలను, మన రాష్ట్రంలోని పేషెంట్లకు అమర్చడానికి అవకాశం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు మెడికల్ టూరిజం బలోపేతానికి దోహదపడుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఆర్గాన్ డోనర్ల కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన పాలసీని రూపొందిస్తామని మంత్రి వివరించారు.