మావోయిస్టులకు భారీ దెబ్బ
మావోయిస్టుల(Maoists)కోసం గాలిస్తున్న భద్రతాదళాలకు పెద్ద ఆయుధాగారం కంటపడింది
మావోయిస్టులకు ఊహించని రీతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు వరుస ఎన్ కౌంటర్లతో తేరుకోలేకపోతున్న మావోయిస్టుపార్టీని భద్రతాదళాలు తాజాగా మరో దెబ్బతీశాయి. అదేమిటంటే మావోయిస్టుల ఆధ్వర్యంలో నడుస్తున్న ‘ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ’ని(Ordinance Factory) భద్రతాదళాలు ధ్వంసంచేశాయి. ఛత్తీస్ ఘడ్(Chhattisgarh) రాష్ట్రంలో సుక్మాజిల్లా మెట్టగూడ అటవీప్రాంతంలో భద్రతాదళాలు పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహించాయి. మావోయిస్టుల(Maoists)కోసం గాలిస్తున్న భద్రతాదళాలకు పెద్ద ఆయుధాగారం కంటపడింది. మొదట్లో నమ్మలేకపోయిన భద్రతాదళాలు తర్వాత షాక్ తిన్నాయి.
దట్టమైన అటవీప్రాంతంలో లోపల ఎక్కడో గుట్టుగా మావోయిస్టులు భారీఎత్తున ఆయుధాలను తయారుచేసుకుంటున్నారు. భద్రతాదళాలు ఉపయోగిస్తున్న అత్యంత అధునాతన ఆయుధాలు కాకపోయినా మావోయిస్టులు కూడా ఏకే 47 లాంటి అధునాతన తుపాకులతో పాటు పేలుడు పదార్ధాలను ఉపయోగిస్తున్నారు. భద్రతాదళాలకు అంటే వేలకోట్లరూపాయల వ్యయంతో ప్రభుత్వం కొనుగోలుచేసి తుపాకులను అందిస్తోంది. మరి మావోయిస్టులకు కూడా దాదాపు అంతటి అధునాతన ఆయుధాలు ఎక్కడినుండి వస్తున్నట్లు ? ఎక్కడినుండి అంటే కొన్ని ఆయుధాలను మావోయిస్టులు సంఘవిద్రోహుల నుండి కొనుగోలు చేస్తున్నారు. తర్వాత ఆయుధాల తయారీలో నిపుణుల ద్వారా పరిజ్ఞానాన్ని సంపాదించి, శిక్షణ తీసుకుంటున్నారు.
నిపుణుల పర్యవేక్షణలో శిక్షణపొందిన మావోయిస్టులే దట్టమైనఅడవుల్లో ఫ్యాక్టరీలను ఏర్పాటుచేసుకుని సొంతంగా ఎన్ని కావాలంటే అన్ని తయారుచేసుకుంటున్నారు. అందుకనే మావోయిస్టులకు కావాల్సినన్ని ఆయుధాలు చేతికి అందుతున్నాయి. అలాంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీనే ఇపుడు సుక్మాజిల్లా పోలీసులు, కోబ్రా 203 వింగ్ సంయక్తంగా భద్రతాదళాల ఆధ్వర్యంలో నిర్వహించిన కూంబింగులో కనిపెట్టాయి. ఈఫ్యాక్టరీలో పెద్దఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, భారీ లాంచర్లు, పరికరాలు, మిల్లింగ్ యంత్రాలు, బీజీఎల్ లాంచర్లు, షెల్స్, ఐఈడీ పైపులను మావోయిస్టులు తయారుచేసుకుంటున్నారు. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ నాయకత్వంలో భద్రతాదళాలు భారీ ఆపరేషన్ చేసి ఆయుధాలన్నింటినీ స్వాధీనం చేసుకుని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ధ్వంసంచేశాయి.