గొర్రెల పంపిణీ స్కాం లో 'పెద్దల' హస్తంపై ఏసీబీ ఫోకస్

గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్లు అవినీతి జరిగిందని గుర్తించిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు, ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు.

Update: 2024-06-06 12:07 GMT

గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్లు అవినీతి జరిగిందని గుర్తించిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు, ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒక ప్రభుత్వ పథకంలో ఇంత భారీ స్కాం చేయడంలో పెద్దల పాత్ర ఉండొచ్చనే అనుమానాలున్న నేపథ్యంలో ఆ దిశగా నిజాలు రాబట్టేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎసిబి తదుపరి దర్యాప్తునకు ప్రాధాన్యం సంతరించుకుంది.

గొర్రెల పంపిణీ పథకంలో అనఫీషియల్ కాంట్రాక్టర్ గా వ్యవహరించిన లొలొన కంపెనీ నిర్వాహకుడు మొహిదుద్దీన్.. కేసు నమోదైన వెంటనే దుబాయ్ పారిపోయాడు. అతనిని తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు ఏసీబీ లుక్ అవుట్ నోటీస్ జారీ చేయించింది. మొహిదుద్దీన్ ని విచారిస్తే పెద్దల పాత్రపై కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. కొట్టేసిన సొమ్మును ఎవరెవరు పంచుకున్నారో తేల్చేందుకు, అరెస్టైన నిందితుల, మొహిదుద్దీన్ బ్యాంకు లావాదేవీలపై దృష్టి సారించింది.

గొర్రెల పంపిణీ స్కాం కేసులో కామారెడ్డి రీజనల్ వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డా.రవి, మేడ్చల్ జిల్లా పశువైద్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డా. ఎం.ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జలశాఖ అధికారి పసుల రఘుపతిరెడ్డి, వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేశ్, పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య లను గతంలోనే అరెస్ట్ చేశారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి అసోసియేషన్ కి ఎండీగా పనిచేసిన రాంచందర్నాయక్ తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కి ఓఎస్జీగా పనిచేసిన కల్యాణ్ ని కొద్దిరోజుల క్రితం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అప్పటి ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖను పర్యవేక్షించిన పెద్దల ఆశీస్సులతో ఉన్నతాధికారులను మొహిదుద్దీన్ గుప్పిట పెట్టుకున్నట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ శాఖలో తమకు అవసరమైన పోస్టుల్లో అనుకూలమైన అధికారులను నియమించుకుని కుట్రలకు తెర లేపినట్లు గుర్తించారు. గొర్రెల కొనుగోలు మొదలు, డబ్బుల్ని సరఫరాదారుల ఖాతాల్లో కాకుండా మొహిదుద్దీన్ బినామీల ఖాతాల్లో పడేలా రికార్డుల్ని తారుమారు చేయడంలో ఈ అధికారులు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఒక్కో యూనిట్లో మొహిదుద్దీన్ ముఠా సుమారు రూ.33 వేల వరకు కొట్టేసినట్లు వెల్లడైంది. చాలా యూనిట్లను సరఫరా చేయకుండానే మొత్తం నిధుల్ని స్వాహా చేసినట్లు తేలింది. ఈ క్రమంలో పలువురికి రూ.కోట్లలో వాటాలు ముట్టాయి. ప్రభుత్వ నిధులను తొలుత మొహిదుద్దీన్ బినామీల ఖాతాలకు మళ్లించినట్లు వెల్లడి కావడంతో ఏసీబీ అధికారులు... బినామీల ఖాతాలపై ద్రుష్టి సారించి మరింత సమాచారాన్ని సేకరించారు.

Tags:    

Similar News