ఈ అధికారి అవినీతి అక్షరాల 4 వందల కోట్లే! ఎక్కడ చూసినా క్యాషే, పొలమే!

సినిమాను తలపించే రీతిలో ఏది పట్టుకున్నా డబ్బే డబ్బు. ఏ కాగితం దొరికినా చరాస్థో స్థిరాస్థో.. ఏసూటు కేసు తెరిచినా ఐదొందల నోటేనట..

Update: 2024-01-25 11:05 GMT
సోదాలు చేస్తున్న అధికారులు, విస్తుపోతున్న దృశ్యాలు

తీగ లాగే కొద్ది HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాస్తులు బయటపడుతున్నాయి. అనధికార అంచనా ప్రకారం శివ బాలకృష్ణ ఆస్తుల విలువ మూడు, నాలుగు వందల కోట్ల రూపాయల మధ్య ఉంటుందంటున్నారు. కళ్లు చెదిరే బంగారం, డబ్బు, కాస్టీ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు... ఇలా మొత్తం మూడు, నాలుగు వంద కోట్ల రూపాయలకు పైగా విలువైన అక్రమ ఆస్తులున్నాయి. బంగారం, నగదు, ఫ్లాట్స్‌, బ్యాంక్‌ డిపాజిట్స్‌, బినామీలను వెలికితీసింది ఏసీబీ.

ఎటుచూసినా డబ్బే...

హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలోని బాలకృష్ణ ఇంట్లో 84 లక్షల రూపాయల నగదును ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున నగలు, నగదు, ఆస్తి పత్రాలను అధికారులు సీజ్‌ చేశారు. HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో దొరికిన ఆస్తుల్ని చూసి ACB అధికారుల దిమ్మతిరిగిందట. ఆయన ఇంట్లో నిన్న ఉదయం నుంచి ఇవేళ తెల్లవారుజాము వరకు ఏసీబీ సోదాల్లో సుమారు 3 వందల నుంచి 4 వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని గుర్తించారు. హైదరాబాద్‌లో విల్లాలు, ఫ్లాట్లు, నగర శివార్లలో ఎకరాల కొద్ది భూమి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దాదాపు వంద ఎకరాల ల్యాండ్‌ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 20 చోట్ల సోదాలు నిర్వహించారు. గుర్తించిన స్థిర, చర ఆస్తులు చూస్తుంటే ఇంత చిన్న ఉద్యోగంతో రాష్ట్రమంతటా భూములు ఎలా కొన్నాడబ్బా అనిపిస్తుంది.

రాష్ట్ర నలుమూలలా ఆస్తులే...

కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాలకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ బినామీల పేర్ల ఉన్నాయి. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు సుమారు 84 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు కిలోల బంగారం, ఐదున్నర కిలోల వెండి, 32 లక్షలు విలువచేసే 60 ఖరీదైన చేతి గడియారాలు, 3 విల్లాలు, 3 ఫ్లాట్స్‌, 90 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. 14 మొబైల్‌ ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణ నివాసంలో క్యాష్‌ కౌంటింగ్‌ యంత్రాలు ఉండడం పట్ల ఏసీబీ అధికారులే విస్తుపోయినట్టు సమాచారం. నాలుగు బ్యాంకు లాకర్లు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధి పలు జోన్లలో నిబంధనల్ని ఆసరాగా చేసుకొని వందల అనుమతులు మంజూరు చేసేందుకు భారీగా వసూలు చేసినట్లు గుర్తించారు. ఒక్కో అంతస్తుకు అనుమతుల కోసం భారీగా లంచాలు వసూలు చేశారు. లేఅవుట్లలో ఒక్కో ఎకరాకు అనుమతి ఇవ్వడానికి రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. నెలకు సగటున 70-80 దస్త్రాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఆస్తులు పోగేశారనే ఆరోపణలు ఉన్నాయి.

2018 నుంచి 2023 వరకు HMDAలో డైరెక్టర్‌గా పనిచేశారు శివబాలకృష్ణ. HMDA డైరెక్టర్‌గా , ప్లానింగ్‌ విభాగంలో కీలక స్థానంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్లు అనుమానిస్తున్నారు. పలు ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లో శివబాలకృష్ణ బారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ దర్యాప్తుల్లో వెల్లడైంది. అయితే.. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు అనుమతులు ఇచ్చి.. ఆ లంచాలను పెట్టుబడుల్లోకి ఆయన మార్చుకున్నట్లు తేలింది. ఇందుకోసం హైదరాబాద్‌ శివారుల్లో వందల కొద్దీ ఆయన అనుమతులు ఇచ్చినట్లు తేలింది. హెచ్‌ఎండీఏ, రెరాలో పని చేస్తూనే ఆయన ఈ అనుమతులు జారీ చేసినట్లు గుర్తించారు.

Tags:    

Similar News