కాంగ్రెస్ లో మళ్ళీ ‘త్యాగరాజు’ కానున్న కీలక నేత!!

తెలంగాణ కాంగ్రెస్ లో ఓ కీలక నేతకి అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతున్నాయి. రెండుసార్లు ఎమ్మెల్యే పదవి తృటిలో తప్పిపోయింది.

Update: 2024-03-20 11:03 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో ఓ కీలక నేతకి అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతున్నాయి. రెండుసార్లు ఎమ్మెల్యే పదవి తృటిలో తప్పిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పక్కా అనుకున్నప్పటికీ దక్కలేదు. పార్టీ కోసం కష్టపడుతున్నా కనీసం నామినేటెడ్ పోస్టులకి కూడా నోచుకోలేదు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా టికెట్ వచ్చే ఛాన్స్ లేదంటున్నారు. దీంతో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ నేత పరిస్థితి దయనీయంగా ఉందనే చెప్పాలి. ఇంతకీ ఆ కీలక నేత ఎవరంటే పదవుల్లేకపోయినా కాంగ్రెస్ కి విధేయుడిగా ఉన్న అద్దంకి దయాకర్.

అద్దంకి దయాకర్ రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైంది. 2014 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొదటిసారి 1,847 ఓట్లతో, రెండవసారి 2,379 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. మూడవసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే అసలు టిక్కెట్టే దక్కలేదు.

కోమటిరెడ్డి బ్రదర్స్ తో వైరమే కారణమా..

2022 లో కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీనికి నిరసనగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గంలోని చుండూరులో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభకి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి హాజరు కాలేదు. దీంతో ఆ సభలో ప్రసంగించిన అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో ఉంటే ఉండు వెళ్తే వెళ్ళు అని దూషించారు.

ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. అద్దంకి బేషరతుగా కోమటిరెడ్డి వెంకట రెడ్డికి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ అద్దంకికి టికెట్ రాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుకున్నారని, ప్రస్తుత తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ని బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇప్పించడంలో చక్రం తిప్పారని వార్తలు వినిపించాయి.

తన వర్గం వాడైనా టికెట్ ఇప్పించలేకపోయానని ఆయన కూడా బాధ పడుతుంటారు. టికెట్ ఇప్పించలేనందుకు అద్దంకి దయాకర్ కి క్షమాపణలు చెప్పినట్టు స్వయంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీగా గెలిపించుకుంటామని రేవంత్ బహిరంగంగానే ప్రకటించారు.

ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులకీ లభించని వరం..

ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఆఖరి వరకూ అద్దంకి దయాకర్ పేరు వినబడింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో నామినేషన్ పత్రాలు రెడీ చేసుకోవాలని పార్టీ పెద్దలు ఫోన్ చేశారని, అనుచరులు సంబరాలు కూడా జరుపుకున్నారు. చివరి నిమిషంలో జాబితాలో అద్దంకి దయాకర్ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి వెళ్లిన లిస్ట్ లో పేరు లేని మహేష్ గౌడ్ కి పదవి దక్కడం గమనార్హం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. రాజ్యసభకు 

రాజ్యసభ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ కి అవకాశం దక్కుతుందేమో అనుకున్నారు కానీ, రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ల పేర్లు ఫైనల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్డ్ స్థానమైన వరంగల్ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని అద్దంకి దయాకర్ అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి వరంగల్ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లోకి రావడంతో ఆయనకే టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో అద్దంకి మళ్ళీ త్యాగరాజుగా మిగిలిపోతారేమో అని అనుచరులు ఆదోళన చెందుతున్నారు. 

Tags:    

Similar News