ఎతైన అనంతగిరి కొండలు,రాళ్లు గుట్టలతో కూడిన మంచిరేవుల, చిలుకూరు అడవులు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు,జలకళతో ఉట్టిపడుతున్న సరస్సులతో కూడిన గజ్వేలు అడవులను (Telangana forests) చూసేందుకు హైదరాబాద్ నగర జనం బారులు తీరుతున్నారు. నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో కాంక్రీట్ జంగిల్ లో నివాసముంటున్న నగర ప్రజలు ఈ వేసవి కాలం ఆరంభంతో సెలవు రోజుల్లో ప్రకృతిని తిలకించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
దక్కన్ వుడ్స్ అండ్ ట్రయిల్స్ వీకెండ్ టూర్లు తెలంగాణలో ఎకో టూరిజాన్ని (Ecotourism trips) ప్రోత్సహించేందుకు, ప్రజల్లో అడవులు,జంతువులు,పక్షుల పట్ల అవగాహన కల్పించేందుకు వీలుగా స్థిరమైన పర్యాటక పర్యావరణ అభివృద్ధికి అడుగులు వేసే దిశగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ‘దక్కన్ వుడ్స్ అండ్ ట్రయిల్స్’ (Deccan Woods & Trails ) పేరుతో ప్రతీ శని, ఆదివారాల్లో పలు కార్యక్రమాలు రూపొందించినట్లు ఆ సంస్థ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆసక్తీ గల పర్యాటకులు 9493549399, 93463 64583 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.
పరవశిస్తున్న ప్రకృతి పర్యాటకులు
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలు...పచ్చని చెట్లు, జలాశయం, గజ్వేలు పచ్చని చెట్లు, రాళ్లు, రప్పలు, గుట్టల మధ్య, మంచిరేవుల ట్రెక్ పార్కులో చెట్లు, గుట్టల మధ్య పర్యాటకులు ప్రకృతి సోయగాల మధ్య సేదతీరుతూ విహరిస్తున్నారు. అడవుల్లో కొండలు, గుట్టలు, లోయలు, సరస్సుల మధ్య నేచర్ వాక్, ట్రెక్కింగ్, బర్డ్ వాక్, ఓవర్ నైట్ క్యాంప్, రాక్ బే నేచర్ క్యాంపుల్లో పర్యాటకులు పాల్గొంటున్నారు.పర్యాటకులు సాహస యాత్రలు, ప్రకృతి పర్యావరణ యాత్రల్లో సందర్శకులు చిన్న కొండలు, లోయలు, పచ్చని చెట్లను చూస్తూ ట్రెక్కింగ్ చేస్తూ ప్రకృతి ఒడిలో పరవశించి పోతున్నారు.(unforgettable sweet experiences) ప్రకృతి పర్యాటక యాత్రలకు పర్యాటకుల నుంచి మంచి స్పందన వస్తుందని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎకోటూరిజం కన్సల్ టెంట్ అఖిల్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
బర్డ్ వాక్ లో 300కు పైగా పక్షుల గుర్తింపు
హైదరాబాద్ నగరంలోని బొటానికల్ గార్డెన్, మంచిరేవుల అడవులు, వికారాబాద్ అనంతగిరి అడవులు, గజ్వేలు, నల్లమల అడవుల్లో నిర్వహించిన బర్డ్ వాక్ లో పిల్లల నుంచి పెద్దల దాకా పెద్ద సంఖ్యలో పక్షిప్రేమికులు పాల్గొని కిలకిలరావాలు చేసిన రంగురంగుల పక్షులను తిలకించారు. హైదరాబాద్ నగరంలోని పార్కులు, అడవుల్లో 62 రకాల పక్షి జాతులు, నగర శివార్లలోని అడవుల్లో 130 రకాల పక్షులు, నల్లమల అడవుల్లో 300 కు పైగా పక్షి జాతులను పక్షిప్రేమికులు గుర్తించారు. బర్డ్ వాచర్స్ వివిధ జాతుల పక్షుల చిత్రాలను తమ కెమెరాల్లో బంధించారని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ కణ్యాణపు సుమన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
నేచర్ నైట్ క్యాంపు
మంచిరేవుల అడవిలో పచ్చని చెట్ల మధ్య టెంట్లలో రాత్రి బస చేసిన పర్యాటకులు వింత అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు. అడవి ఒడిలో ప్రకృతి అందాల మధ్య పచ్చని చెట్ల చేరువలో టెంట్లలో రాత్రి బస చేయడం మర్చిపోలేని మధుర అనుభూతిని అందిస్తుందని పర్యాటకులు యామిని, సుధ, రవి కిషోర్ చెప్పారు. వేసవికాలం ఆరంభంతోపాటు సెలవు రోజుల్లో పచ్చని ప్రకృతి ఒడిలో విహరించేందుకు హైదరాబాద్ నగర వాసులు ఆసక్తి చూపిస్తున్నారు. పక్షులకు నిలయమైన అటవీ అందాలను తిలికించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. విద్యార్థుల నుంచి పెద్దల దాకా మహిళలు, వృద్ధులు సైతం ప్రకృతి ఒడిలో విహరిస్తూ సేదతీరుతున్నారు.
బస్సుల్లో ఎకో టూర్స్
హైదరాబాద్ నగరంతోపాటు నగర శివార్లలోని దట్టమైన అడవులు,ఫారెస్ట్ ట్రెక్ పార్కు, పచ్చని పార్కులు, జింకల పార్కులు, జూపార్కులను ఒక సర్క్యూట్ గా రూపొందించి బస్సుల్లో పర్యాటకులతో ఎకో టూర్స్ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ రేంజ్ ఆఫీసర్ సామినేని శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సందర్శకులు ప్రకృతి పర్యాటకానికి ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో తాము పలు పర్యాటక యాత్రలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
పర్యావరణ పర్యాటక యాత్రలు
హైదరాబాద్ నగరంలోని బొటానికల్ గార్డెన్, అనంతగిరి హిల్స్, గజ్వేలు అడవులు, జింకల పార్కులే కాకుండా పర్యాటకుల కోసం పర్యావరణ యాత్రలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రేంజ్ ఆఫీసర్ సామినేని శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు వెల్లడించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ జలాల మధ్య నందిపేటలో వివిధ పక్షుల విడిది కేంద్రం, ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద అడవులు, కల్లూరు వద్ద ఉన్న కనకగిరి హిల్స్ ప్రాంతాల్లో పర్యావరణ యాత్రలు త్వరలో ప్రారంభిస్తామని శ్రీనివాస్ వివరించారు.
నేచర్ ట్రయల్స్
హైదరాబాద్ నగరంలోని యువతీ, యువకుల కోసం చిలుకూరు, మంచిరేవుల ప్రాంతాల్లోని ఫారెస్ట్ ట్రెక్ లో సాహస యాత్రలు (Adventure expeditions) ప్రారంభిస్తామని రేంజ్ ఆఫీసర్ సామినేని శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు తెలిపారు. సాహసాలు చేయాలనుకునే యువత ఈ యాత్రల్లో పాల్గొని థ్రిల్ పొందవచ్చన్నారు.ఎతైన చెట్లతో దట్టమైన అడవులు, కొండలు, గుట్టలపై ట్రెక్కింగ్ యువతకు మర్చిపోలేని అనుభూతిని అందిస్తుందని చెప్పారు. ఈ ట్రెక్కింగ్ సాహస యాత్రలో పర్యాటకులకు వన్యప్రాణులు, అడవుల పరిరక్షణ గురించి వివరించి చెబుతున్నామని శ్రీనివాస్ వివరించారు.
తెలంగాణలో ప్రకృతి పర్యావరణ యాత్రలు
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఈనెల ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి నెల 30 వ తేదీ వరకు ప్రతీ వీకెండ్ శనివారం, ఆదివారం పలు పర్యావరణ యాత్రలు చేపట్టింది. ప్రకృతి పర్యావరణ యాత్రల్లో భాగంగా ప్రకృతి అందాల నడుమ, పక్షుల కిలకిల రావాల మధ్య విహరిస్తూ నగరవాసులు సేదతీరుతున్నారు.
- ఫిబ్రవరి 22 వతేది : ఫారెస్ట్ ట్రెక్ పార్క్ లో ఉదయం 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ట్రెక్కింగ్,నేచర్ ట్రయల్ యాత్ర.
- ఫిబ్రవరి 23వతేది : వికారాబాద్ అనంతగిరి హిల్స్ లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు బర్డ్ వాక్.
- మార్చి 1వతేది :మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు నేచర్ క్యాంప్.
- మార్చి 2వతేది : గజ్వేలు ఫారెస్ట్ లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు బర్డ్ వాక్.
- మార్చ్ 8 వతేది : ఫారెస్ట్ ట్రెక్ పార్క్ లో మధ్యాహ్నం 3 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు నేచర్ క్యాంప్.
- మార్చి 9వతేది : ఫారెస్ట్ ట్రెక్ పార్క్ లో ఉదయం 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకు బర్డ్ వాక్.
- మార్చి 15 న ఫారెస్ట్ ట్రెక్ పార్క్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు నేచర్ క్యాంప్.
- మార్చి 16 వతేది : ఫారెస్ట్ ట్రెక్ పార్క్ లో ఉదయం 6.30 గంటల నుండి 9.30 గంటల వరకు ట్రెక్కింగ్ మరియు నేచర్ ట్రయల్.
- మార్చి 22వతేది : ఫారెస్ట్ ట్రెక్ పార్క్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు నేచర్ క్యాంప్.
- మార్చి 23వతేది : వికారాబాద్ అనంతగిరి హిల్స్ లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు బర్డ్ వాక్, ట్రెక్కింగ్.
- మార్చి 29వతేది : ఫారెస్ట్ ట్రెక్ పార్క్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు నేచర్ క్యాంప్
- మార్చి 30వతేది : గజ్వేలు ఫారెస్ట్ లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు బర్డ్ వాక్.