న్యాయవాది దారుణ హత్య.. ఆ పగతోనే దాడి..
పోలీసులకు ఫిర్యాదు చేయడంలో మహిళకు సహాయం చేయడం వల్లే దస్తగిరి తన తండ్రిపై ద్వేషం పెంచుకున్నాడని ఇజ్రాయెల్ కుమార్తె వివరించింది.;
హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. పట్టపగలు, నడిరోడ్డుపైనే దారుణమైన హత్యలు జరుగుతున్నాయి. ఆదివారం ఓ వ్యక్తిని ఇదే విధంగా పట్టపగలు నడిరోడ్డుపైన అతిదారుణంగా హత్య చేశారు. ఆ దారుణాన్ని మరువక ముందే సోమవారం ఇటువంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఓ న్యాయవాదిని అతికిరాతకంగా హతమార్చారు. ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని దస్తగిరి అనే వ్యక్తి పక్కాప్లాన్ ప్రకారం కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో లాయర్ ఇజ్రాయెల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ ఇజ్రాయెల్ తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్‌లో చోటు చేసుకుంది.
ఇజ్రాయెల్ ఇంట్లో ఓ మహిళ అద్దెకు నివాసం ఉంటుంది. ఆమెను దస్తగిరి అనే ప్రైవేటు ఎలక్ట్రీషియన్ కొంతకాలంగా వేధిస్తున్నాడని పేర్కొంటూ సదరు మహిళ.. ఇజ్రాయెల్‌ను ఆశ్రయించింది. దీంతో దస్తగిరిపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంలో ఇజ్రాయెల్ సదరు మహిళకు సహాయం చేశాడు. ఆ విషయం తెలియడంతో న్యాయవాదిపై దస్తగిరి పగ పెంచుకున్నాడు. ఆ కక్షతోనే సోమవారం ఉదయం ‘నాపైనే ఫిర్యాదు చేయిస్తావా?’ అంటూ న్యాయవాదిపై దస్తగిరి దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఇజ్రాయెల్‌ను ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా దస్తగిరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే ఇజ్రాయెల్ హత్యపై ఆయన కూతురు స్పందిస్తూ కీలక విషయాలు పంచుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంలో మహిళకు సహాయం చేయడం వల్లే దస్తగిరి తన తండ్రిపై ద్వేషం పెంచుకున్నాడని ఇజ్రాయెల్ కుమార్తె వివరించింది. ‘‘మా నాన్నపై దాడి చేయడానికి ముందు చుట్టుపక్కల ప్రాంతాల్లో మా నాన్న గురించి దస్తగిరి ఆరా తీశాడు. ఆయన ఎప్పుడు బయలుదేరుతాడు? ఎక్కడికి వెళ్తున్నారు? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నాడు’’ అని న్యాయవాది కూతురు వివరించారు.