బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలందరికీ టికెట్లు! ఇక బీజేపీపై దూకుడు!!

బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం కాదని నిరూపించేలా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో దూకుడు పెంచాలని గులాబీ నేతలు నిర్ణయించారు. ఎవ్వరూ పార్టీ మారకుండా కట్టుదిట్టాలు చేశారు

Update: 2024-01-27 03:00 GMT
KCR and KK

పార్లమెంట్‌ ఎన్నికలే టార్గెట్‌గా బీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో నిర్వహించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే ఆరు నెలల్లోనే ప్రజలు రోడ్లపైకి వస్తారనే ధీమాలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ కూడా అదే అభిప్రాయంలో ఉన్నట్టు ఎర్రవల్లి ఫాం హౌస్ లో మీటింగ్ కి వెళ్లివచ్చిన వాళ్లు అభిప్రాయపడ్డారు. పేరు రాయడానికి ఎవరూ ఇష్టపడలేదు గాని మీటింగ్ లో పాల్గొన్న ఓ మాజీ మంత్రి చెప్పిన దాని ప్రకారం.. కాంగ్రెస్ గెలుపు ఇప్పటికీ పార్టీ అధినేత కేసీఆర్ కి మింగుడుపడలేదు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారట. బీజేపీ రాష్ట్రంలో బలపడితే పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరుగుతుందని చెప్పడంతో పాటు అందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకునేందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని ఎంపీలకు సూచించారు.

పార్లమెంటులో బీజేపీని ఏకేస్తారా...


బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ బలంగా నమ్మించడం వల్లే హస్తం పార్టీ తెలంగాణలో గెలిచిందనే అభిప్రాయంలో ఉన్న గులాబీ నేతలు ఈసారి దాన్ని తిప్పికొట్టాలనుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈనెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఈసారి గట్టిగానే బీజేపీని విమర్శించవచ్చు. అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. పునర్విభజన చట్టంలోని హామీలపై పార్లమెంట్లో కేంద్రంపై వత్తిడి తేవాలని సూచించారు. రాష్ట్రంలో పెండింగ్ అంశాలను రాష్ట్ర పునర్విభజన అంశాలు చర్చకు వచ్చే విధంగా ఉభయ సభల్లోనూ ఎంపీలు దృష్టి సారించాలన్నారు. కె.ఆర్.ఎం.బి. అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడంతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి నీటి కేటాయింపుల్లో రాష్ట్ర వాటాను ముందుగా తేల్చాలని డిమాండ్ చేయాలని ఎంపీలకు కేసీఆర్ సూచించారు.

అన్ని రంగాల్లో కేంద్రం విఫలం...

కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయిందన్న అభిప్రాయానికి బీఆర్ఎస్ వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా ఎంపీలు క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉండబోతున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే అంశం కీలకంగా మారుతుందని కేసీఆర్ అన్నట్టు సమాచారం. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా బహిరంగ సభలను నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఎంపీలకు సూచించారు. ఎంపీ అభ్యర్థుల విషయంలో స్పష్టత ఇవ్వకపోయినా సిట్టింగ్ ఎంపీలకు ప్రాధాన్యత ఇస్తామన్న సంకేతాలను కేసీఆర్‌ ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కుంగిపోవొద్దు...

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశకు గురి చేసినా... వాటిని పరిగణలోకి తీసుకోకుండా పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎంపీలకు కేసిఆర్ సూచించారు. బీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ సమావేశంలో జాతీయ పార్టీల వైఫల్యాలు, పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు, పెండింగ్ అంశాలు సహా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపైనే కేసీఆర్‌ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.


రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల పైన కేసీఆర్‌ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం దాదాపు అసాధ్యమని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల లోపు హామీలు అమలు కాకపోతే ప్రజల నుంచి కాంగ్రెస్ వ్యతిరేకత మూటగట్టుకోక తప్పదన్నారు. ఈ అంశాన్ని క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ అనుకూలంగా మలుచుకునేలా పావులు కలపాల్సిన అవసరం ఉందని ఎంపీలకు సూచించారు. బీజేపీ రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి దాన్ని మైలేజీగా చెప్పుకునే అవకాశం ఉందని.... తెలంగాణలో యాదాద్రి నిర్మాణాన్ని పూర్తి చేసినా రాజకీయంగా బీఆర్ఎస్ వినియోగించుకోలేదన్న అంశాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.

Tags:    

Similar News