ఎన్నికల హమీలను గాలికొదిలేసి, కొత్త రంగుల కల చూపిస్తున్నరేవంత్
1990 దశకంలో చంద్రబాబు నాయుడు కాలం నుండీ మొదలైన ఈ విదేశీ నగరాల మోడల్ వేలం వెర్రి యిప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరాకాష్టకు చేరింది.
By : రవి కన్నెగంటి
Update: 2024-08-10 03:19 GMT
అవసరాలకు మించి డబ్బులు, అలవి కాని అధికారం చేతికి వస్తే మనుషులు దారి తప్పిపోతారని, సాధారణ ప్రజల ఆలోచనలకు దూరమైపోతారని, చివరికి మనుషులు కాకుండా పోతారని పెద్దలు చెబుతారు. వివిధ సందర్భాలలో అది మన అనుభవంలోకి వస్తున్నదే.
రాజకీయ పార్టీల నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడినా, అధికారం చేపట్టగానే అందరిదీ ఒకే ఆలోచనా ధోరణి, ఒకే అభివృద్ధి నమూనా, ఒకే నడక, ఒకే భాష,
స్థానిక ప్రజల అభివృద్ధి కోసం స్థానిక ప్రజలతో, విద్యావంతులతో కాకుండా, విదేశీ సంస్థల నిపుణుల సలహాల కోసం ఎదురు చూడడం, పేదలు నివసించే తండాల వైపూ, గ్రామాల వైపూ, బస్తీల వైపూ కాకుండా , అభివృద్ధి చెందిన దేశాల వైపూ, ఆధునిక పెద్ద నగరాల వైపూ చూడడం సర్వ సాధారణమై పోయింది. తెలంగాణ రాష్ట్ర పాలకులు కూడా దీనికి భిన్నంగా లేరు. ఈ విషయంలో గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వానికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుకూ మధ్య పెద్ద వ్యత్యాసం కనపడడం లేదు.
సింగపూర్, మలేషియా, లండన్, డల్లాస్ లాంటి నగరాల పేర్లను గత KCR ప్రభుత్వం వల్లె వేస్తుండేది. వాటిలాగా తెలంగాణ ను అభివృద్ధి చేస్తానని రంగుల కలలు చూపించేది. ప్రస్తుత ప్రభుత్వం ఈ లిస్ట్ కు అదనంగా న్యూయార్క్ నగరాన్ని చేర్చింది. మూసీ నదిని థేమ్స్ నదిలాగా అభివృద్ధి చేస్తానని కూడా మరో మాట చేర్చింది.
1990 దశకంలో చంద్రబాబు నాయుడు కాలం నుండీ మొదలైన ఈ విదేశీ నగరాల మోడల్ వేలం వెర్రి యిప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరాకాష్టకు చేరింది.
ఒక వైపు ప్రపంచమంతా ఆర్ధిక మాంద్యంలో కొట్టు మిట్టాడుతోంది. ముఖ్యంగా బాగా అభివృద్ధి చెందాయనుకుంటున్న అమెరికా, యూరప్ దేశాలలో నిరుద్యోగం పెరిగిపోవడం, ఆయా దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడం, అనేక కంపెనీలు ఉన్న ఉద్యోగులను తగ్గించుకోవడం మనం చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకు వస్తూ , ఈ ప్రమాదాలను మరింత పెంచుతున్నది. ఈ ఆర్ధిక మాంద్యం చాలా కాలం పాటు ఉండవచ్చని అంతర్జాతీయ ఆర్ధిక నిపుణుల అంచనా.
ఇవేవీ పట్టించుకోకుండా, ఇతర దేశాలలో ఉన్న బడా సాఫ్ట్ వేర్ కంపెనీలను , ఔషధ కంపనీలను, మన రాష్ట్రా నికి రప్పించాలని ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు చేయడం, ఆయా కంపనీల ప్రతినిధులతో సంప్రదింపులు చేయడం , ఒప్పందాలు చేసుకోవడం మనం చూస్తున్నాం.
గత 30 ఏళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులు అందరూ తమ పరిపాలనా కాలంలో ఇలా విదేశాల పర్యటనలు చేసి వచ్చారు. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి పెట్టుబడిదారుల సమావేశాలకు కూడా వెళ్ళి వచ్చారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం అనేక రంగాలపై శ్వేత పత్రాలను విడుదల చేసింది కనుక మన రాష్ట్ర పాలకుల విదేశీ పర్యటనలు – కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు- రాష్ట్రానికి తరలి వచ్చిన పెట్టుబడులపై ఒక శ్వేత పత్రాన్ని వెంటనే విడుదల చేస్తే, ప్రజలు అడిగే కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి .
ముఖ్యంగా ఏ ముఖ్యమంత్రి/మంత్రి ఏ సంవత్సరంలో ఏ దేశానికి పర్యటనకు వెళ్లారు ? ఎన్ని కంపనీలతో చర్చించి,ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు చేసుకున్నారు ? ఎన్ని కంపనీలు ఒప్పందం ప్రకారం కంపెనీలు ఏర్పాటు చేశాయి ? ఎన్ని వేల కోట్ల పెట్టుబడు లొచ్చాయి ? ఎంతమందికి ఉపాధి కల్పించాయి ? ఈ కంపెనీల కోసం రైతుల నుండీ ఎన్ని గ్రామాలలో ఎన్ని వేల ఎకరాల భూమి లాక్కున్నారు ? ఏర్పడిన కంపెనీలలో ఉపాధి పొందిన వాళ్ళలో తెలంగాణ స్థానికులు ఎంతమంది ? ఇందులో పర్మినెంటు కార్మికులు ఎందరు ? తాత్కాలిక కార్మికులు ఎందరు ? ఈ కంపనీల ఏర్పాటుకు అవసరమైన భూములను ఇచ్చిన రైతు, వ్యవసాయ కూలీ కుటుంబాల పిల్లలకు ఈ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చాయా ? నైపుణ్యం అవసరం లేని పనులైనా వాళ్లకు దొరికాయా ?
ఇలాంటి ప్రశ్నలకు జవాబులు అవసరం. అలాగే ఈ కంపనీలు స్థానికంగా కాలుష్యాన్ని వెదజల్లకుండా ఉంటున్నాయా ? సహజ వనరులను ఒప్పందాలలో ఉన్న మేరకే ఉపయోగి స్తున్నాయా ? అధికారులకు లంచాలు మేపి అదనంగా ఆక్రమించుకుని ఉపయోగించు కుంటున్నాయా ? అనేది కూడా బయట పెట్టాలి. 2014 నుండీ BRS ప్రభుత్వ కాలంలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఇప్పటి ప్రభుత్వం లోనూ అదే బాధ్యతలు చూస్తున్నారు కనుక, గత ప్రభుత్వ పెద్దలతో కలసి ప్రపంచ పర్యటనలు చేసి వచ్చారు కనుక, ఈ ప్రభుత్వానికి అటువంటి శ్వేతపత్రం విడుదల చేయడం చాలా తేలిక .
గత ముప్పై ఏళ్ల అనుభవాల నుండీ ఏమీ నేర్చుకోకుండా, ఎప్పటికప్పుడు కొత్త పాలకులు విదేశీ పర్యటనలు చేయడం, కొత్త ఒప్పందాలు చేసుకోవడం అవసరమా?
ఏ పెట్టుబడి దారుడయినా, తన లాభాల కోసమే పెట్టుబడులతో వస్తాడు తప్ప, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాననే లక్ష్యంతో రాడు. సహజంగా పెట్టుబడి కూడా దారులు ఏమి కోరుకుంటారు ? భూమి నీరు లాంటి సహజ వనరులు ఉచితంగా, లేదా తక్కువ ధరకు లభించాలి, కంపనీలు పెట్టె ప్రాంతాలకు రోడ్లు, విద్యుత్ లైన్లు, నీటి పారుదల సౌకర్యాలు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి, కంపనీకి విద్యుత్ సబ్సిడీ పై అందాలి, కార్మికులు, ఉద్యోగులు తక్కువ వేతనాలకు పని చేయాలి, సంస్థలో కార్మిక సంఘాలు ఉండకూడదు, కొత్తగా పెట్టె కంపనీలకు కొన్ని పన్ను మినహాయింపులు ఇవ్వాలి , కార్మిక చట్టాలు అమలు చేయాలని ఒత్తిడి చేస్తూ కార్మిక శాఖ తనిఖీలు ఉండకూడదు, కంపెనీకి లాభం లేదనుకుంటే, ఎప్పుడైనా సంస్థను మూసేసే అధికారం యాజమాన్యానికి ఉండాలి, తనకు నచ్చకపోతే, పనిలో ఉన్న వాళ్ళను ఎప్పుడైనా తొలగించే అధికారం కంపెనీకి ఉండాలి -
ఒక్క మాటలో చెప్పాలంటే అత్త గారింట్లో కొత్త అల్లుడిని చూసుకున్నట్లు ప్రభుత్వాలు కంపనీలను చూసుకోవాలి –
అని యాజమాన్యాలు కోరుకుంటున్నాయి.
అలా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇస్తూ, ఆ మేరకు పారిశ్రామిక విధానాలు తయారు చేస్తూ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి , కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ముద్దు పేర్లు పెడుతున్నాయి. అట్లా యాజమాన్యాలకు సాగిల బడిన రాష్ట్రాలకు మొదటి ర్యాంకులు ఇస్తున్నారు. బ్యాంకులు కూడా వస్తున్న కంపనీలకు పోటీలు పడి,రుణాలు ఇవ్వడం, ఆయా కంపనీలు రుణాలు తిరిగి చెల్లించకపోతే, బ్యాంకులు నిండా మునిగిపోవడం మనం చూస్తున్నదే. దేశ వ్యాపితంగా ఇలాంటి ఉదాహరణలు వందల్లో ఉన్నాయి.
పారిశ్రామిక వాడల అభివృద్ధి పేరుతో, రైతులకు అతి తక్కువ నష్ట పరిహారం చెల్లించి భూములు లాక్కోవడం, పరిశ్రమలు ఏర్పడే ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు స్థానికులకు వస్తాయని ప్రచారం చేయడం, పరిశ్రమలు ఏర్పడ్డాక , స్థానికులకు కాకుండా , అతి తక్కువ వేతనాలతో పని చేసే ఇతర రాష్ట్రాల కార్మికులను, కంపనీల క్యాంపస్ ల లోనే ఉంచుకుంటూ శ్రమ దోపిడీ చేయడం కూడా మనం గమనిస్తున్నాం.
ఇప్పుడు రేవంత్ బృందం అమెరికాలో చేస్తున్న పర్యటన గత ప్రభుత్వాల వైఖరికి భిన్నంగా ఉంటుందా ? ఎట్టి పరిస్థితులలో ఉండబోదు . రెండు రోజుల క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పారిశ్రామిక వేత్తలతో మాట్లాడుతూ. భూమి, నీళ్ళు అందుబాటులో ఉంచుతామని, తక్కువ వేతనాలతో పని చేసే కార్మికులు కూడా అందుబాటులో ఉంటారని ఇచ్చిన హామీని చూస్తే, ఈ ప్రభుత్వ ధోరణి కూడా పాత ప్రభుత్వాల వైఖరి తోనే ఉందని అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే గత ప్రభుత్వం ఇచ్చిన 15 ఇథనాల్ కంపెనీలకు వ్యతిరేకంగా తెలంగాణ లో స్థానికులు ఎక్కడి కక్కడ పోరాడుతుంటే, వాటిపై ఒక వైఖరి ఇప్పటి వరకూ రేవంత్ ప్రభుత్వం ప్రకటించలేదు. తాజాగా ఆయన కుటుంబ సభ్యులే రాష్ట్రంలో 1000 కోట్లతో బయో ఫ్యూయల్ కంపనీ ఏర్పాటుకు , రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని పరిశీలిస్తే, ఇథనాల్ పరిశ్రమలకు అనుకూలంగా రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు, ఆయా జిల్లాల ప్రజల భయాలను, అనుమానాలను, అనుభవాలను పట్టించుకోనట్లు మనం అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్, సికింద్రాబాద్ , సైబరాబాద్ తో పాటు, ముచ్చర్ల చుట్టూ వేలాది ఎకరాలతో న్యూయార్క్ నగరం తరహాలో నాల్గవ సిటీ ని నిర్మిస్తామని ఇప్పటికే ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం అక్కడ హెల్త్ , స్పోర్ట్స్ సిటీలను నిర్మిస్తామని,BCCI తో కలిసి మరో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని చెప్పింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల గ్రామాలన్నిటినీ హైదరాబాద్ నగరంలో భాగంగా మారుస్తామని చేస్తున్న ప్రకటనలు కూడా ఇదే అభివృద్ధి నమూనాకు అనుకూలమైనవే. రియల్ ఎస్టేట్ విలువ పెంచే కోణంలో చేస్తున్న ఆలోచనలే. మెట్రో రైల్ విస్తరణ కూడా ఈ గ్రాండ్ ప్రణాళికలో భాగంగా చూడాలి. ప్రపంచ బ్యాంకు అప్పుతో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, మల్లన్న సాగర్ నుండీ మూసీ లోకి నీటి తరలింపు కూడా రేవంత్ ప్రభుత్వ ఈ అభివృద్ధి నమూనా ఆలోచనా స్రవంతిలో భాగంగా చూడాలి.
ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్రామాల సమగ్ర అభివృద్ధి. సమగ్ర వ్యవసాయ విధానం, రైతుల, కూలీల ఆదాయాల పెంపు, అసంఘటిత కార్మికుల సంక్షేమం , ప్రభుత్వ రంగంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం లాంటి ఆలోచనలు పక్కకుపోయి, కొత్త ఎజెండా ముందుకు వేగంగా వస్తున్నది.
ఈ ఎజెండా కార్పొరేట్ కంపెనీలకు, కాంట్రాక్టర్ లకు , రియల్ ఎస్టేట్ రంగ యాజమానులకు,సహజంగా ప్రజా ప్రతినిధులకు తప్పకుండా మేలు చేస్తుంది. రాష్ట్రంలో సాగు భూములు మరింత తగ్గిపోతాయి. నగరాలకు అవసరమైన కూరగాయల,పండ్ల, పాల ధరలు కూడా మరింత పెరుగుతాయి. రాష్ట్ర సహజ వనరులపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. అనివార్యంగా కాలుష్యం కూడా మరింత పెరుగుతుంది.
ప్రజలకు నిజాలు చెప్పకుండా, పాత ప్రభుత్వ భాషలోనే కొత్త ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది, నడుస్తున్నది, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎజెండా కూడా ఇదే కనుక పూర్తిగా సహకరిస్తుంది. చూద్దాం, రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు మరింత ముందుకు వస్తాయో ?