స్థలం : ఇదీ ఢిల్లీలోని జూలాజికల్ పార్కు సమావేశ మందిరం...తేదీ : 29.07.2025 ... సందర్భం : అంతర్జాతీయ పులుల దినోత్సవం 2025...
తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని లింగాల, పద్మనాభపల్లి విభాగాల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎండీ.ఖాదర్ పాషాకు కేంద్ర పర్యావరణం, అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ‘టైగర్’ అవార్డును (Tiger Award)ప్రదానం చేశారు.
అంతే...జూపార్కు ఆవరణలో దేశవ్యాప్త అటవీశాఖ అధికారుల సమావేశ మందిరం చప్పట్లతో మార్మోగింది.ఈ టైగర్ అవార్డుతో తెలంగాణ బీట్ ఆఫీసర్ (Forest Beat Officer) ఖాదర్ పాషాకు జాతీయ స్థాయిలో పాషాకు గుర్తింపు లభించింది.
‘టైగర్’ అవార్డు ఎందుకు వచ్చిందంటే...
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో (Amrabad Tiger Reserve) పులుల సంఖ్యను పెంచడానికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎండీ.ఖాదర్ పాషా చేసిన విశేష కృషికిగాను గుర్తింపుగా అతనికి జాతీయ స్థాయిలో టైగర్ డే సందర్భంగా ‘టైగర్’ అవార్డు లభించింది.అమ్రాబాద్ టైగర్ రిజర్వులో గత 33 ఏళ్లుగా పులుల సంరక్షించి, పులుల సంతతి అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచి పులుల సంఖ్యను పెంచేందుకు ఖాదర్ పాషా కృషి చేశారు.బీట్ ఆఫీసర్ అయిన పాషా ఉదయాన్నే ఆరు గంటలకే ఫారెస్ట్ వాచర్స్ బేస్ క్యాంపులకు వెళ్లి పులుల సంరక్షణ, అడవుల పరిరక్షణకు విశేష కృషి చేశారు. ఈయన పనితీరును చూసి మెచ్చుకున్న అటవీశాఖ అమ్రాబాద్ డీఎఫ్ఓ గోపిడి రోహిత్ రెడ్డి టైగర్ అవార్డుకు అతన్ని ప్రతిపాదించారు.అమ్రాబాద్ అడవుల్లోని పులుల సంతతి పెరిగేందుకు బీట్ ఆఫీసర్ చేసిన కృషిని గుర్తించిన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (National Tiger Conservation Authority ) వైల్డ్‌లైఫ్ హాబిటాట్ మేనేజ్‌మెంట్ విభాగంలో (Wildlife Habitat Management,) విశిష్ఠ అవార్డును ఆయనకు ప్రదానం చేసింది.
అటవీ అభివృద్ధికి చర్యలు
అమ్రాబాద్ అభయారణ్యంలోని లింగాల, పద్మనాభపల్లి విభాగాల ఫారెస్ట్ బీట్ లలో గతంలో అసలు పులులే ఉండేవి కాదు. ఈ ఫారెస్ట్ బీట్లకు ఫారెస్ట్ బీట్ ఆఫీసరుగా ఎండీ ఖాదర్ పాషా బదిలీపై వచ్చారు. బీట్ ఆఫీసర్ వచ్చాక పులుల ఆవాసాలకు ఆటంకం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. గల్లీకట్టలు, చెక్ డ్యామ్ లు, ఇంకుడు గుంతలు నిర్మించి అడవుల్లో చెట్లు, గడ్డి పెరిగేలా చర్యలు తీసుకున్నారు. కొండలపై బోరు వేయించి సోలార్ పంపు సెట్టు పెట్టి అడవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చారు.చుట్టూ కొండలు , గుట్టలతో కూడిన నల్లమల అడవుల్లో పులుల ఆవాసాలకు అనుకూలంగా అడవిని అభివృద్ధి చేశారు.
రెండు నుంచి 8కి పెరిగిన పులుల సంఖ్య
అమ్రాబాద్ అభయారణ్యంలోని లింగాల, పద్మనాభపల్లి బీట్ పరిధుల్లో అసలు పులులుండేవి కాదు. అయితే పచ్చని చెట్లతో కొండలు, గుహలతో కూడిన బీట్ లో పులుల నివాసానికి యోగ్యంగా ఉంది. దీంతో మొదటి సారి ఎఫ్ 18 అనే ఆడపులి పద్మనాభపల్లి బీట్ పరిధిలోని అడవులోకి వచ్చింది. అంతే ఆ తర్వాత ఎం 19 నంబరు మగపులి దానికి తోడుగా వచ్చింది. ఈ జంట పులుల ఏకాంతానికి భంగం వాటిల్లకుండా తీసుకున్న చర్యలతో ఈ పులుల జంట నాలుగేళ్ల కింద నాలుగు పులి కూనలకు జన్మనిచ్చింది.ఈ పులి కూనల్లో మూడు ఆడపులులు కాగా,ఒక మగపులి. ఈ నాలుగు పులుల వయసు నాలుగేళ్లు దాటడంతో అవి మన్ననూర్, కొల్లాపూర్ అడవుల్లో సంచరిస్తున్నాయని కెమెరాట్రాప్ చిత్రాలను బట్టి తేలింది. మళ్లీ ఎఫ్ 18 పులి తాజాగా మరో రెండు పులి కూనలకు జన్మనిచ్చింది. అసలు పులులే లేని బీట్ లో ముందుగా పులి జంట వచ్చింది. ఆ తర్వాత ఈ జంట ఆరు పులి కూనలకు జన్మనివ్వడంతో వీటి సంఖ్య 8కి పెరిగింది.
బీట్ ఆఫీసర్ ఖాదర్ బాషా భేష్
అమ్రాబాద్ బీట్ ఆఫీసర్ ఖాదర్ బాషా అడవుల పరిరక్షణ, పులుల సంరక్షణ కోసం విశేషంగా కృషి చేశారని అమ్రాబాద్ డీఎఫ్ఓ గోపిడి రోహిత్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆయన అహర్నిశలు శ్రమించి పులుల సంతతి పెరిగేందుకు దోహదపడ్డారని పేర్కొన్నారు. పులుల పరిరక్షణకు కృషి చేసిన ఖాదర్ పాషాకు జాతీయ టైగర్ అవార్డు రావడంపై లింగాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఈశ్వర్ అభినందించారు.
అడవిలో ఏం చేశారంటే...
అమ్రాబాద్ అభయారణ్యంలో పులుల సంరక్షణ కోసం విశేష కృషి చేసి జాతీయ అవార్డు పొందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎండీ.ఖాదర్ పాషా పులుల సంరక్షణ కోసం అడవిలో ఏం చేశారన్నది ఢిల్లీ నుంచి ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్య్యూ ఇచ్చారు. ఆయన చేసిన కృషి ఏమిటో ఆయన మాటల్లోనే విందాం.
సాధారణ కార్మికుడి నుంచి బీట్ ఆఫీసర్ అయ్యాను...
‘‘నాది కొల్లాపూర్ మండలం కల్వకోట గ్రామం...మా నాన్న చిన్న రైతు. మాకున్న ఎకరం పొలంలోనే వ్యవసాయం చేసేవాళ్లం.నిరుపేద కుటుంబం. 1992వ సంత్సరంలో నేను అటవీశాఖలో బాంబూకోట్స్ కటింగ్ విభాగంలో సాధారణ కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాను. ఆ రోజుల్లో వెదురును కూలీలతో కోయించి, దాన్ని అటవీశాఖ డిపోకు తరలించి విక్రయించేవాళ్లం. 2009వ సంవత్సరంలో నాకు అటవీశాఖలో ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసరుగా ప్రమోషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఏడాదికే 2010వ సంవత్సరంలో బీట్ ఆఫీసర్ అయ్యాను. పేదరికం నుంచి వచ్చిన నేను అన్నం పెట్టిన కృతజ్ఞతతో అటవీశాఖ బీట్ ఆఫీసరుగా అడవులను పరిరక్షించడంతోపాటు జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణలో కీలకమైన పులులను సంరక్షించడమే లక్ష్యంగా పెట్టుకొని గత 33 ఏళ్లుగా శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాను.
అడవుల్లో నీటివనరులను పరిరక్షించాను...
మూడు వైపులా అడవులు, కొండలు, గుట్టలతో కూడిన నల్లమల అడవి ప్రాంతంలోని లింగాల, పద్మనాభపల్లి బీట్ లో వన్యప్రాణులకు ప్రాణసంకటంగా మారిన కరెంటు ఉచ్చులు పెట్టకుండా నిరోధించి వేటగాళ్ల ఆటకట్టించాను. నా బీట్ ను ప్లాస్టిక్ ఫ్రీ చేయడంతోపాటు అడవుల్లో గల్లీ కట్టలు కట్టించి చెక్ డ్యామ్ లు, పర్కులేషన్ ట్యాంకు నిర్మించాను. అడవులు పచ్చగా మారేందుకు వీలుగా నీటివనరులను పెంచాను. అడవి మధ్యలో కొండలపై బోరు వేయించి, ఆటోమేటిక్ గా నీరు తోడేలా సోలార్ పంపు సెట్టు అమర్చాను. పులులే కాదు ఇతర వన్యప్రాణుల సంరక్షణకు వాటికి ఆహారంతోపాటు నీళ్లు అందేలా చూశాను. అంతే అసలు పులులే లేని లింగాల, పద్మనాభపల్లి బీట్ లో ముందుగా ఆడ, మగ పులుల జంట వచ్చింది. ఆ తర్వాత ఆ జంట ఆరు పులికూనలకు జన్మనిచ్చింది. వాచ్ టవర్ ను కూడా నిర్మించాను.
ఇదీ నా దిన చర్య
నేను ఉదయాన్నే ఆరు గంటలకే ద్విచక్రవాహనంపై పద్మనాభపల్లి బీట్ లో ఉన్న అయిదు వాచ్ బేస్ క్యాంపుల వద్దకు వచ్చి అటవీప్రాంతం పరిరక్షణ చర్యలను పరిశీలించి వాచర్ల సాయంతో తగు చర్యలు తీసుకుంటాను.పులులు, ఇతర వన్యప్రాణుల సంచారానికి ఆటంకం కలగకుండా వాటి సంరక్షణకు ప్రాధాన్యమిచ్చి పనిచేస్తున్నాను. నేను అడవిలో సందర్శించినపుడు 14 సార్లు స్వయంగా పులిని చూశాను. పులి కనిపించినా, ఎలాంటి శబ్ధం చేయకుండా ఉంటే చాలు అది వెళ్లిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవిలోనే తిరుగుతూ పరిరక్షణ చర్యలు చేపడుతూ వాచర్ల బేస్ క్యాంపు వద్దనే భోజనం చేస్తాను. అలా నా బీట్ ఏరియా తిరిగి సాయంత్రానికి హెడ్ క్వార్టరుకు చేరుతుంటాను.
అవార్డులు దక్కడం సంతోషాన్నిచ్చింది...
పులుల పరిరక్షణకు పనిచేసినందుకు గుర్తింపుగా నాకు జాతీయ స్తాయిలో కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ నుంచి టైగర్ అవార్డు దక్కడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. గతంలోనూ ఉత్తమ అటవీశాఖ అధికారిగా నాకు కలెక్టరు అవార్డు లభించింది. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది.
పులుల సంరక్షణలోనే ఆత్మ సంతృప్తి
నేను 33ఏళ్లుగా అటవీశాఖలో పనిచేస్తున్నాను. మరో 13 ఏళ్ల సర్వీసు నాకుంది. భవిష్యత్ లో పేదకుటుంబం నుంచి వచ్చిన నాకు అన్నం పెట్టిన అటవీ శాఖకు మెరుగైన సేవలు అందించగలను. అడవులను పరిరక్షించడం, పులుల సంఖ్యను పెంచడంలో నాకు ఆత్మ సంతృప్తి. ఇదే నా జీవిత లక్ష్యం ’’అని ముగించారు టైగర్ అవార్డు గ్రహీత అయిన అమ్రాబాద్ బీట్ ఆఫీసర్ ఎండీ ఖాదర్ బాషా.