ED entry|ఫార్ములా కేసులో కేటీఆర్ కు ఊహించని షాక్
ఫార్ములా కార్ రేసు కేసులో ఈడీ కూడా కేసులు నమోదుచేస్తే కేటీఆర్, అర్వింద్ కు చిక్కులు తప్పేట్లులేదనే అనిపిస్తోంది.
ఫార్ములా కారు రేసు కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అదేమిటంటే ఫార్ములా కార్ కేసు వివరాలను తమకు పంపించాలని ఎన్పోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ఉన్నతాధికారులు ఏసీబీ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఫార్ములా కార్ రేసు(Formula Car Race Case) నిర్వహణలో జరిగిన అవినీతిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ను ఏ1గా, అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ పై ఏ2గా ఏసీబీ కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి కేసులు నమోదుచేసిన ఏసీబీ(ACB Case) అధికారులు శుక్రవారం మధ్యహ్నం నుండి విచారణ మొదలుపెట్టారు. ఫార్ములా కార్ రేసు అవినీతిని విచారించేందుకు ప్రత్యేకంగా ఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏసీబీ ఉన్నతాధికారులు ఏర్పాటుచేశారు.
కారు రేసుపై మున్సిపల్ శాఖ ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఏసీబీ కేసులు నమోదుచేసింది. విచారణలో భాగంగా ప్రత్యేక బృందం దాన కిషోర్ వాగ్మూలాన్ని రికార్డు చేస్తున్నది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాగ్మూలాన్ని రికార్డుచేసిన తర్వాత ఏ2గా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్వింద్ ను విచారించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారంతో సమావేశం ముగిసిన తర్వాత ఏ1, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారణకు నోటీసులు జారీచేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే తనపైన ఏసీబీ కేసు నమోదుచేయటాన్ని చాలెంజ్ చేస్తు కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటీషన్(Quash Petition High Court) దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై హైకోర్టు స్పందన కూడా తెలిసిపోతుంది.
ఇవన్నీ ఇలాగుండగానే సడెన్ గా ఈడీ(Enforcement Directorate) ఎంట్రీ ఇచ్చింది. కేసుకు సంబంధించిన అన్నీ వివరాలను తేదీలతో సహా తమకు అందించాలని ఈడీ అధికారులు ఏసీబీ ఉన్నతాధికారులను కోరారు. జరిగిన అవినీతిలో మనీల్యాండరింగ్(Money Laundering) కోణం కూడా వినబడుతున్న విషయం తెలిసిందే. బహుశా ఈ విషయంలోనే దర్యాప్తుచేయాలని ఈడీ నిర్ణయించుకుని ఉంటుందని అనుకుంటున్నారు. ఎందుకంటే, ప్రత్యేకించి ఫార్ములా కార్ రేసు అవినీతిని ఈడీతో విచారణ చేయించాలని ఎవరూ డిమాండ్ చేయలేదు. ఈడీ విచారణ కోరుతు ఎవరూ కోర్టులో కేసు కూడా వేయలేదు. అలాంటిది తనంతట తానుగానే కేసులో ఈడీ ఎంటరైందంటే అర్ధమేంటి ? మనీల్యాండరింగ్ కోణం తప్ప మరోటి కనబడటంలేదు. మనీల్యాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు వినబడుతున్న ఏ కేసులో అయినా సూమోటోగా కేసు నమోదు చేసుకుని ఈడీ ఎంటరవ్వచ్చు.
ఎలాగూ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా రు. 55 కోట్లను బదిలీచేసినట్లు అర్వింద్ కుమార్ ఇప్పటికే చీఫ్ సెక్రటరీకి రాతమూలకంగా చెప్పిన విషయం తెలిసిందే. అర్వింద్ ఇచ్చిన రాతమూలక వాగ్మూలం ఆధారంగానే ఏసీబీ విచారణలో ముందుకు వెళుతోంది. ఇదే విషయమై ఈడీ కూడా దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది. ఏదేమైనా అందుబాటులోని వివరాలు, సాక్ష్యాల ఆధారంగా ఫార్ములా కార్ రేసు కేసులో ఈడీ కూడా కేసులు నమోదుచేస్తే కేటీఆర్, అర్వింద్ కు చిక్కులు తప్పేట్లులేదనే అనిపిస్తోంది.