అమెరికాలో మరో హైదరాబాదీ మృతి

అమెరికాలో మరో హైదరాబాదీ మృత్యువాతపడ్డారు. ఒక ప్రమాదం నుంచి బయటపడిన నిమిషాల్లోనే మరో ప్రమాదం వెంటాడి ప్రాణాలు తీసింది.

Update: 2024-05-17 12:42 GMT

అమెరికాలో మరో హైదరాబాదీ మృత్యువాతపడ్డారు. ఒక ప్రమాదం నుంచి బయటపడిన నిమిషాల్లోనే మరో ప్రమాదం వెంటాడి ప్రాణాలు తీసింది. అతని మరణంతో కుటుంబసభ్యుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ కి చెందిన పృథ్వీరాజ్ (30) ఎనిమిదేళ్ల క్రితం అమెరికా వెళ్ళాడు. ప్రస్తుతం నార్త్ కరోలినాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. 2022 లో శ్రీప్రియ అనే యువతితో వివాహం జరగగా... ఇద్దరు కలిసి అమెరికాలో నివసిస్తున్నారు. భార్యతో కలిసి కారులో బుధవారం బయటకి వెళ్లగా కారు ప్రమాదం జరిగింది. వర్షం కారణంగా ముందు వెళ్తున్న కారుని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. భార్యని కారులోనే ఉంచి ఘటనపై పోలీసులకి సమాచారం ఇచ్చేందుకు పృథ్వీరాజ్ కారు దిగి బయటకి వచ్చారు. ఇంతలోనే వేగంగా వస్తున్న మరో కారు ఆయన్ని ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇండియాలో ఉంటున్న వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కి చెందిన విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి అబ్బరాజు వెంకటరమణ కుమారుడు ప్రథ్వీరాజు. వీరి కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపురిలో సెటిల్ అయింది. రెండేళ్ల కిందట అనారోగ్య కారణాలతో వెంకటరమణ మరణించారు. పృథ్వీరాజ్ పైనే తల్లి, చెల్లెలు గంపెడు ఆశలు పెట్టుకుని జీవిస్తున్నారు. ఇప్పుడు పృథ్వీ మరణంతో వారిద్దరూ ఒక్కగానొక్క తోడుని కూడా కోల్పోయామని బాధపడుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బుధవారం హైదరాబాద్ కి తీసుకురానున్నట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. 

కాగా, అమెరికాలో వరుసగా తెలుగు వారు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది.

ఈ ఏడాది మార్చిలో తప్పిపోయిన హైదరాబాద్ కి చెందిన విద్యార్థి అబ్దుల్ అర్ఫాత్ అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో శవమై కనిపించిన విషయం తెలిసిందే. అతని మరణంపై సమగ్ర దర్యాప్తు జరిగేలా స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపారు.

అలాగే ఇదే ఏడాది, ఏప్రిల్ లో క్లీవ్‌ల్యాండ్ లో భారత విద్యార్థి గద్దె ఉమా సత్య సాయి మృతి కూడా మిస్టరీగానే ఉంది. దీనిపై పోలీసుల ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది.

ఈ ఫిబ్రవరిలో షికాగోలో ఒక భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. దాడి తరువాత, షికాగో లోని భారత కాన్సులేట్... బాధితుడు సయ్యద్ మజాహిర్ అలీతో పాటు భారతదేశంలోని ఆయన భార్యతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొంది.


Tags:    

Similar News