ఏపీ లిక్కర్ స్కాం.. హైదరాబాద్‌లో సిట్ సోదాలు

Update: 2025-07-26 13:08 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం తీవ్ర రాజకీయ కలకలం రేపుతోంది. ఈ కేసులో అనేక మంది పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. కేసుతో సంబంధం ఉందనుకున్న వారి నివాసాలు, కార్యాలయాల్లో మెరుపు దాడులు చేస్తోంది సిట్. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏపీ సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దర్యాప్తులో భాగంగా పలు ప్రముఖ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు. భారతి సిమెంట్స్ (Bharathi Cements), రిసోర్స్ వన్ (Resource One), ట్రీగ్రిల్ (Treagile), కేసిరెడ్డి గ్రూప్, చాణక్య లాబ్‌లలో సోదాలు చేస్తున్నాయి ఏపీ సిట్ బృందాలు.

సోదాల్లో భాగంగానే సదరు సంస్థల లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు లావాదేవాలు అనుమానాస్పదతంగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా, లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్పపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, కంపెనీ ఖాతాలు, అఫిలియేట్ లింకులు అన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా ఇసీఐఆర్, జీఎస్టీ రికార్డులు, ల్యాప్‌టాప్‌లు, మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కంపెనీల అకౌంటింగ్ బుక్స్, ఇన్‌వాయిస్‌లు, టెండర్ డాక్యుమెంట్లు సీజ్‌ చేశారు. కొన్ని కీలక వ్యక్తులను విచారణకు పిలవనున్నారు.

లిక్కర్ స్కాం ఏంటి

ఈ కేసు అనేక కోట్ల రూపాయల అవినీతి, ముడుపుల వ్యవహారంగా ఎస్‌ఐటి గుర్తించింది. ప్రభుత్వ వైనరీ కాంట్రాక్టులు, ఎక్సైజ్ పాలసీ కట్టుబాట్లను ఉల్లంఘించి చేసిన ఒప్పందాలు విచారణలో ఉన్నాయి. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పలు కంపెనీలు, నేతలు, అధికారులు ఈ కేసులోనూ సంబంధాలు కలిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News