Kavitha | ముగ్గురు అసంతృప్తనేతలను పార్టీలు ఎలా డీల్ చేస్తాయి ?
ప్రతిరోజు ఏదో ఒక కారణంపై నాయకత్వంపై బహిరంగంగనే ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు;
ముగ్గురునేతలు తమపార్టీల్లో సెగలు పుట్టిస్తున్నారు. పార్టీల నాయకత్వాలపై ముగ్గురు ప్రజాప్రతినిధుల్లోను రకరకాల కారణాలతో అసంతృప్తి పెరిగిపోతోంది. అందుకనే ప్రతిరోజు ఏదో ఒక కారణంపై నాయకత్వంపై బహిరంగంగనే ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. పై ఫొటో చూడంగానే ముగ్గురు నేతలు ఎవరు ? ఆ పార్టీలేవి అన్న విషయం అర్ధమైపోయుంటుంది. కాంగ్రెస్ పార్టీ తరపున మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి(Komatireddy) తనకు మంత్రిపదవి ఇవ్వనందుకు బాగా మండిపోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అన్న కేటీఆర్(KTR) తో పడని కారణంగా ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) పార్టీకి వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు. పార్టీకి రాజీనామచేసిన గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్(Rajasingh) పార్టీ నాయకత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా బీజేపీ(BJP)లో ఎవరూ చేరవద్దని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో మంటలు మండిస్తున్నాయి.
ఇపుడు ఒక్కొక్కరి విషయం చూద్దాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేర్చుకునేటప్పుడు తనకు మంత్రిపదవి ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చి మాటతప్పిందని ప్రతిరోజు గోలచేస్తున్నారు. తొమ్మిది మంది ఎంఎల్ఏలున్న ఖమ్మం జిల్లాల్లో ముగ్గురు మంత్రులున్నపుడు 11 మంది ఎంఎల్ఏలున్న నల్గొండ జిల్లాలో ఇద్దరికి మంత్రిపదవులు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నారు. ఇక్కడే కోమటిరెడ్డి లాజిక్ మిస్సవుతున్నారు. ఖమ్మంజిల్లాలో ముగ్గురు మంత్రులున్నది వాస్తవమే. అయితే ఆ ముగ్గురిలో తుమ్మల నాగేశ్వరరావు కమ్మ, భట్టి విక్రమార్క ఎస్సీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మూడుసామాజికవర్గాలకు చెందిన వారు. సామాజికవర్గాల సమతుల్యత కారణంగా ముగ్గురినీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పైగా ముగ్గురూ తమ సామాజికవర్గాల్లో పట్టున్న నేతలే.
ఇక నల్గొండ జిల్లా విషయం చూస్తే ఇపుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకే సామాజికవర్గానికి చెందినవారు. ఇప్పటికే ఇద్దరు రెడ్లున్న కారణంగా నల్గొండజిల్లాలో మరో రెడ్డికి అవకాశం ఇవ్వలేరు. పైగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి స్వయాన అన్నదమ్ములు. ఎనుముల రేవంత్ రెడ్డితో కలుపుకుని ఇప్పటికే రెడ్లు మంత్రివర్గంలో నలుగురున్నారు. బీసీ వాదన బలంగా వినబడుతున్న నేపధ్యంలో మరో రెడ్డికి అందులోను అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తోడు తమ్ముడిని క్యాబినెట్ లోకి తీసుకోవటం కష్టమే. నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో అసలు చోటేలేదు. కాబట్టి పై జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలని అనుకుంటే అప్పుడు ఆజిల్లాల్లోని రెడ్డి సామాజికవర్గం ఎంఎల్ఏకి ఎవరికైనా మంత్రిగా ఇచ్చే అవకాశముంది. అంతేకాని నల్గొండ నుండి అయితే మరో రెడ్డికి అవకాశం దాదాపు ఉండదనే అనుకోవాలి. ఈ లాజిక్ అర్ధంచేసుకోకుండా తనకు హామీ ఇచ్చారు కాబట్టి మంత్రిపదవి ఇచ్చి తీరాల్సిందే అని రాజగోపాలరెడ్డి ప్రతిరోజు చాక్లెట్ కోసం చిన్నపిల్లాడు గోలచేసినట్లు రేవంత్ ను టార్గెట్ చేస్తు వ్యాఖ్యలు చేయటం పార్టీలో చర్చనీయాంశమవుతోంది.
బీఆర్ఎస్ విషయంచూస్తే ఇక్కడ అన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెల్లెలు, ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత బల్లెంలాగ తయారయ్యారు. పార్టీ అధినేత, తండ్రి కేసీఆర్ ను ఏమనకుండా తన ఆరోపణలు, విమర్శలన్నీ కేటీఆర్ లక్ష్యంగానే చేస్తున్నారు. అన్నపేరు ప్రస్తావించకపోయినా కవిత ఎవరిని ఉద్దేశించి ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారో అందరికీ అర్ధమైపోతోంది. కవిత ఆరోపణలు, విమర్శలకు సమాధానం చెప్పలేక, వాటిని ఖండించలేక కేటీఆర్ నానా అవస్తలు పడుతున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనంచేయటానికి ప్రయత్నాలు జరిగాయన్న కవిత ఆరోపణలు పార్టీ ఇమేజిని బాగా డ్యామేజి చేశాయి.
ఇక ఫైనల్ గా రాజాసింగ్ విషయం చూస్తే ఈయన మరీ విచిత్రం. పార్టీ అధ్యక్షపదవి ఎన్నికలో నామినేషన్ వేయటానికి వచ్చినపుడు అడ్డుకున్నారన్న కోపంతో పార్టీకి రాజీనామాచేశారు. రాజీనామాను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించి చాలా రోజులైంది. టెక్నికల్ గా రాజాసింగ్ కు పార్టీతో సంబంధంలేదు. అయినా సరే ప్రతిరోజు ఎంఎల్ఏ పార్టీగురించే మాట్లాడుతున్నారు. పార్టీలో ఎవరూ చేరవద్దని పిలుపివ్వటం బీజేపీలో పెద్ద చర్చనీయాంశమైంది. పార్టీలో రాక్షసులున్నారు ఎవరినీ ఎదగనీయరు అన్న వ్యాఖ్యలు నాయకత్వానికి సూటిగా తగిలాయి. పార్టీలో చేరేముందు ముందువరసలో ఉండే నేతలు చేరిన తర్వాత మెల్లిగా చివరివరసకు వెళ్ళిపోతారన్న వ్యాఖ్యలు బహుశా రెండు రోజుల క్రితమే పార్టీలో చేరిన మాజీ ఎంఎల్ఏ గువ్వల బాలరాజును ఉద్దేశించి చేసినట్లున్నారు.
పార్టీలో చేరేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని, అదికూడా ఏమీ ఆశించకుండా పార్టీలో చేరాలని హితవు పలికారు. పార్టీ అన్నాక నేతల మధ్య ఆధిపత్య గొడవలు జరగటం చాలా సాధారణం. అలాంటి వివాదాలను కూడా రాజాసింగ్ బజారును పడేస్తున్నారు. ఇపుడు నాయకత్వానికి వచ్చిన సమస్య ఏమిటంటే రాజాసింగ్ కు పార్టీతో ఎలాంటి సంబంధంలేదు కాబట్టి ఆయనపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు. పోనీ ఎంఎల్ఏని కంట్రోల్ ఉంచుకుందామా అంటే అందుకు రాజాసింగ్ లొంగటంలేదు. పైగా పార్టీలోని లోపాలను, నేతల వైఖరులపై బాహాటంగా ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తుండటం పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా తయారైంది.
హోలు మొత్తంమీద ముగ్గురు నేతల అజెండా చాలాస్పష్టంగా కనబడుతోంది. అదేమిటంటే మంత్రిపదవి దక్కించుకోవాలన్నది రాజగోపాలరెడ్డి లక్ష్యం. రాకపోతే ఎవరి మీదైనా సరే ఆరోపణలు, విమర్శలతో రోడ్డెకెక్కటం కోమటిరెడ్డి నైజం. ఇక కవిత విషయం చూస్తే వీలైనంతలో కేటీఆర్ మీద బురదచల్లటమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు. పార్టీలోనే ఉంటూ రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు మద్దతు పలకటమే దీనికి ఉదాహరణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపణలు గుప్పిస్తుంటే కవితేమో మద్దతుగా మాట్లాడుతున్నారు. తనమీద పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునేట్లుగా కవిత పార్టీ నాయకత్వాన్ని రెచ్చగొడుతున్నట్లు అనుమానాలు పెరుగుతున్నాయి. పార్టీలో ఉన్నంతకాలం తనను బాగా ఇబ్బందిపెట్టిన పార్టీనాయకత్వం మీద కసితీర్చుకోవటమే రాజాసింగ్ టార్గెట్ లాగుంది. అందుకనే పేరు ప్రస్తావించకుండానే అందరికీ తెలిసిపోయేట్లుగా ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. ఈముగ్గురిని పార్టీలు ఎలా డీల్ చేస్తాయో చూడాల్సిందే.