గ్రహాలు కేసీఆర్ ను చిన్నచూపు చూస్తున్నాయా ?

బీఆర్ఎస్ చీఫ్(BRS Chief KCR) కు జాతకాలు, వాస్తులు, పూజలు, యాగాలంటే చాలా బలమైన నమ్మకం ఉంది కాబట్టే.

Update: 2024-11-02 07:10 GMT
BRS Chief KCR

కొంతకాలంగా గ్రహాలు కేసీఆర్ కు మొహం చాటేసినట్లున్నాయి. పదేళ్ళు బ్రహ్మాండంగా ఉన్న కేసీఆర్ గ్రహబలం ఇపుడు బాగా బలహీనపడిపోయినట్లుంది. అందుకనే గడ్డు పరిస్ధితులు ఎదుర్కొంటున్నారు. కేసీఆర్, గ్రహబలం అని ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే బీఆర్ఎస్ చీఫ్(BRS Chief KCR) కు జాతకాలు, వాస్తులు, పూజలు, యాగాలంటే చాలా బలమైన నమ్మకం ఉంది కాబట్టే. అందుకనే కేసీఆర్ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్ధితిని గ్రహబలం(Planets)కు ముడిపెట్టింది. ఇపుడు విషయం ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి కేసీఆర్ ఎదుర్కొంటున్న సమస్యలు ఒక ఎత్తయితే తొందరలో మరిన్ని కష్టాలు కమ్ముకోబోతున్నట్లు సూచనలు కనబడుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్ళు(Power Purchase), పవర్ ప్లాంట్ల ఏర్పాటులో భారీ ఎత్తున అవినీతి(Corruption) జరిగిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. దానిపై విచారణ జరిపేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్సులతో కమిషన్ వేసింది. ఆ కమిషన్ అన్నీ కోణాల్లో విచారించి, విద్యుత్ రంగంలో నిపుణులతో మాట్లాడి, ఉన్నతాధికారులను విచారించి ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

కమిషన్ ఛైర్మన్ గా మొదట జస్టిస్ నరసింహారెడ్డి(Justice Narasimha Redddy) చాలావరకు విచారణ చేశారు. అయితే మీడియాతో మాట్లాడారన్న కారణంగా సుప్రింకోర్టు నరసింహారెడ్డి స్ధానంలో మరోకళ్ళని నియమించమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకనే నరసింహారెడ్డి ప్లేసులో ప్రభుత్వం మరో రిటైర్డ్ జస్టిస్ మదన్ బీ లోకూర్(Justice Madan B Lokur) ను నియమించింది. లోకూర్ కూడా వివిధ కోణాల్లో విచారణ జరిపి ఫైనల్ గా ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆ నివేదికపై ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి శుక్రవారం సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వవర్గాల సమాచారం ప్రకారం జరిగిన భారీ అవినీతికి కేసీఆరే కారణమని రిపోర్టులో ఉంది. పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో జరిగిన విద్యుత్ అవకతవకలకు, అవినీతికి కేసీఆర్ మాత్రమే బాధ్యుడని కమిషన్ విచారణలో పలువురు నిపుణులు, ఉన్నతాధికారులు సాక్ష్యాలుగా డాక్యుమెంట్లను అందించినట్లు తెలుస్తోంది.

ఛత్తీస్ ఘడ్(Chhattisgarh) నుండి 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి(Yadadri), భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల(Bhadadri Power Plant) ఏర్పాటులో భారీ అవినీతి జరిగిందని కమిషన్ కు కావాల్సినన్ని సాక్ష్యాలు దొరికినట్లు సమాచారం. కేసీఆర్ చేసిన తప్పులేంటి, జరిగిన అవినీతి, అవినీతి ఏ రూపంలో జరిగిందనే విషయాలను విద్యుత్ రంగ నిపుణులు సాక్ష్యాల ఆధారంగా కమిషన్ కు అందించారు. 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఛత్తీస్ ఘడ్ తో ఒప్పందం కుదుర్చుకున్న కేసీఆర్ ఆ మేరకు కొనుగోళ్ళు చేయలేదని నిపుణులు, ఉన్నతాధికారులు కమిషన్ కు చెప్పారు. ఒప్పందం ప్రకారం కొనుగోళ్ళు చేయలేదు కాబట్టే పవర్ గ్రిడ్ కు భారీ జరిమానా కూడా తెలంగాణా ప్రభుత్వం చెల్లించిందని ఉన్నతాధికారులు, నిపుణులు చెప్పారు. ఔట్ డేటెడ్ టెక్నాలజీని ఉపయోగించిన కారణంగా భద్రాద్రి పవర్ ప్లాంటులో పెద్దఎత్తున నష్టాలు వచ్చినట్లు ఉన్నతాధికారులు లెక్కలు, ఉదాహరణలతో సహా కమిషన్ కు వివరించినట్లు సమాచారం. విద్యుత్ రంగ నిపుణుడు కంచర్ల రఘు, తెలంగాణా జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్(Prof KodandaRam) తో పాటు చాలామంది నిపుణులు, ఉన్నతాధికారులు అందించిన డాక్యుమెంట్ల ఆధారంగా అవినీతి, అవకతవకలకు కేసీఆరే బాధ్యుడని రిపోర్టులో ఉందని తెలుస్తోంది.

కేసీఆర్ పై చర్యలు

రిపోర్టు ఆధారంగా కేసీఆర్ పైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం గట్టిగా డిసైడ్ అయ్యింది. అయితే కేసీఆర్ పైన ఏమైనా చర్యలు తీసుకుంటే ప్రజాస్పందన ఎలాగుంటుందని ఆలోచిస్తోంది. కేసీఆర్ అవినీతిని ఎండగట్టాలంటే ముందు రిపోర్టును క్యాబినెట్లో చర్చించాలి. అంతకన్నా ముందు రిపోర్టును స్టడీ చేయటం కోసం మంత్రవర్గ ఉపసంఘాన్ని నియమించే అవకాశాన్ని రేవంత్(Revanth Reddy) పరిశీలిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ ఉపసంఘం రిపోర్టును స్టడీచేసి చేసే సిఫారసుల ఆధారంగానే కేసీఆర్ మీద యాక్షన్ తీసుకుంటే చట్టబద్దంగా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. క్యాబినెట్లో రిపోర్టుతో పాటు మంత్రివర్గ సిఫారసులను చర్చించిన తర్వాత ఇదే రిపోర్టు, సిఫారసులపై అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చించాలన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోవాలి కాని యాక్షన్ తీసుకోవటానికి ప్రభుత్వం తొందరపడుతున్నట్లుగా కనబడకూడదన్నది రేవంత్ వ్యూహం.

కేసీఆర్ మీద తీసుకోబోయే యాక్షన్ న్యాయసమీక్షకు నిలబడేట్లుగా ఉండాలన్నది ప్రభుత్వ పెద్దల మనోగతంగా కనబడుతోంది. ఎందుకంటే తనమీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవటానికి రెడీ అయితే కేసీఆర్ చూస్తు ఊరుకోరు. వెంటనే కోర్టులో కేసు వేస్తారు. అప్పుడు రిపోర్టును, మంత్రివర్గ ఉపసంఘం సిఫారసును, అసెంబ్లీ చర్చను, తీర్మానాన్ని కోర్టులో ప్రవేశపెట్టాల్సుంటుంది. అందుకనే కేసీఆర్ మీద చర్చల విషయమై అన్నీ కోణాల్లో ఆలోచించి జాగ్రత్తగా పావులు కదపాలన్నది రేవంత్ ఆలోచన. ఏదేమైనా కేసీఆర్ మీద చర్యలు తీసుకోవటం ఖాయమన్నట్లుగానే ఉంది వ్యవహారం. ఎప్పుడు మొదలవుతుందన్నది మాత్రం సస్సెన్సుగా ఉంది.

Tags:    

Similar News