ఈ మాజీ మంత్రి అధికార పార్టీతో పాటు సొంత పార్టీని ఇరకాటంలోకి నెట్టాడా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ నిరుద్యోగుల విషయంలో రాసిన లేఖతో అనేక విషయాలు గుర్తుకు వచ్చాయి. అవేంటంటే..

Update: 2024-06-22 14:13 GMT

తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు నిరుద్యోగుల విషయంలో ప్రతీసారి తమ అవసార్థం కుటిల రాజకీయాలకు పాల్పడుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా, అలాగే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో వచ్చినప్పుడు మరో మాట మాట్లాడుతున్నాయి.

మొత్తానికి ఎన్నికల రాజకీయాలే పరమావధిగా ఇరు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయా.. అంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు రాసిన ఓ లేఖతో ఈ విషయం మరోసారి జనం మదిలో మెదిలింది. ఆయన రాసిన ఒక లేఖ తో రెండు పార్టీలు చేసిన రాజకీయాలు తేటతెల్లమయ్యాయని చెప్పవచ్చు.

హరీష్ రావు లేఖలో నిరుద్యోగ భృతి, గ్రూప్స్ క్యాలెండర్, జీవో 46 వంటి అంశాలను ప్రస్తావించారు. ఇంతకీ తెలంగాణలో ఇంతకుముందు జరిగింది... ఇప్పుడేం జరుగుతోంది. అధికార ప్రతిపక్షాలు ఎలా వ్యవహరిస్తున్నాయో ఓసారి పరిశీలిస్తే..

నిరుద్యోగ భృతి..
2018 లో ఎన్నికలు జరుగుతున్న వేళ అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు భృతి ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఖాళీలన్నీ పూర్తి చేస్తానని ప్రకటించారు. దాన్ని నమ్మిన ప్రజలు అప్పటి వరకూ తెలంగాణలో ఏ పార్టీకి ఇవ్వనన్నీ సీట్లు అంటే 119 సీట్లలో 88 స్థానాలు ఇచ్చి గెలిపించారు.
కానీ షరా మూమూలే నిరుద్యోగ భృతి అనే హామీ అటకెక్కింది. ఇదే అంశాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రతీసారి ప్రస్తావించింది. బీఆర్ఎస్ తెలంగాణ నిరుద్యోగులకు ఇన్ని వేల కోట్లు బాకీ ఉన్నారని ఆందోళనలు చేశాయి. తాము అధికారంలోకి వస్తే నెలానెలా రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది.
కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇదే విషయంపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఏకంగా అసెంబ్లీలో మేము ఎన్నికల్లో తాము ఆ హమీ ఇవ్వలేదని నాలిక మడతేశారు. కానీ ఆధునిక కాలంలో సోషల్ మీడియా ఈ విషయాన్ని వీడియోల సహితంగా బయటపెట్టింది. కానీ ఇప్పటివరకూ దానిపై మళ్లీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు.
అంటే నిరుద్యోగ భృతి ఇక దేవుడి హుండీలో పడినట్లే. బీఆర్ఎస్ దారిలో నే తాము నడుస్తున్నామని ప్రకటించినట్లు అయింది. ఇప్పుడు తాజాగా హరీష్ రావు రాసిన లేఖ లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హమీని నెరవేర్చాలని అందులో కోరారు.
గ్రూప్స్ క్యాలెండర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని వాగ్ధానం చేసింది. కానీ కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చే జాడ మాత్రం కనిపించడంలేదని చెప్పాలి. ఎందుకంటే గ్రూప్ 1 పరీక్ష మెయిన్ పరీక్షలు ఎప్పుడో అక్టోబర్ లో ఉన్నాయి. గ్రూప్ 2 ఆగష్టులో ఉంది. తరువాత గ్రూప్ 3 పరీక్షలు. వీటి నిర్వహణలోనే టీజీపీఎస్సీ తలమునకలై ఉంది.
కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడం, ఇప్పుడు ఉన్న పరీక్షలు నిర్వహించడం దానికి కత్తీమీద సామే. కాబట్టి ఒకే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల హమీ అటకెక్కినట్లే. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం ఆరు నెలలే అయింది కాబట్టి ఈ విషయంలో కొంచెం సడలింపు అవసరం.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆందోళనలతో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయని, రెండు పరీక్షల వ్యవధి దగ్గరగా ఉందని నిరుద్యోగులు టీఎస్పీఎస్పీని ముట్టడి చేశారు. అప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తాము అధికారంలోకి వస్తే వారి బాధలను సావకాశంగా పరీశీలిస్తామని ప్రకటించారు.
అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 కి అదనంగా మరో మూడు వేల ఉద్యోగాలు కలుపుతామని హమీ ఇచ్చారు. కానీ అవేవీ లేకుండా పరీక్షలను అలాగే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గ్రూప్ 2 ను వాయిదా వేయాలని కోరగా, ప్రభుత్వం అసలు దాన్ని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
గ్రూప్ -1 మెయిన్స్ నిష్పత్తి
తెలంగాణలో అత్యంత వివాదస్పదంగా మారిన గ్రూప్ 1 పరీక్ష విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాలుక మడతేయడంలో ఆరితేరాయి. 2023 జనవరిలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. అప్పట్లో మెయిన్స్ పరీక్ష కోసం 1:50 లో ఎంపిక చేశారు. అయితే దీనిని 1:100కు మార్చాలని అప్పటి కాంగ్రెస్ శాసనసభ పక్షం నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. కానీ తాజాగా టీజీపీఎస్పీ నిర్వహించిన గ్రూప్ 1 రీ నోటిఫికేషన్ ప్రిలిమ్స్ పరీక్ష లో మెయిన్స్ కోసం పాత విధానంలో అంటే 1:50 పద్దతిలోనే నిర్వహిస్తామని ప్రకటించింది.
ఇప్పుడు ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు రాసిన లేఖలో ప్రస్తావించారు. దీనిపై రెండు పార్టీలు ఆడుతున్న రాజకీయాలు గమనించాలని గ్రూప్ 1 పరీక్ష రాసిన ఓ అభ్యర్థి ఫెడరల్ తో అన్నారు. ‘నేను 2022 నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నాను. ఇప్పటికి మూడు సార్లు ప్రిలిమ్స్ పరీక్ష రాశాను. కానీ మెయిన్స్ కంటే ముందే గ్రూప్ 2 ఉంది. రెండుసార్లు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడం, న్యాయవివాదాలు ఉండటంతో గ్రూప్ 2 ప్రిపరేషన్ మొదలుపెట్టాను. కానీ సడన్ గా గ్రూప్ 1 పరీక్ష కు క్లియరెన్స్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ మెయిన్స్ కు చదువుతున్నా. గ్రూప్ 2 ను మెయిన్ పూర్తి అయ్యాక నిర్వహిస్తే బాగుంటుంది’’ అని హుజూరాబాద్ కు చెందిన ఓ అభ్యర్థి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
హరీష్ రావు కూడా లేఖలో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. జూలై చివర్లో డీఎస్సీ పరీక్షలు ఉండటం ఆ తరువాత గ్రూప్ 2 ఉండటంతో విద్యార్థులు ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నారని వివరించారు. సంగీత అనే నిరోద్యోగి ఆత్మహత్య చేసుకుందని సీఎం కు రాసిన లేఖలో ప్రస్తావించారు.
అభ్యర్థులు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పరీక్షల మధ్య తగినంత గ్యాప్ ఉండాలని కోరుకుంటున్నారు. ఎప్పుడో కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు రావు. వస్తే అన్ని ఒకే సమయంలో వచ్చి ఏది చదవాలో అర్థంకానీ అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. సివిల్స్ నిర్వహిస్తున్నట్లు కచ్చితమైన ప్రణాళికతో పోటీ పరీక్షలు పెట్టాలని చాలామంది అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే అధికారంలోకి రాగానే 25 వేలతో మెగా డీఎస్పీ నిర్వహిస్తామనే హమీని సైతం ప్రభుత్వం పక్కన పెట్టింది. కేవలం 11 వేలతో నోటిఫికేషన్లు ఇచ్చినట్లు హరీష్ రావు ఆరోపించారు. మేనిఫెస్టో లో చెప్పినట్లుగా మిగిలిన ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అలాగే జీవో 46 రద్దు చేస్తామని హమీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తరువాత దానిని రద్దు చేయకుండానే ఉద్యోగ నియమాకాలను చేపట్టింది.
దీన్ని మోసపూరిత వైఖరిగా బీఆర్ఎస్ నేత ఆరోపించారు. ఈ సమస్యలనే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నీ రోజులు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇలానే వ్యవహరిస్తుందా అనే అనుమానం కలుగుతోంది. కానీ ఆ పార్టీకి మరో నాలుగున్నర ఏళ్లు సమయం ఉంది. ఈ లోగా ఇచ్చిన హమీలన్నీ అమలు చేస్తుందా? ప్రజల దగ్గరికి ఎలాంటి ప్రొగ్రెస్ రిపోర్టుతో వస్తుందో వేచి చూడాలి.
ఇప్పుడు ఆ పార్టీకి ఎలాంటి ఎన్నికల టెన్షన్ లేదు. కేవలం స్థానిక సంస్థలకు ఎన్నికలు మాత్రమే నిర్వహించాల్సి ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పని. దాని ఎన్నికలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.. ఎవరు గెలిచినా అధికారంలో ఉన్న వాళ్లదే విజయం అంటారు.
Tags:    

Similar News