సుప్రింకోర్టు ముందు మూడు ఆప్షన్లున్నాయా ?
సుప్రింకోర్టు తీర్పు ఎలాగ ఉండే అవకాశాలున్నాయనే విషయంలో చర్చలు మొదలయ్యాయి;
బీఆర్ఎస్ ఎంఎల్ఏల ఫిరాయింపులపై సుప్రింకోర్టులో తీవ్రస్ధాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. తమ పార్టీనుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలపై వెంటనే అనర్హత వేటు వేయాల్సిందే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరపున లాయర్ ఆర్యమా సుందరం గట్టిగా వాదనలు వినిపించారు. అలాగే ఫిరాయింపు ఎంఎల్ఏలపై విచారణ జరిపి అనర్హత వేటు వేసేందుకు నిర్దిష్టగడువు విధించేందుకు లేదని తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సెక్రటరీ తరపున లాయర్ అభిషేక్ సింఘ్వి వాదించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అధికార పరిధిలో న్యాయస్ధానాలు జోక్యం చేసుకునేందుకు లేదని సింఘ్వీ గట్టిగానే తన వాదనలు వినిపించారు. స్పీకర్ తరపు లాయర్ ముకుల్ రోహిత్గీ తన వాదనలు వినిపిస్తు నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టులు స్పీకర్ ను శాసించలేవన్నారు. మెడమీద తుపాకి పెట్టి ఇంతకాలంలోపు నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పేందుకు లేదని రోహిత్గీ అన్నారు. అందరితరపున వాదనలు విన్న సుప్రింకోర్టు తీర్పును రిజర్వుచేసింది.
ఈ నేపధ్యంలో సుప్రింకోర్టు తీర్పు ఎలాగ ఉండే అవకాశాలున్నాయనే విషయంలో చర్చలు మొదలయ్యాయి. ఇక్కడే సుప్రింకోర్టు ముందు మూడు ఆప్షన్లున్నట్లు కనబడుతోంది. అవేమిటంటే ఒకటి : బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏలపై (BRS Defection MLAs)అనర్హత వేటు విషయంలో స్పీకర్ కు సూచనలు ఇవ్వటం. అంటే అనర్హత వేటు విషయంలో ఏదో ఒక నిర్ణయాన్ని తొందరగా తీసుకోవాలని స్పీకర్ కు సూచించటం. నిర్ణయం తీసుకునే విషయంలో సుప్రింకోర్టు గనుక నిర్దిష్ట గడువు విధిస్తే స్పీకర్ ఏమిచేస్తారన్నది ఆసక్తిగా మారింది. రెండో ఆప్షన్ : ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై సుప్రింకోర్టే ఒక నిర్ణయం ప్రకటించటం. ఈ అంశానికి అవకాశం చాలాచాలా తక్కువ. ఎందుకంటే స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని సుప్రింకోర్టు ప్రకటించేందుకు లేదు. ఇలాగచేస్తే శాసనవ్యవస్ధ అధికారాల్లో న్యాయవ్యవస్ధ జోక్యం చేసుకున్నట్లే అవుతుంది.
ఇక మూడో ఆప్షన్ : ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవటానికి ఎంతకాలం గడువు కావాలో స్పీకర్నే అడగటం. ఈ మూడో ఆప్షన్ కాస్త రీజనబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఫిరాయింపుల అనర్హతపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను సుప్రింకోర్టు ఆదేశించేందుకు లేదన్నది వాస్తవం. సుప్రింకోర్టు ఎప్పుడు జోక్యం చేసుకునే అవకాశం ఉందంటే స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకున్నపుడు మాత్రమే. స్పీకర్ నిర్ణయం తీసుకునేంతవరకు సుప్రింకోర్టు ఎలాంటి సమీక్ష చేసేందుకు లేదు. ఇదేవిషయాన్ని స్పీకర్ లాయర్ రోహిత్గీ పదేపదే జస్టిస్ బీఆర్ గవాయ్ కు గుర్తుచేశారు. ఫిరాయింపులపై అనర్హత అవసరంలేదని స్పీకర్ నిర్ణయించినా లేదా అనర్హత వేటు వేసినా ఆ నిర్ణయంపైన కోర్టులకు సమీక్షించే అధికారాలున్నాయి. అంతేకాని నిర్ణయం తీసుకోకముందే స్పీకర్ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకునేందుకు లేదు.
ఈపాయింట్ మీదే గతంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్(BRS Chief KCR) టీడీపీ(TDP), కాంగ్రెస్(Congress) నుండి యధేచ్చగా ఫిరాయింపులను ప్రోత్సహించారు. తమపార్టీల నుండి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలు ఎన్నిసార్లు మొత్తుకున్నా అప్పట్లో స్పీకర్లు పదేళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇదే విషయమై స్పీకర్ కు వ్యతిరేకంగా పై రెండుపార్టీలు కోర్టుల్లో కేసులు వేసినా ఎలాంటి ఉపయోగం లేకపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకని ప్రస్తుత ఫిరాయింపులపై అనర్హత వేటు విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఎంత గడువు కావాలనే విషయాన్ని సుప్రింకోర్టు స్పీకర్నే అడిగే అవకాశం ఉంది. దీనివల్ల శాసనవ్యవస్ధ అధికారాల్లో న్యాయవ్యవస్ధ జోక్యం చేసుకున్నట్లు ఉండదు. మరి పై మూడు ఆప్షన్లలో సుప్రింకోర్టు దేన్ని ఎంచుకుంటుందన్నది ఇపుడు ఆసక్తిగా మారింది.